- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సాయుధ పోరాటంపై ఆ పార్టీ చేస్తున్న ప్రచారమంతా బూటకమే!
బాంచన్ దొర నీ కాల్మొక్త అన్న బానిస వ్యవస్థ ఇక చెల్లదని, సామాన్యులను సాయుధులుగా మార్చి, నైజాం అరాచకాలపై తిరగబడి నైజాంను

బాంచన్ దొర నీ కాల్మొక్త అన్న బానిస వ్యవస్థ ఇక చెల్లదని, సామాన్యులను సాయుధులుగా మార్చి, నైజాం అరాచకాలపై తిరగబడి నైజాంను గద్దె దించిన చరిత్ర చారిత్రాత్మక వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానిది. దానికి నాయకత్వం వహించింది, అనేక త్యాగాలు చేసింది, రక్తం ధార పోసింది నాటి సామాన్య ప్రజలూ, కమ్యూనిస్టులే.. ఇదే చరిత్రకు అసలైన సాక్ష్యం. ఈ పోరాటంలో నాలుగువేల మంది కమ్యూనిస్టులు, ప్రజలూ ప్రాణ త్యాగాలు చేశారు. పదివేల మందికి పైగా కమ్యూనిస్టు కార్యకర్తలు, ప్రజా పోరాట యోధులు ఏండ్ల తరబడి నిర్బంధ శిబిరాలలో, జైళ్లలో బంధించబడ్డారు.
చరిత్ర వక్రీకరించడమే పనిగా..
బీజేపీ గత కొంతకాలంగా ప్రతిష్టాత్మక తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణలో జరిగిన పోరాటం ఒకటైతే ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చెప్పడం, దానికి మతం రంగు పూయడం దుర్మార్గం. ముస్లింల నుండి విముక్తి కలిగినట్లుగా చిత్రించేందుకు పూనుకుంటుంది. సాయుధ పోరాటంలో ఊసే లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు చరిత్రను తారుమారు చేసే నీచ పన్నాగాలు మాను కోవాలి. చరిత్రను వక్రీకరిస్తూ ఇదే అసలైన చరిత్ర అంటూ నేటి తరాలను, ముఖ్యంగా యువతను నమ్మించ చూస్తోంది. చైతన్య వంతమైన తెలంగాణ నేల మీద మతతత్వ, భావజాలాన్ని వెదజల్లి, తెలంగాణ గడ్డను కలుషితం చేస్తూ, మతతత్వ, రాజకీయాలకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నైజాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి..
కొమురయ్య, ఐలమ్మ స్పూర్తితో..
తెలంగాణ ప్రజల సంస్కృతి, భాషను పాలకులు అణచివేశారు. మాతృభాష పరిరక్షణకై పోరాటం ఉధృతమైంది. ప్రజలకు పౌరసత్వ హక్కులు లేవు. క్రూర నిర్బంధం, మితిమీరిన పన్నుల భారాలు, భూములన్ని ఆక్రమించుకోవడం, ప్రతి కుటుంబం నుండి ఎవరో ఒకరు జమీందారు దగ్గర వెట్టి చాకిరి చేయడం, నైజాం ప్యూడల్ పాలన, రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ప్రజలు తిరగబడ్డారు. ఇందుకు కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతో నిజాంకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభం అయింది. ఆంధ్ర మహాసభ, సాయుధ పోరాటానికి ఒక ఊపునిచ్చింది. ఇక దొడ్డి కొమరయ్య అమరత్వం, చిట్యాల ఐలమ్మ చూపిన తెగువ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. బైరాన్ పల్లి ప్రజా పోరాటం తెలంగాణ ప్రజా పోరాట చరిత్రలోనే అత్యున్నతమైనదిగా నిలిచింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అన్న తేడా లేకుండా ప్రజలందరూ పోరాటాల్లోకి దూకారు.
వీరి పాత్ర శూన్యం..
ఈ మొత్తం పోరాటంలో ఆర్య సమాజ్, హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష భాగస్వామ్యం లేనే లేదు. నిజాం నవాబు లొంగిపోయింది, ప్రధానంగా కమ్యూనిస్టుల యొక్క పోరాటాల వల్లనే. ఆపరేషన్ పోలో పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన సైన్యాల మూలంగానే నిజాం లొంగిపోయినట్లు చేస్తున్న ప్రచారమంతా ఒట్టి బూటకం. నిజాంకు ఎలాంటి శిక్షలు వేయకపోగా తనకు రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చి గౌరవించింది ఎవరు?
మతం ప్రసక్తి ఎక్కడిది?
నిజాం పాలన వ్యతిరేకంగా పోరాడి త్యాగాలు చేసిన వారిలో హిందువులు, ముస్లింలు అన్ని మతాలవారు ఉన్నారు. ఈ ఉద్యమంలో మతాల ప్రసక్తే కాదు, కులాల ప్రమేయం కూడా లేదు. బాధితులందరూ కలిసికట్టుగా పోరాడారు. ఆనాటి సాయుధ పోరాటం లక్ష్యం ఒకటే పీడకులు, పీడితులు అంతే కానీ మతం ప్రసక్తి ఎక్కడుంది? కనుక ఆనాటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మతానికి పరిమితం చేసి, రాజకీయ లబ్ధి కోసం బీజేపీ చేసే స్వార్థ రాజకీయ ప్రయోజనాలను చరిత్ర క్షమించదు..
-కోట రమేష్
డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు
96183 39490






