- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్ భవిష్యత్తు భయంకరమే!
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రాజకీయ మార్పులు, వాటి వెనుక ఉన్న శక్తులు, వాటిపై భారతదేశం తీసుకోవాల్సిన వైఖరిని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.

బంగ్లాదేశ్‌లో నెలకొన్న తాజా పరిణామాలు దక్షిణాసియా భవిష్యత్తుపై ఆందోళనకర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అక్కడ మైనారిటీ వర్గాలపై నిరంతర దాడులు జరగడం చూస్తే, ఈ పరిస్థితులు ఒక స్వతంత్ర దేశం ఎదుర్కొంటున్న సాధారణ రాజకీయ సంక్షోభంగా మాత్రమే భావించలేం.. ఆ దేశంలోని పరిస్థితులు నేరుగా భారత జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రాజకీయ మార్పులు, వాటి వెనుక ఉన్న శక్తులు, వాటిపై భారతదేశం తీసుకోవాల్సిన వైఖరిని లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది.
1947 వరకు భారత దేశంలో భూ భాగంగా ఉన్న ఆ ప్రాంతాన్ని మత వ్యూహాలతో భారత్ నుండి విడదీసి తూర్పున తూర్పు పాకిస్తాన్, పశ్చిమాన పశ్చిమ పాకిస్తాన్ పేర్లతో భూభాగాలను పంచుకున్నారు నాటి ముస్లిం నాయకులు.. అయితే 1971లో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మొదలైంది. ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం సైన్యానికి పని పెట్టింది. ఈ పరిస్థితుల్లో తూర్పు పాకిస్తాన్ నాయకుల కోరిక మేరకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వంపై సైనిక చర్యను కొనసాగించింది. ఇలా ప్రపంచ రాజకీయ పటంలో బంగ్లాదేశ్ పేరుతో ఒక ముస్లిం దేశం చోటును సంపాదించుకుంది.
మన దేశంపై ప్రభావం చూపుతాయా?
ఇక భారతదేశపు ప్రజల, రాజకీయ నాయకులకు అసలు బంగ్లాదేశ్‌లో ఏమి జరుగుతుందో, అక్కడి పరిస్థితులు దేశ భద్రతపై ఎటువంటి ప్రభావం చూపుతాయో అనే విషయంపై ఆలోచించే ఓపిక, తీరిక, దూర దృష్టి లేదని చెప్పక తప్పదు. ఎక్కడో పాలస్తీనాలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ హమాస్ మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న షేక్ హసీనాను దించడానికి బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్ ఉలేమా సంస్థ, కొన్ని అమెరికా ప్రాయోజిత సంస్థల ప్రతినిధులు ఉద్యమాన్ని లేవదీసి, ప్రధానిని భారతదేశానికి పారిపోయేలా చేశారు. మత శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు మైనారిటీలైన హిందువులపై అనేక అకృత్యాలకు పాల్పడ్డాయి. అమెరికా డైరెక్షన్‌తో మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇస్కాన్ ప్రతినిధి చిన్మయి కృష్ణ దాస్ అరెస్టు చేయబడి దాదాపు ఆరు నెలల బెయిల్ రాక జైలు గోడల మధ్య చిక్కుకున్నాడు. చివరకు బంగ్లాదేశ్‌లోని హిందుత్వ సంస్థల ఒత్తిడి, కొన్ని అంతర్జాతీయ సంస్థల నిరసనలతో షరతులతో కూడిన బెయిల్‌పై ఆయన విడుదల అయ్యాడు.
హిందువుల కష్టాలు కనిపించవా?
కానీ ఈ మధ్య బంగ్లాదేశ్ ఉద్యమ నాయకుడు ఉస్మాన్ హదీనీ గుర్తు తెలయని వ్యక్తులు కాల్చి చంపడంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస చెల్లరేగింది. ఈ హింసలో భాగంగా దీపు చంద్రదాస్ అనే ఒక కార్మికుడిని సహచర కార్మికులు అమానుషంగా కొట్టి, మతోన్మాద మూకలకు అప్పగించడం, చెట్టుకు వేలాడదీసి బహిరంగంగా ఉరితీసి, మంటలు వేసి తగలబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందడం, ఈ విషయాన్ని వీడియోలలో బంధించి, ప్రపంచ ప్రజలందరికీ తెలిసే తెలిసేటట్లు చేయడం వెనుక దాగి ఉన్న రహస్యం ఈ దేశంలో లౌకిక వాద ముసుగు వేసుకొని ఉన్న రాజకీయ నాయకులకు, వారి అనుయాయులకు ఎప్పటికీ అర్థం కాదు. ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్‌కి పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ మతోన్మాదం మూకలు చెలరేగిపోయాయి. హిందువులకు సంబంధించిన అనేక దేవాలయాలను కూల్చారు, ఆస్తులను ధ్వంసం చేశారు. అనేకమంది స్త్రీలను చెరబట్టారు. హిందువులపై మనదేశంలోని రాజకీయ నాయకులకు, మేధావులకు, ఖండించడానికి గొంతులు లేవలేదు. పాలస్తీనా ముస్లింల కోసం గొంతులు చించుకుని, వీరంగం చేసే వీరికి బంగ్లాదేశ్‌లోని హిందువులు పడుతున్న కష్టాలు ఎందుకు కనిపిస్తాయి?
మోడీ మౌనానికి కారణాలు..
బంగ్లాదేశ్‌లో పరిస్థితులు భయంకరంగా ఉన్నా, మోడీ ప్రభుత్వం ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1971 లో బంగ్లాదేశ్ ప్రజల రక్షణార్థం ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో యుద్ధానికి దిగింది. నేడు ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ పూర్వ రూపమైన భారతీయ జన సంఘ్, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితులు లేవు. బంగ్లాదేశ్‌లోని హిందువుల రక్షణార్ధం భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే దేశంలోని ఇస్లామిక్ మత సంస్థలను రెచ్చగొట్టి, జాతి వ్యతిరేక శక్తులను కూడగట్టి దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులను సృష్టించాలని కొందరు ప్రణాళికలు అల్లుతున్నారు.. నిఘావర్గాలు ఈ విషయంలో ప్రభుత్వానికి నిర్దిష్టమైన రిపోర్టును అందించాయి. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుంది. దేశ హితాన్ని కోరే ప్రజలు మోడీ ప్రభుత్వ వైఖరి సమర్థిస్తున్నారు. అంతర్గతంగా, బహిరంగంగా పరిస్థితులు అనుకూలంగా మారేంతవరకు మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ విషయంలో నిశ్శబ్దంగానే ఉంటుందనేది మాత్రం ఖాయం.
-ఉల్లి బాలరంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
94417 37877






