దేశంలో గ్రంథాలయ వ్యవస్థను బలపరచాలి!

by Ravi |   (  Updated:2025-08-03 00:30:08  IST  )

మన దేశంలో గొప్ప సాహిత్య సంపద, సంస్కృతిక వారసత్వాలు ఉన్నాయి. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న

దేశంలో గ్రంథాలయ వ్యవస్థను బలపరచాలి!
X

మన దేశంలో గొప్ప సాహిత్య సంపద, సంస్కృతిక వారసత్వాలు ఉన్నాయి. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రంథాలయాలకు చెదలు పడుతున్నాయి. ఇది విచారకర పరిణామం. దేశవ్యాప్తంగా 54,854 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో అతి తక్కువ మాత్రమే ఆధునికత సంతరించుకొన్నాయి. ప్రభుత్వ గ్రంథాలయాల్లో సగటు పుస్తకాల సంఖ్య 5700 కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షా 8 వేల పుస్తకాలు ఉన్నాయి. పన్నెండు శాతం గ్రంథాలయాల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిలో కొన్నింటికి మాత్రమే ఇంటర్నెట్ వసతి ఉందని 2018 యూనిస్కో ఇన్ డిగ్రీ ఆఫ్ స్టేటస్టిక్స్ రిపోర్ట్ తెలిపింది. ఈ వ్యవస్థలో 12 లక్షల మంది పని చేస్తున్నారు. కానీ వీరిలో వృత్తి పరమైన అర్హతలు ఉన్నవారు కేవలం పది శాతం మందే. ఇది మన గ్రంథాలయ వ్యవస్థ పరిస్థితి. మనదేశం ప్రపంచంలోనే అత్యధిక యువత వున్న దేశం. వీరి శక్తి యుక్తులు పూర్తి స్థాయిలో దేశానికి అందాలంటే వారికి మంచి శిక్షణ అవసరం. అందుకు గ్రంథాలయాలు అత్యంత ముఖ్యం. అంతర్జాతీయ పోటీ ప్రపంచ అవసరాలకు ధీటుగా జ్ఞాన సముపార్జన అవకాశాలను అన్ని తరాల వారికి సుగమం గావించాలి. అందుకు ఈ-బుక్స్, ఆడియోలు, గ్రాఫిక్ నవలలు అవన్నీ యువతకు అందుబాటులో ఉండేట్టు చేయాలి. అదే సమయంలో స్థానిక సమాజ సంగతులు ప్రతిబింబించే స్థానిక కధా రచయితల కథలు, మండలికాలను ఆదరించాలి. ఇక లైబ్రరీలల్లో రచయితల, వక్తల ఉపన్యాసాలు, కవితా గోష్టులు నిర్వహించడం వలన పద సౌందర్యం తెలుస్తుంది. సాహిత్య ఆసక్తి అంకురిస్తుంది. దేశ భాషలు బాసిల్లుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ లైబ్రరీలు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని ప్రభుత్వాలు చక్కపరచాలి. ప్రజల భాగస్వామ్యంతో నేటి అవసరాలకు తగ్గట్టు గ్రంథాలయాలు తీర్చిదిద్దాలి. మనో వికాసంలోనే ప్రగతి దాగి వుంది. ప్రతి తరం వికాసానికి గ్రంథాలయాలు అవసరం.

-వి. వరదరాజు,

94925 42033

Next Story