- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదంలో ముస్లింల అస్తిత్వం!
భారతదేశం నుండి ముస్లిం దేశంగా పాకిస్తాన్ వేరు పడినప్పుడు, మాకు మరే దేశమూ వద్దు అన్నారు ముస్లిములు. మేం ఈ దేశస్తులమే

భారతదేశం నుండి ముస్లిం దేశంగా పాకిస్తాన్ వేరు పడినప్పుడు, మాకు మరే దేశమూ వద్దు అన్నారు ముస్లిములు. మేం ఈ దేశస్తులమే, ఈ దేశంలోనే మా పూర్వీకుల అస్తిత్వాలు, త్యాగాలు, గుర్తులు ఉన్నాయని భారతదేశం లోనే ఉండిపోయిన భారత ముస్లిములకు నేడు అస్తిత్వాన్ని పరీక్షించుకోవలసి వస్తుందని కలలో కూడా ఊహించలేదు.
ఢిల్లీ జామా మస్జిద్ మెట్ల మీద నిలబడి ఓ ముస్లిములారా... ఈ దేశాన్ని విడిచి వెళ్ళకండి అని పిలుపు ఇచ్చిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి మహనీయుల అస్తిత్వాలు ఈ దేశంలోనే ఉన్నాయి.. అలాగే మనమంతా గర్వపడేలా జైహింద్ నినాదం సృష్టికర్త, సుభాష్ చంద్రబోస్‌కు నేతాజీ అని నామకరణం చేసిన బహుభాషా కోవిదుడు, ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తూ బ్రిటీష్ బలగాలతో పోరాటం చేసిన యోధుడు హైదరాబాద్‌కు చెందిన తెలుగుబిడ్డ సయ్యద్ అబిద్ హసన్ సఫ్రాని వంటి వారి అస్తిత్వాలు ఈ దేశంలోనే ఉన్నాయి కదా.
సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న వారిని..
మౌలానా అబ్దుల్ బారి, ముహమ్మద్ గులాం మొహి యుద్దీన్, ఖాన్ అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్ ఎలా ఎంతో మంది స్వతంత్ర సమర యోధుల అస్తిత్వాలు ఈ దేశంలోనే ఉన్నాయి కదా.. అంతే కాకుండా భారతదేశాన్ని శత్రువులతో కాపాడుకోవడానికి క్షిపణులు తయారు చేసిన శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం అస్తిత్వాలు ఈ దేశంలోనే ఉన్నాయి కదా.. భారతీయ సంస్కృతిలో హిందూ ముస్లిం అంతర్భాగంగా ఉన్నారు. ఈ రెండు ప్రధాన వర్గాల మధ్య స్నేహం, సోదరభావం ఆదర్శప్రాయంగా ఉంది. దీనికి గంగా జమున తహసీబ్‌గా పేర్కొన్నారు.
అపవాదులు, అవమానాల్ని భరిస్తూ..
అయితే, వేళ్ల మీద లెక్కపెట్టే కొంతమంది స్వార్థ, మత రాజకీయ నాయకుల వల్ల, ఈ రెండు వర్గాల మధ్య కొంత భేదాబిప్రాయాలు వస్తున్నాయి. మత రాజకీయాలు చేసే ప్రతి పార్టీ దీనికి కారణం. ఒక చేతితో చప్పట్లు మోగవు కదా.. గత కొన్ని సంవత్సరాల నుండి ముస్లిముల అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ముస్లిముల సాధికారత, ముస్లిముల హక్కులు, ముస్లిం పౌరుల భద్రత, మసీదులు, దర్గాలు, పౌరసత్వం ఇలా ఎన్నో విషయాలపై గొడవలు సృష్టిస్తున్నారు. మతపరమైన ఎన్నో అంశాలలో అపవాదుల్ని, అవమానాన్ని ముస్లిములు భరించాల్సి వస్తుంది.
ముస్లింలు రెండో స్థాయి పౌరులా?
ముస్లింలపై విద్వేష ప్రసంగాలు పెరిగాయి. ముస్లిములు ఆరాధించే అల్లాహ్, పవిత్ర గ్రంథం ఖురాన్, ముస్లిములు అమితంగా ప్రేమించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు ఎక్కువయ్యాయి. గో వ్యాపారులను అనుమానిస్తూ వారిపై కొన్ని అల్లరి మూకలు దాడులు చేస్తున్నాయి. ముస్లింలకు చెందిన వ్యాపారాలను, దుకాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. ముస్లింలను రెండవ పౌరులుగా మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాగే చట్టసభల్లో ముస్లిముల ప్రాతి నిధ్యం లేకుండా చేయడం తద్వారా వారి గురించి మా ట్లాడే నాయకులు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మత పాఠాలే బోధించడం కాకుండా
పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ముస్లిముల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందిన తీరును ఒకసారి గమనిస్తే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలు ఏర్పడడంలో ముస్లిం ప్రజల అలసత్వం, అవగాహన రాహిత్యం కూడా ఉంది. బీజేపీ పార్టీనీ ఓడించాలనే ఆలోచనలో, ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ, ఈ నాయకుడు కాకుంటే ఆ నాయకుడని సమర్థిస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయ ప్రయత్నాలు మాత్రం చెయ్యడం లేదు. ముస్లిం ప్రజల్లో ఇకనైనా రాజకీయ చైతన్యం రావాలి. ముస్లిం మత గురువులు కేవలం మతానికి సంబంధించిన పాఠాలే కాకుండా దునియా దారి గురించి కూడా ఆలోచించి ముస్లిం ప్రజల్లో చైతన్యం పెంచి రాజకీయ నాయకులని తయారు చేయాలి.
గంగా జమున తహజీబ్ గెలవాలి
స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారికి నా భారతదేశ ప్రజలు ఏదో ఒక రోజు గుణపాఠం చెబుతారు. పోరాట పటిమ గల్గిన నా భారతదేశ ప్రజలు ఇలాంటి వాటిని తిప్పి కొడతారనే నమ్మకం నాకు ఉంది. చివరగా, మనమందరం గెలవాలి, సోదరభావం గెలవాలి, ప్రేమ ఆప్యాయత గెలవాలి, న్యాయం గెలవాలి, గంగా జమున తహజీబ్ గెలవాలని ఆకాంక్షిస్తున్నాను.
- మొహమ్మద్ అజీజుద్దీన్
70131 76656






