- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండిగో సంక్షోభం.. ప్రపంచీకరణ, గుత్తాధిపత్యంపై మళ్లీ ప్రశ్నలు
ఇటీవల ఇండిగో విమానాల సంఘటన భారతదేశంలో ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వర్గం పాలక వ్యవస్థల పనితీరుపై అనేక ప్రశ్నలను మరోసారి లేవనెత్తింది. గత దశాబ్దాలలో ప్రయాణీకులు ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు.

ఇటీవల ఇండిగో విమానాల సంఘటన భారతదేశంలో ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ వర్గం పాలక వ్యవస్థల పనితీరుపై అనేక ప్రశ్నలను మరోసారి లేవనెత్తింది. గత దశాబ్దాలలో ప్రయాణీకులు ఇలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. లగేజీ కౌంటర్లలో లగేజీని అప్పగించిన తర్వాత కూడా ఫ్లైట్లు రద్దు కావడం, ఆపై ప్రయాణీకు లకు తమ లగేజీ దొరక్కపోవడం లాంటి సంఘటనలు ప్రజలకు నోట్ల రద్దు నాటి అస్తవ్యస్తతను మరోసారి గుర్తు చేశాయి. ఎక్కడి వారు అక్కడే గప్‌చుప్ అయ్యే పరిస్థితి దాపురించింది.
ఇది కేవలం ఒక్క విమాన సంస్థ వైఫల్యం అని గానీ, ప్రస్తుత పాలకవర్గం గత విధానాలపై నింద వేసి తప్పించుకు నేంత తేలికైన సమస్య కాదు. ఒక్క నవంబర్‌లోనే దాదాపు 900 కంటే ఎక్కువ విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఆ తర్వాత డిసెంబర్ 6న 1600 ఫ్లైట్లు, డిసెంబర్ 7న 850 ఫ్లైట్లను రద్దు చేయడం చూస్తే, ఇంతటి అధిక స్థాయిలో సర్వీస్ లోపాలు, నియంత్రణలో వైఫల్యాలు భారత ప్రజలు గతంలో ఎప్పుడూ విన్నది లేదు.
రైల్వేల వైఫల్యంతో.. ఇండిగోకి స్వర్ణయుగం!
సాధారణ ప్రజలు, మధ్యతరగతి ఇప్పటికే భారతీయ రైల్వేలపై ఆశలు వదులుకున్నారు. గత బాలసోర్ రైలు సంఘటన గాయం ఇంకా ప్రజల జ్ఞాపకాల నుండి చెరిగి పోలేదు. రైల్వే సేవలలో నాణ్యతా ప్రమాణాలు అత్యంత దిగువ స్థాయిలో ఉన్నాయనేది ప్రయాణీకులందరికీ అనుభ వమే. ఒక్కొక్క సేవను కార్పొరేట్ కాంట్రాక్టుల గుప్పెట్లో పెట్టిన తర్వాత రైల్వే సేవలు మరింత దారుణంగా మారి పోయాయి. రైలు బోగీల్లో కంపుకొట్టే దుర్గంధాన్ని భరించక తప్పని పరిస్థితి. దానికి తోడు గంటల కొద్దీ రైళ్ల ఆలస్యం వర్ణనాతీతం. తక్కువ జీతాలు తెచ్చుకునే కార్మికులకు రైల్వే తప్ప మరో మార్గం లేదు.. ఈ విపత్కర సంధి దశలో మధ్యతరగతి ప్రజలు, కాస్త ఎక్కువ డబ్బులు ఇచ్చి అయినా సరే, విమాన సేవల్ని కొనుగోలు చేయాలని ఆశించారు. ఒకప్పుడు ధనిక వర్గానికి మాత్రమే పరిమితమైన విమాన ప్రయాణాన్ని, ఇండిగో వంటి కంపెనీలు చవకగా అందించడంతో, రైల్వేలపై అసంతృప్తితో ఉన్న మధ్యతరగతి వర్గం విమానాలపై ఆధారపడటం మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో, ఇలాంటి వర్గంతో భారతదేశంలో వ్యాపారం చేసి భారీ లాభాలను ఆర్జించవచ్చని భావించిన ఇండిగోకు మార్గం సుగమం అయింది. ఈ రెండు అంశాలు కలసి ఇండిగోకు గోల్డెన్ ఏజ్‌ను అందించాయి..
ప్రపంచీకరణ, గుత్తాధిపత్యం..
