- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల్లో సోషల్ మీడియా యుగం ప్రారంభం.. అప్‌డేట్ కాని పార్టీలు.. ఔటే!
భారత ఎన్నికల రాజకీయాలు వేగంగా డిజిటల్ వైపు మారుతున్నాయి. సోషల్ మీడియా, డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత మైక్రో టార్గెటింగ్ ఎలా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోండి.

దేశంలో ఎన్నికల రాజకీయాలు క్రమంగా వీధుల నుంచి సర్వర్లకు మారుతున్నాయి.. బహిరంగ సభల కంటే సోషల్ మీడియా ‘రీచ్’ కే ప్రాధాన్యం పెరగనున్నది. మైక్ పట్టుకుని గంటలు గంటలు నేతలు ప్రసం గించేకంటే ఓటర్ మైక్రో-టార్గెటింగ్ ప్రభావం చూపబోతున్నది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ఘన విజయాన్ని ఒక రాజకీయ పరిణామక్రమంగా మాత్రమే చూడలేం. అది భారత ఎన్నికల వ్యవస్థలో చోటుచేసు కుంటున్న మౌన విప్లవానికి సంకేతం. ఒకప్పుడు ఓటు అంటే కులం, పార్టీ జెండా, స్థానిక నాయకుడు, సభల్లో హాజరు, గోడలపై పోస్టర్లు.. కానీ, ఇప్పుడు ఓటు వెనుక మొబైల్ స్క్రీన్ ఉంది. రీల్ ఉంది. మీమ్ ఉంది. యూట్యూబ్ షార్ట్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా.. ఓటర్‌ని అతడికంటే బాగా అర్థం చేసుకునే ‘డేటా’ ఉంది.
ఇంకా మూస పద్ధతుల్లోనే..
ఈ మార్పును ఇప్పటికీ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా పార్టీలు సరిగా అర్థం చేసుకోవడం లేదు. పెద్ద ర్యాలీలు, భారీ కటౌట్లు, హెలికాప్టర్ టూర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికలు అనగానే 100 బహిరంగ సభలు, ప్రతి 500 మందికి ఒక నేత, ప్రతి కులానికి ఎంత డబ్బు పంచాలి? అన్న కోణంలోనే ఆలోచనలు జరుగుతున్నాయి. కానీ, కొత్త తరం ఓటరు ఆ రాజకీయాన్ని మొబైల్‌లో చూస్తున్నాడు. కానీ ఓటర్ 30 సెకన్ల వీడియోతో అభిప్రాయం మార్చుకుంటున్నాడు. ఒక వైరల్ క్లిప్ నాయ కుడిని హీరోగా కూడా చూపించగలదు.. ఒక మీమ్ అతడిని రాజకీయంగా ముగించగలదు. ఇదే డిజిటల్ యుగం. ఇక్కడ భావోద్వేగం కూడా డేటా ఆధారంగానే నిర్మించబడుతున్నదన్న విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు.
ప్రతి ఓటరు ఇప్పుడు ‘డేటా పాయింట్’
ఇప్పటి ఎన్నికల్లో ప్రధాన ఆయుధం కేడర్ మాత్రమే కాదు.. ‘డేటా బేస్ కూడా అతి ముఖ్యమైన అంశం. ఏ వయసు వారు ఏ వీడియో ఎక్కువ చూస్తున్నారు? ఏ ప్రాంతంలో నిరుద్యోగంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నది? ఏ వర్గం ప్రభుత్వంపై కోపంగా ఉంది? ఎవరికి సంక్షేమ పథకాలు చేరలేదు? ఎవరు రాజకీయాలపై విసుగు చెందుతున్నారు? ఈ సమాచారం అంతా ఇప్పుడు రాజకీయ పార్టీల దగ్గర కచ్చితంగా ఉండాలి. సోషల్ మీడియా ప్రవర్తన, సెర్చ్ ట్రెండ్స్, యూట్యూబ్ వీక్షణలు, ఫేస్‌బుక్ కామెంట్లు అన్నీ కలిపి ఓటరు మ్యాప్ చేయాలి. లేకపోతే ఓటరు నాడిని పట్టుకోవడం అసాధ్యం అవుతుంది. ఒకప్పుడు రాజకీయ నాయకుడు సభలో వేల మందితో మాట్లాడేవాడు. ఇప్పుడు ఏఐ సహాయంతో ఒక్కో ఓటరికి ఒక్కో సందేశం పంపిస్తున్నారు. రైతుకు వేరు నేరేషన్. యువతకు వేరు. మహిళలకు వేరు. ప్రభుత్వ ఉద్యోగులకు వేరు. ఇది సాధారణ ప్రచారం కాదు. ఇది ‘సైకాలజికల్ పొలిటికల్ ఇంజినీరింగ్’. ఎవరి భయం ఏమిటి? ఎవరి ఆశ ఏమిటి? ఎవరి కోపం ఏ అంశంపై ఉంది? ఇవన్నీ అంచనా వేసి కంటెంట్ తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. భారత రాజకీయాల్లో ఇప్పటివరకు ‘గ్రౌండ్ స్ట్రెంత్’ ప్రధాన బలం. కానీ ఇప్పుడు ‘డిజిటల్ గ్రౌండ్ స్ట్రెంత్’ అనే కొత్త వ్యవస్థ ఏర్పడుతున్నది. ఒక పార్టీకి లక్షల మంది కార్యకర్తలు లేక పోయినా, సోషల్ మీడియాలో భారీ నేరేషన్ సృష్టించగలిగితే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అదే సమయంలో భారీ కేడర్ ఉన్నా, డిజిటల్ ప్రపంచంలో బలహీనంగా ఉంటే వెనుకబడే పరిస్థితి వస్తోంది.
