- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్
తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రామాల్లో యువత చాలా బిజీబిజీగా అయిపోయారు. ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే, మరొకరు పక్కన ఉండి గ్యాంగులు పెట్టి పోటీని కుదుపు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో యువత

తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గ్రామాల్లో యువత చాలా బిజీబిజీగా అయిపోయారు. ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే, మరొకరు పక్కన ఉండి గ్యాంగులు పెట్టి పోటీని కుదుపు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో యువత అంతా ఎక్కడో ఒక్కో క్యాంపులో, ఏదో ఒక గ్రూప్‌లో, ఏదో ఒక పార్టీలో మునిగి పోయారు. పంచాయతీ ఎన్నికల్లో నూతన ఒరవడిని సృష్టించాల్సిన యువతను ప్రచారం పేరుతో రాజకీయ పార్టీలు తమ అనుచరుల ద్వారా మందుకు బానిసలను చేస్తున్నారు. అందుకే నేడు గ్రామాల్లో ఎక్కడ చూసినా వైన్ షాప్‌లు నెల కొన్నాయి. నిలదీయాల్సిన యువత మాత్రం మత్తు మందులతో ఊగులాడుతున్నారు..
దయనీయంగా భవితలో స్తబ్దత..
ఇటీవల మేడ్చల్ జిల్లాలో ఒక కాలనీ మధ్యలో వైన్స్ ఏర్పాటు చేస్తే అక్కడి రిటైర్డ్ ఉద్యోగులు, తల్లిదండ్రులు మాత్రమే వైన్ షాప్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారే తప్ప ఒక్క యువకుడు కూడా దీనిపై స్పందించలేదు అంటే మన భవిష్యత్ ఆశాకిరణాల రూపు రేఖలు చాలా దయనీయంగా మన కళ్ల ముందు మెదులాడుతున్నాయి. వేలాది మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నేల ఇది. ఒకప్పుడు ఇంటికొకరు పిడికిలి బిగించి భూమి కోసం, హక్కుల కోసం పోరాడారు.. ఆ పోరాటం వల్లే నేడు మనకు భూమి వచ్చింది. కానీ ఇప్పుడు పేదల భూములు కార్పొరేట్ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ పేరుతో లాక్కుంటున్నారు. అయినా మనం ప్రశ్నిస్తున్నామా? లేదా అనేది యువత ఒకసారి ఆలోచించాలి. మలిదశ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ నుంచే మొదలైంది. ఈ ఉద్యమం యావత్ భారత దేశాన్ని కదిలించింది.
యువతలో ప్రశ్నించే తత్వం దూరమైందా?
భారతదేశంలో పోరాడి సాధించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న దీక్షా దివస్ జరుపుకుంటారు అంటే పోరాటాన్ని గుర్తు చేసుకోవడమే.. తెలంగాణకు తలమానికమైన ఓయూ కేంద్రంగా, ఆర్ట్స్ కాలేజీ మెట్లపై విద్యార్థులు దేశంలో, రాష్ట్రంలో జరిగే అన్యాయాల మీద ప్రశ్నించేవారు అనేక పోరాటాలు చేసేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని వీసీ సర్కులర్ జారీ చేశారు. అంటే ప్రశ్నించే గొంతులను మూయించాలనే పాలకుల విధానం మనకు తేటతెల్లమవుతుంది. మన యువత ప్రశ్నించే తత్వం రోజురోజుకూ తగ్గిపోతోంది. సాయుధ పోరాట గడ్డ అయిన మన ప్రాంతం ఇలాగే ఉంటే రేపటి మన తరం ఏమవుతుందో యువత అంతర్మథనం చేసుకోవాలి.
యూత్ గ్రూపులు చేస్తున్న పనేంటి?
ఒకప్పుడు గ్రామాల్లో, కాలేజీల్లో యూత్ గ్రూపులు జాతీయ నాయకుల పేర్లతో సేవా కార్యక్రమాలు, సమస్యలపై ఉద్యమాలు చేసేవారు. కానీ ఈ రోజుల్లో యువత గ్రూపులు నాయకుల ఫోటోల కోసం, పోటీ కోసం, బర్త్‌డే బ్యానర్ల కోసం మాత్రమే పరుగులు తీస్తున్నారు. నాయకులు, సినిమా హీరోల పుట్టినరోజు కార్యక్రమాలను పండుగలా చేసు కుంటున్నారు. కానీ నేడు మన ఇంటి సమస్యలు, విద్యా సమస్యలు, నిరుద్యోగం సమస్యలు పండుగలా కనిపిస్తున్నాయా? ఈ సమయంలోనే మనం ప్రశ్నించాలి. మన విద్య కోసం, మన వైద్యం కోసం, మన ఉపాధి కోసం ఇప్పుడు యువత పోరాడకపోతే రేపు మన పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. కాబట్టి రేపటి తరాల కోసం, మన హక్కుల కోసం యువత ప్రశ్నించాలి.. పోరాడాలి. అందరూ సంఘటితం కావాలి. ఇది మనందరి బాధ్యత. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.
-ఆర్. అరవింద్
95336 87400