1990లో ప్రారంభమైన ప్రపంచీకరణతో, పాలకవర్గాలు దేశ ఆర్థిక విధానాలను పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా మార్చడం మొదలుపెట్టాయి. ఇటీవల అది వేగం అందుకుంది. ఇటీవల ఎల్ఐసీ తన నిధుల్ని భారీగా ఒక ప్రత్యేక కంపెనీ బాండ్ల కొనుగోలులో వినియోగించిందనే చర్చ కొనసాగుతుంది. అయితే ఎల్‌ఐసీ ఆ విమర్శను తిప్పి కొట్టినప్పటికీ, ప్రజల మెదళ్లలో సందేహాలు లేకపోలేదు. జియో ఉచిత సేవలతో టెలిఫోన్ రంగం ఒకటి రెండు సంస్థల చేతుల్లోకి వెళ్లినట్టుగానే, 'పెద్ద చేప చిన్న చేపను తినేసే' గుత్తాధిపత్యం ప్రతి రంగంలోనూ మొదలైంది. చివరకు లేబర్ కోడ్‌లలో మార్పులతో మొత్తం పారిశ్రామిక వాతావరణం కూడా పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా మారబోతోంది. శ్రమ దోపిడీ ఏ స్థాయిలో కొనసాగించినా సరే, శ్రామికుడిని 12 గంటలు పని స్థలాల్లో పనిచేయించినా సరే సమ్మెలను అంగీకరించేది లేదనే పరిస్థితి మెల్లమెల్లగా శిలాశాసనం కాబోతుందా? అనే ప్రశ్న కార్మికుల్లో మెదులుతూనే ఉంది..
పైలట్లకు విరామం లేకుండా విధులు...
నేడు విమాన సేవల్లో దాదాపు 60 శాతం మార్కెట్‌ను ఒక్క ఇండిగో ఆక్రమించింది. విరామం లేకుండా రైళ్లను నడిపే పైలట్ల మాదిరిగానే, లాభాల వేటలో విమాన సర్వీస్‌ల లో కూడా పైలట్లకు సరైన విరామం కలిగించకుండా కార్పొరేట్లు సేవలందిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వ సంస్థలు పైలట్లకు సరైన విరామం కలిగించడానికీ, ఇతర సేవల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయడానికీ ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం. అయితే, ఈ మార్పులకై కంపెనీలకు సంవత్సరం కంటే ఎక్కువ సమయం ఇచ్చినప్పటికీ, వారు ఆ సర్వీసులను అందించలేకపోవడం, దాంతో పాటు బుకింగ్‌లను తీసుకుంటూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం సమంజసం కాదు. సర్వీస్ అందించలేని పరిస్థితుల్లో బుకింగ్‌లను తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా, కనీసం రెండు రోజుల ముందు అయినా సరే రద్దు వార్తలను ప్రయాణికులకు అందించి ఉంటే, ఎయిర్‌పోర్ట్‌లో లగేజీలు జమ అయిన తర్వాత ఫ్లైట్లు అందకపోయే దారుణమైన పరిస్థితి తప్పేది.
ప్రైవేటీకరణ.. ‘పెనాసియా’ కాదు!
ధనవంతులు, మధ్యతరగతి వర్గం ప్రయాణం చేసే విమానాల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు, రైల్వేల వంటి సాధారణ ప్రజలు ప్రయాణించే సంస్థలనైనా, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, లేదా పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలనైనా ఇలాంటి ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగిస్తే, పరిస్థితులు ఇంకా ఎంత దారుణంగా ఉంటాయో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సర్వీసైనా ప్రైవేటీకరణ అయిన వెంటనే అది ఉన్నతంగా మారిపోతుందని నాయకులు భారత ప్రజల చెవుల్లో పూలు పెడుతుంటారు. భజనలో కూరుకుపోయిన కొంత భాగం మధ్యతరగతి వర్గం కూడా ఇదే భావించడం చూస్తున్నాం. కానీ, అది అన్ని వేళలా నిజం కాదని ఈరోజు ఇండిగో సంఘటన బహిర్గతం చేసింది. ప్రభుత్వాలను సైతం శాసించగలిగే స్థాయికి ఇలాంటి గుత్తాధిపత్య సంస్థలు రాకముందే, ప్రభుత్వాలు ప్రజల కోణంలో ఆలోచించి, ప్రజలకు పనికొచ్చే ఆర్థిక విధానాలు అవలంబించగలిగితేనే, ఇలాంటి విపత్కర పరిణామాల నుండి ప్రజలకు విముక్తి లభిస్తుంది.
కేశవ్
ఆర్థిక సామాజిక విశ్లేషకులు
98313 14213