రాజకీయ పార్టీలకు ‘సోషల్’ టెస్ట్
ఒకప్పుడు కంప్యూటర్ రాని రాజకీయ నాయకుడు కూడా ఎన్నిక గెలిచేవాడు.. ఇప్పుడు సోషల్ మీడియా అర్థం కాని నాయకుడు నిలబడటం కష్టం అవుతున్నది. టెక్నాలజీని చిన్నచూపు చూసే రాజకీయ శక్తులు క్రమంగా కనుమరుగు అయ్యే అవకాశం కూడా లేక పోలేదు. ఎందుకంటే కొత్త తరం ఓటరు సమాచారం తీసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో కేవలం నాయకుడి ఇమేజ్ కాదు.. అతడి డిజిటల్ ఇంజిన్ కూడా పరీక్షకు దిగబోతున్నది. ఎవరి దగ్గర మెరుగైన డేటా ఉంది? ఎవరి దగ్గర వేగవంతమైన నరేషన్ మిషన్ ఉంది? ఎవరు ఓటరుని ముందుగానే చదువుతున్నారు? ఇవే నిర్ణయాత్మక అంశాలు అవుతాయి. చాలామంది సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతూ తమ కంటెంట్‌కు అద్భుతమైన రీచ్ వస్తున్నదని సంబరపడుతున్నారు.. కానీ, ఓటరు మిమ్మల్ని జోకర్ గా చూస్తున్నాడా? లేక సీరియస్ పొలిటీషయన్‌గా చూస్తున్నాడా? అన్నది కూడా ముఖ్యమేనని అర్థం చేసుకోవాలి.
వాళ్లకు ఓటు హక్కు వచ్చింది జాగ్రత్త!
పెద్ద పెద్ద లీడర్లు కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్‌ని అర్థం చేసుకోవడం లేదు.. ఇటీవలే ఓ నేత పార్టీ నేతల సమావేశంలో మాట్లాడుతూ ఆ సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్లండని గట్టిగా చెప్పారు. ప్రజల్లోకి వెళ్లడం అనేది ప్రతి రాజకీయ నాయకుడు వందశాతం చేయాల్సిందే.. కానీ, ఆ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు తీరును సోషల్ మీడియాలో చెప్పుకోవడం.. తన భావాలు, ఆశయాలను, దృక్పథాన్ని ప్రజలకు వివరించడం అనేది తన శ్రమకు యాడ్ ఆన్ చేస్తుంది. గత ఎన్నికల ఫలితాల అనంతరం మరో నేత మాట్లాడుతూ మేము వంద యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉంటే గెలిచేవాళ్లమని అన్నారు.. నిజానికి వంద కాదు వెయ్యి పెట్టినా నరేషన్ బిల్డప్ చేయడం అసాధ్యం. కానీ, సోషల్ మీడియాలో తమ పార్టీ సాధించిన విజయాలను స్లోగా పంప్ చేయాలి. అప్పుడే వివిధ వర్గాల నుంచి వచ్చే విషయాలనే ఓటరు నమ్ముతాడే తప్ప, వంద యూట్యూబ్ చానళ్లతో వెయ్యి స్టోరీలు చెప్పినా నమ్మరు. గ్రౌండ్ లెవల్ సోషల్ మీడియా చూసే యువతకు ఇప్పుడు ఓటు హక్కు వచ్చిందని నేతలు మరిచిపోవద్దు.
-హరీశ్ ఎస్పీ






