- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసమానతల అగాధంలో భారత విద్యా వ్యవస్థ
దేశ భవిష్యత్తు నిర్మాణానికి అఖండ పునాదిగా నిలవాల్సిన భారత విద్యా వ్యవస్థ,, నేడు లోపాలు, నిర్లక్ష్యం, అసమానతల భారంతో ఆధారాలు దెబ్బతిన్న శిఖరంలా విద్యా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. విద్య కేవలం బోధన కాదు

దేశ భవిష్యత్తు నిర్మాణానికి అఖండ పునాదిగా నిలవాల్సిన భారత విద్యా వ్యవస్థ,, నేడు లోపాలు, నిర్లక్ష్యం, అసమానతల భారంతో ఆధారాలు దెబ్బతిన్న శిఖరంలా విద్యా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తోంది. విద్య కేవలం బోధన కాదు, అది ఆర్థిక స్వావలంబనకు, సాంకేతిక శక్తి సంపన్నతకు, సామాజిక న్యాయ సాధనకు మార్గం చూపే విప్లవాత్మక శక్తి. ప్రతి విద్యార్థి సక్రమంగా మానవ వనరుగా వికసిస్తే భారతదేశం జ్ఞాన విప్లవానికి కేంద్రబిందు వుగా అవతరిస్తుంది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల లోటు, విధాన అస్పష్టత నాణ్యమైన విద్యను అడ్డుకుని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను దెబ్బతీశాయి.
ఏడు దశాబ్దాల సంస్కరణలు, విద్యా కమిషన్లు, విధానాలు గుణాత్మక విద్యను అందించడంలో విఫలమయ్యాయి. అక్షరాస్యత 80.9% ఉన్నప్పటికీ ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. నూతన జాతీయ విద్యా విధానం-2020 అవకాశాలు, సవాళ్లు రెండూ కలిగి ఉన్నప్పటికీ, రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా దాన్ని మలచుకుంటే విద్యలో నిజమైన సామాజిక మార్పు సాధ్యమవుతుంది.
ఒక ఆందోళనకర వాస్తవం..
భారత విద్యా వ్యవస్థలో అత్యంత ఆందోళనకర అంశం స్థూల నమోదు నిష్పత్తి క్షీణత. విద్యా స్థాయిలు పెరిగే కొద్దీ విద్యార్థుల నమోదు పడిపోవడం దేశ భవిష్యత్తుకే సవాలుగా మారింది. ‘యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్’ (2024–25) ప్రకారం ప్రాథమిక స్థాయిలో నమోదు 82.2%, హయ్యర్ సెకండరీలో 35.8%, ఉన్నత విద్యలో కేవలం 28.4% మాత్రమే. నూతన విద్యా విధానం 2035 నాటికి 50% లక్ష్యం నిర్దేశించినా, ప్రస్తుత స్థితిలో అది కష్టసాధ్యం. అభివృద్ధి చెందిన దేశాలు 6–8% జీడీపీని విద్యపై ఖర్చు చేస్తే, భారత్ ఇంకా 3% కన్నా తక్కువే ఖర్చు చేస్తోంది. కొఠారి కమిషన్ సూచించిన 6% పెట్టుబడి ఇప్పటికీ నెరవేరలేదు. ఉన్నత విద్యలో సీట్ల కొరత, రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఆర్థిక లోటు, మాతృభాష బోధన లోపం సమస్యలుగా మారాయి. ఫలితంగా యువత నాణ్యమైన విద్యను పొందడంలో వెనుకబడుతోంది. అందువల్ల విద్యా సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి, ఆధునిక విధానాల అమలు అత్యవసరం.
పాఠశాల నుంచి యూనివర్సిటీ వరకు..
భారత విద్యా వ్యవస్థ నాలుగు స్థాయిల్లో అభివృద్ధి చెందుతున్నా ప్రతి దశకు ప్రత్యేక సవాళ్లు కొనసాగుతున్నాయి. ప్రాథమిక స్థాయిలో సర్వశిక్షా అభియాన్, మిడ్‌డే మీల్స్‌తో చేరిక పెరిగినా మౌలిక వసతుల లోపం, ఉపాధ్యాయుల కొరత, నేర్చుకునే సమస్యలు ఉన్నాయి. మాధ్యమిక స్థాయిలో నమోదు ఎక్కువైనా బాలికల డ్రాప్ అవుట్, పాత సిలబస్, నైపుణ్యాభివృద్ధి లోపం సమస్యలుగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌లో పరీక్షా ఒత్తిడి, ఆత్మహత్యలు, అధ్యాపకుల కొరత, ప్రైవేట్ కోచింగ్ ఆధిపత్యం విద్యను భారంగా మారుస్తున్నాయి. ఉన్నత విద్యలో IITలు, IIMలు అంతర్జాతీయ గుర్తింపు పొందినా, ‘కేంద్ర విశ్వవిద్యాలయాలు’ పరిమిత అందుబాటుతో సాధారణ విద్యార్థులకు అందని ద్రాక్షలుగా మారాయి. ‘రాష్ట్ర విశ్వవిద్యాలయాలు’ నిధుల కొరత, అధ్యాపకుల ఖాళీలతో బలహీనపడుతున్నాయి. ’పరిశోధన’పై ప్రతికూల ప్రభావం ఏర్పడుతోంది.
