- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ గడ్డ... రక్షణ రంగ ఉత్పత్తుల అడ్డా!
పుట్టపర్తిలో ప్రారంభమైన AMCA ప్రాజెక్ట్ రాయలసీమ భవిష్యత్తును మార్చే సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతోంది. దేశీయ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీతో పాటు వేలాది ఉద్యోగాలు, డిఫెన్స్ మరియు డ్రోన్ పరిశ్రమలకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.

ఒకప్పుడు కరువు, వలసలు, నిరుద్యోగం అనే పదాలతో గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు కొత్త చరిత్రకు సిద్ధమవుతోంది. పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరగడం కేవలం ఒక పరిశ్రమ ప్రారంభం కాదు. ఇది రాయలసీమ భవిష్యత్తును మార్చే సాంకేతిక, పారిశ్రామిక విప్లవానికి నాంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ భారతదేశం స్వయంగా అభివృద్ధి చేస్తున్న తొలి ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమం కావడం విశేషం.
పుట్టపర్తి ఎంపికలో వ్యూహాత్మక కారణాలు..
ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ అత్యాధునిక సాంకేతికత ఇప్పుడు భారతదేశంలో, అదీ రాయలసీమ నేలపై రూపుదిద్దుకోబోతోంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌ను కేవలం పరిశ్రమగా కాకుండా భారత రక్షణ రంగ చరిత్రలో ఒక కీలక మలుపుగా చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ రన్‌వే అందుబాటులో ఉండటం, బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి సమీపంలో ఉండటం, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉండటం వంటి అంశాలు దీనికి అనుకూలంగా మారాయి. ఫ్లైట్ టెస్టింగ్‌కు అవసరమైన ప్రశాంత వాతావరణం, విస్తారమైన భూములు కూడా పుట్టపర్తికి ఆనుకూల ఆంశం నిలిచాయి. దీంతో భవిష్యత్తులో ఇది దేశంలోనే అత్యంత కీలక ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి రక్షణ పరిశోధన సదుపాయాలు రాయలసీమలో ఏర్పడటం ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చే పరిణామంగా భావిస్తున్నారు.
స్థానిక యువతకు భారీగా ఉపాధి!
ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళ్లాల్సి వచ్చిన యువతకు ఇప్పుడు తమ ప్రాంతంలోనే అవకాశాలు కనిపి స్తున్నాయి. ప్రత్యక్షంగా వేలాది ఉద్యోగాలతో పాటు పరోక్షంగా మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. యుద్ధ విమానాల తయారీ అంటే కేవలం ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు. దాని చుట్టూ వందలాది అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయి. ఎలక్ట్రానిక్ భాగాల తయారీ యూనిట్లు, డ్రోన్ టెక్నాలజీ సంస్థలు, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కంపెనీలు, మెటల్ ఫ్యాబ్రికేషన్ పరిశ్రమలు ఒక్కొక్కటిగా వస్తాయి. దీంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయి.
రాయలసీమలో పారిశ్రామిక వాతావరణం..
రాయలసీమలో పారిశ్రామిక వాతావరణం పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయి సాంకేతికతకు నిదర్శనం. ఈ పరిణామంలో మరో ముఖ్యమైన అంశం కర్నూలులో ఏర్పాటు కానున్న డ్రోన్ సిటీ. ఎనిమిది కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నాయి. డ్రోన్ టెక్నాలజీ ఇక యుద్ధరంగానికే పరిమితం కాదు. వ్యవసాయం, వైద్య సేవలు, విపత్తు నిర్వహణ, సరుకు రవాణా వంటి అనేక రంగాల్లో దీని వినియోగం పెరుగుతోంది. భవిష్యత్తులో కర్నూలు దేశ డ్రోన్ హబ్‌గా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశ రక్షణ రంగానికి వెన్నెముక..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సిఎల్, అగ్నియాస్త్ర వంటి సంస్థల పెట్టుబడులు కూడా ఆంధ్రప్రదేశ్‌ను రక్షణ తయారీ రంగంలో కీలక రాష్ట్రంగా నిలబెట్టే సూచనలు ఇస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో నౌకాదళ వ్యవస్థల తయారీ కేంద్రం, టార్పెడో తయారీ సదుపాయాలు వంటి ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి కొత్త అవకాశాలు తీసుకురానున్నాయి. AMCA ప్రాజెక్ట్ విజయవంతమైతే రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మారిపోవచ్చు. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించిన నేల... రేపు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే అవకాశం ఉంది. అది భారత ఆత్మవిశ్వాసానికి, స్వదేశీ సాంకేతికతకు, మారుతున్న రాయలసీమ భవిష్యత్తుకు ప్రతీక.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445






