కాసుల వర్షం కురిపించనున్న అంతరిక్షం

by Ravi |   (  Updated:2025-08-22 00:45:48  IST  )

ఆకాశం నుంచి మామూలుగా అయితే వర్షం, మహా అయితే వడగళ్ల వర్షం కురుస్తుంది. అదే, మనం ఊహిం చని విధంగా ఆకాశం

కాసుల వర్షం కురిపించనున్న అంతరిక్షం
X

ఆకాశం నుంచి మామూలుగా అయితే వర్షం, మహా అయితే వడగళ్ల వర్షం కురుస్తుంది. అదే, మనం ఊహిం చని విధంగా ఆకాశం నుంచి హఠాత్తుగా కాసుల వర్షం కురిస్తే ఆ కలను సాకారం చేసేందుకు ఇరు తెలుగు రా ష్ట్రాలు స్పేస్ పాలసీ రూపొందించుకుని విధివిధానాలను తయారు చేసుకొని ఆ దిశగా కార్యాచరణను చెపట్టాయి.

ఏపీలో స్పేస్ పాలసీ 4.0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతరిక్ష రంగంలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు స్పేస్ పాలసీ 4.0ను ప్రకటించింది. 2025 నుంచి 2035 మధ్య కాలానికి వ్యూహాత్మక లక్ష్యాలతో రూపొందించిన ఈ ప్రణాళిక ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృ త్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక ప్రణాళిక, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా యువత కు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీలు..

లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల అభివృద్ధి ఈ పాలసీలో ముఖ్యాంశంగా ఉంది. లేపాక్షి స్పేస్ సిటీ ఆవిష్కరణ, కోసం కేంద్రంగా పనిచేస్తే, తిరుపతి స్పేస్ సిటీ ఉపగ్రహ అసెంబ్లీ, లాంచ్ వెహికల్ నిర్మాణం, ప్రయోగాలకు సంబంధించిన లాజిస్టిక్స్ కేంద్రంగా పనిచే య నుంది. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0లో విద్యా వ్యవస్థకు కీలక ప్రాధాన్యం ఇచ్చారు. యువతను అంతరిక్ష రంగానికి సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో స్పేస్ టెక్నాలజీ కోర్సులు, శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, ఇంటర్న్షిప్‌లు, లైవ్ ప్రాజెక్టులు, స్పేస్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

35 వేల మందికి లబ్ధి

ఈ పాలసీ ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అంతేకాక, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు శిక్షణ, పరిశోధన అవకాశాలు కల్పించడంతో పాటు, వారి నైపుణ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసు కెళ్లేలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. స్పేస్ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు 25 నుంచి 45 శాతం వరకు రాయితీలు ఇవ్వనున్నారు. ఈ రాయితీలు చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రోత్సాహకంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0లో అంకుర సంస్థలు (స్టార్టప్‌లు) కీలక పాత్ర పోషించనున్నాయి. రాయితీలు, నిధులు, మెంటారింగ్ వంటి ప్రోత్సాహకాలను అందించడంతో పాటు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. స్టార్టప్‌లు పరిశోధన, విద్యా సంస్థలతో భాగస్వామ్యంగా పనిచేసే అవకాశాలు కల్పించి, రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో స్పేస్ ఆవిష్కరణల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

స్పేస్ విజన్ – 2047కు అనుసంధానం

ఈ రాష్ట్రీయ ప్రణాళిక జాతీయ స్థాయిలో రూపొందించబడిన ఇండియా స్పేస్ విజన్ – 2047కు అనుగుణంగా ఉంది. భారతదేశం 2033 నాటికి 44 బిలియన్ డాలర్ల అంతరిక్ష పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుండగా, ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ దేశానికి నూతన దిశను సూచించనుంది. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్. సోమనాథ్, డీఆర్‌డీఓ మాజీ ఉన్నతాధికారి సతీష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష రంగంలో ముఖ్య సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. వారి వైమానిక, రక్షణ, అంతరిక్ష సాంకేతికతలలో విశిష్ట అనుభవాన్ని పునరుద్ధరించి, రాష్ట్ర స్పేస్ పాలసీ 4.0 రూప కల్పనకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.

వాడవల్లి శ్రీధర్

99898 55445

Next Story