నిరుద్యోగుల ఉత్పత్తి కర్మాగారాలు..
వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు.. అధ్యాపకులు లేకుండా ఎలా చదువుతున్నారు, ఎలా పరీక్షలు రాస్తున్నారు, ఎలా ఉత్తీర్ణులవుతున్నారు అనేదే పెద్ద ప్రశ్న. ‘ప్రైవేట్ యూనివర్సిటీలు’ ఆధునిక సదుపాయాలు కలిగివున్నప్పటికీ, అధిక ఫీజుల కారణంగా సామాన్య విద్యార్థులకు అందుబాటులో లేవు, వాటిలో రిజర్వేషన్ల అమలు లేదు. యూనివర్సిటీలకు NIRFలో ప్రాంతీయ బలాలు కాపాడుతూ గ్లోబల్ ప్రమాణాలు సాధించడం సవాలుగా మారింది. ‘స్కిల్ యూనివర్సిటీలు’ స్థాపించడం ద్వారా, యువతకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నైపుణ్యాధారిత విద్యా వ్యవస్థను బలపరచడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. విద్యా అవకాశాలు విస్తరించినప్పటికీ నాణ్యతలో అసమానత పెరుగుతోంది. దీన్ని అధిగమించడానికి కేంద్ర,రాష్ట్ర సమన్వయం, స్థిరమైన నిధుల కేటాయింపు, నైపుణ్య ఆధారిత విద్యా విధానం, పరిశోధన ప్రోత్సాహం అత్యవసరం. విద్య-ఉద్యోగ అనుసంధాన లోపంతో ఇవి కేవలం నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగానే మిగిలిపోతున్నాయనడంలో సందేహం లేదు.
పట్టా ఉన్నా ఉద్యోగం లేని స్థితి!
సాంకేతికత ఆధునిక ప్రపంచాన్ని వేగంగా మార్చుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, డిజిటల్ గవర్నెన్స్, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలను సమర్థవంతంగా నడిపే సాధనం ‘శక్తివంతమైన విద్యా విధానం’. ప్రస్తుత పరీక్షా వ్యవస్థ, మార్కులు, ర్యాంకులపై ఆధారపడటం, విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను అణచి, ‘పట్టా ఉన్నా ఉద్యోగం లేని’ పరిస్థితిని సృష్టిస్తోంది. సమాచార యుగంలో ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ అధ్యాపక మార్పిడి, శాస్త్ర,సాంకేతిక నైపుణ్యాలు అత్యవసరం. పాఠశాల స్థాయిలో బలమైన శాస్త్ర విద్య, నైపుణ్యాధారిత బోధన, అనుభవాత్మక పాఠ్య ప్రణాళిక అవసరం. డిజిటల్, ఇన్నోవేషన్ కోర్సులు, ఆన్‌లైన్ లెర్నింగ్ గ్రామీణ విద్యార్థులకు కొత్త అవకాశాలను ఇస్తాయి.
నూతన విద్యా విధాన పత్రం..
స్థిరమైన ప్రగతికి మౌలిక వనరుల పెంపు, ఆధునిక సిలబస్, పరిశోధన ప్రోత్సాహం, నైపుణ్య ఆధారిత కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ టెక్నాలజీ వంటి రంగాలను తప్పనిసరిగా చేరవేయాలి. యూనివర్సిటీలలో ‘పారిశ్రామిక విభాగాలు’ స్థాపించడం ద్వారా విద్య,ఉద్యోగ అనుసంధానం బలపడుతుంది. పాలన, ఆర్థిక సామర్థ్యం ఆధారంగా రాష్ట్రాల సంస్కరణల్లో వైవిధ్యం కొనసాగుతోంది. రాష్ట్ర యూనివర్సిటీలకు ప్రత్యేక బ్లాక్ గ్రాంట్లు, ప్రైవేట్ యూనివర్సిటీలలో ‘ఫీజుల నియంత్రణ కమిషన్’ ఏర్పాట్లు అవసరం. విద్యను శక్తివంతమైన సాధనంగా మార్చి, ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు కల్పించడానికి, అన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా విప్లవాత్మక మార్గదర్శిగా, అధికారిక పత్రంగా ‘నూతన విద్యా విధాన పత్రం’లను రూపొందించుకోవడం అత్యవసరం.
- నంగె శ్రీనివాస్,
ఎడ్యుకేషన్ ఎనలిస్ట్,
94419 09191






