సంచలనానికి కేంద్రబిందువు.. నాదెండ్ల భాస్కరరావు

by Ravi |   (  Updated:2026-04-24 00:45:47  IST  )

1984లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ సంక్షోభం, నాదెండ్ల భాస్కరరావు 31 రోజుల ముఖ్యమంత్రి పదవీ కాలం, ఎన్టీఆర్ ధర్మయుద్ధం వంటి చారిత్రక పరిణామాలపై సమగ్ర విశ్లేషణ.

సంచలనానికి కేంద్రబిందువు.. నాదెండ్ల భాస్కరరావు
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నో మలుపులు వచ్చినా, 1984లో జరిగిన సంఘటనలు మాత్రం ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కేవలం కొద్ది రోజుల్లోనే మార్చేసిన పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆ రాజకీయ తుఫాన్‌ మధ్య నిలిచిన పేరు నాదెండ్ల భాస్కరరావు. న్యాయవాదిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, వ్యూహాత్మక నాయకుడిగా ఎదగడం, చివరకు కేవలం 31 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగడం విశేషం.

కాంగ్రెస్‌తో తొలి అడుగు..

ఇది కేవలం వ్యక్తిగత కథ కాదు, రాజకీయాల్లో శక్తి, అవకాశాలు, నిర్ణయాల ప్రభావాన్ని ప్రతిబింబించే గాథ. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి చట్టపరమైన అవగాహనతో పాటు ప్రజా సమస్యలపై స్పష్టమైన దృష్టి పెంపొందించుకున్నారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలోకి ప్రవేశించారు. 1978 నుంచి 1989 వరకు ఎమ్మెల్యేగా కొనసాగుతూ మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు.

1984 రాజకీయ సంక్షోభం

1982లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో నాదెండ్ల భాస్కరరావు కీలక పాత్ర పోషించారు.. 1983లో టీడీపీ అధి కారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో, రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుని నాదెండ్ల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభలో తగిన మద్దతు లేకపోవడంతో ఆయన ప్రభుత్వం 31 రోజులు మాత్రమే కొనసాగింది. ఎన్టీఆర్ తిరిగి వచ్చి ప్రజల్లో మద్దతు కూడగట్టడంతో పరిస్థితి మారిపోయింది. చివరికి 1984 సెప్టెంబర్ 16న భాస్కరరావు స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ప్రజాస్వామ్య తెలుగుదేశం.. ధర్మయుద్ధం!

1984 సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కరరావు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి “ప్రజాస్వామ్య తెలుగుదేశం” అనే గ్రూపుని ఏర్పాటు చేశారు. అయితే, ప్రజల్లో విస్తృత మద్దతు పొందడంలో ఈ గ్రూప్ విఫలమైంది. నాదెండ్ల చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎన్టీఆర్, ‘ధర్మయుద్ధం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లి తన ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చారని ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఎన్టీఆర్‌కు అండగా నిలవడంతో రాజకీయ ఒత్తిడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గవర్నర్‌ను మార్చి పరిస్థితిని పునఃసమీక్షించింది. చివరికి ఎన్టీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించారు.. దీంతో నాదెండ్ల భాస్కర రావు తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పదవీకాలం కేవలం ఒక నెలకు పరిమితమైంది.

తదుపరి రాజకీయ ప్రయాణం..

ఈ సంఘటనల తర్వాత నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998లో ఖమ్మం నుంచి లోక్‌సభకు ఎన్నికై ఎంపీగా సేవలందించారు. రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన దిశను మార్చుకోవడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. తరువాతి కాలంలో వయోభారం, ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలకు దూర మయ్యారు. క్రమంగా ప్రజా జీవితంలో నుంచి తప్పుకున్నారు. చివరకు హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చరిత్రలో నిలిచిన పేరు..

నాదెండ్ల భాస్కరరావు పేరు తెలుగు రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అధికారాన్ని పొందడం ఎంత ముఖ్యమో, దాన్ని నిలబెట్టు కోవడం అంతకంటే ముఖ్యమని ఆయన కథ చెబుతుంది. విజయాలు, వివాదాలు, అనుభవాలతో నిండిన ఆయన ప్రయాణం కొత్త తరాలకు ఒక పాఠంగా నిలుస్తుంది. అందుకే ఆయన కథ కేవలం చరిత్ర కాదు.. రాజ కీయాలకు మార్గదర్శకం.

- శ్రీధర్ వాడవల్లి

99898 55445

Next Story