పట్టుదలకు ప్రతిరూపం.. చెన్నై స్టాచ్యూ మ్యాన్

by Ravi |   (  Updated:2026-05-10 01:00:43  IST  )

చెన్నై వి.జి.పి గోల్డెన్ బీచ్‌లో 40 ఏళ్ల పాటు విగ్రహంలా నిశ్చలంగా నిలబడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ‘స్టాచ్యూ మ్యాన్’ అబ్దుల్ అజీజ్ జీవితం, ఆయన పట్టుదల, ఏకాగ్రత, అరుదైన వృత్తి వెనుక ఉన్న కథనం.

పట్టుదలకు ప్రతిరూపం.. చెన్నై స్టాచ్యూ మ్యాన్
X

మనిషి శరీరం కదలికలకే అలవాటు. ఒక్క నిమిషం కూడా నిశ్చలంగా నిలబడటం చాలామందికి కష్టమే. కానీ చెన్నైలో ఓ వ్యక్తి మాత్రం గంటల తరబడి విగ్రహంలా నిలబడి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచాడు. నవ్వించినా.. భయపెట్టినా.. కళ్ల ముందే వింత చేష్టలు చేసినా ఆయనలో చలనం రాలేదు. నాలుగు దశాబ్దాల పాటు అదే పనిని వృత్తిగా మార్చుకున్న ఆ ‘స్టాచ్యూ మ్యాన్’ పేరు అబ్దుల్ అజీజ్. పట్టుదల, ఏకాగ్రత, సహనానికి జీవితాంతం నిదర్శనంగా నిలిచిన ఆయన కథ నిజంగానే అరుదైనది.

సుమారు 40 ఏళ్ల పాటు విరామం లేకుండా అలా నిలబడడమే ఆయన ఉద్యోగం. చెన్నైలోని వి.జి.పి గోల్డెన్ బీచ్ గార్డెన్ సందర్శించిన వారికి ఈ నిశ్చల మనిషి దర్శనం అయే ఉంటుంది.. ఆయనలో చలనం తెచ్చిన వారికి 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని అందులో ఉంటుంది. అది తెలిశాక ఆయన్ని ఎలాగైనా కదిలేలా చేయాలని అందరు ప్రయత్నించారు. కానీ ఆ ప్రైజ్ మనీని ఒక్కరు కూడా గెలవలేకపోయారు..

కదిలిక తెస్తే పదివేలు మీవే..

సముద్ర తీరాన ఉన్న ఈ గార్డెన్ లోపలికి అడుగు పెట్టగానే రాజభటుని వేషంలో ఉన్న బొమ్మలాంటి మనిషి ఎదురు పడతాడు. ఎవరిని పట్టించుకోకుండా తదేకంగా చూస్తున్న ఆయనను చూడగానే సంద ర్శకులు అక్కడే ఆగిపోవడం ఖాయం. ఆయన పక్కన ఇంగ్లీష్‌లో స్టాచ్యూ మ్యాన్ అనే బోర్డు ఉంటుంది. ఆ పక్కనే ఓ ప్రకటన కనబడుతుంది. ఆయనలో చలనం తెచ్చిన వారికి 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని అందులో ఉంటుంది. పాతికేళ్ల ప్రాయం నుండి అలా నిలబడడం మొదలు పెట్టిన అజీజ్‌కు ముసలి ఛాయలు వచ్చాయి కానీ ఆయన అచల యజ్ఞాన్ని మాత్రం ఎవరూ భంగం చేయలేక పోయారు. చివరకు సినిమాల్లోని కమెడియన్లు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. సినీ యాక్షన్ డైరెక్టర్ కనల్ కణ్ణన్ ఫైటింగ్ ఫోజులతో భయపెట్టినా అజీజ్ బెదరలేదు. అందుకు మెచ్చి కణ్ణన్ కరెన్సీ నోట్ల దండతో అజీజ్‌ను సత్కరించారు..

పాతికేళ్ల నుండి నిలబడటమే ఉద్యోగం..

బతుకుదెరువు కోసం చెన్నై వచ్చిన అబ్దుల్ అజీజ్ 1984లో వి.జి.పి గోల్డెన్ బీచ్‌లో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. దాని యజమాని వి.జి పన్నీర్ దాస్ బ్రిటన్ వెళ్లినపుడు లండన్ లోని బంకింగ్ హామ్ ప్యాలెస్ వద్ద కదలకుండా నిలబడే సైనిక వేషధారులను చూశాడట. నిశ్చలంగా నిలబడేవారి డ్యూటీ అక్కడ రోజుకు రెండు గంటలు మాత్రమే. ఆ తర్వాత మరొకరు ఆ బాధ్యత తీసుకుంటారు. అలా బొమ్మలా నిలబడే మనిషిని తన గోల్డెన్ బీచ్‌లో ఏర్పాటు చేయాలనే తలంపు ఆయనకు వచ్చింది. తన వద్ద పనిచేసే సెక్యూరిటీ గార్డులను పిలిచి కదలకుండా నిలబడితే నెలకు పది వేల జీతం ఇస్తాను అని అన్నారు. అందుకు ఒప్పుకొని అయిదుగురు ముందుకు వచ్చారు. వారికి శిక్షణ ఇప్పించి పరీక్ష చేయగా అజీజ్ ఒక్కడే ఎంపికయ్యాడు. ఆ పని మరొకరికి సాధ్యపడకపోవడంతో రోజుకు 6 గంటలు తానే నిలబడవలసి వచ్చింది. అలా కాలమూ గడిచిపోయింది.

ప్రశంసలు తప్ప ఏ సత్కారం లేదు!

ఆయనను విశ్రాంత సమయంలో కలిసిన పాత్రి కేయులు మొదట అడిగే ప్రశ్న ఒక్కటే. కోట్ల మందిలో ఎవరికీ వీలుకాని సాధన నీకెలా పట్టు దొరికింది అని. 'నా వల్ల కాదనే అనుకున్నాను. యజమాని మాట వినకపోతే ఉద్యోగం పోతుందేమో అనే భయంతో ఇందుకు సిద్ధపడ్డాను. ఆ భయంతో పాటు, పట్టుదల కూడా పెరిగింది. ప్రజలకు వినోదం పంచడం చూశాక వృత్తిని ఛాలెంజ్‌గా తీసుకోక తప్పలేదు. కుటుంబం ఇందుకు పూర్తిగా సహకరించింది. రోజూ యోగ, వ్యాయామం చేయడం, నడవడం, ప్రశాంతంగా పడుకోవడం దినచర్యగా మారింది. యోగ సాధన వల్లే నరాల, కండరాల నొప్పి అదుపులోకి వచ్చింది. నిలబడ్డప్పుడు మనసులోకి మరో ఆలోచన రాకుండా పనిపైనే ఏకాగ్రత పెట్టడం కూడా దాని వల్లే సాధ్యపడింద'ని అంటాడు అజీజ్. కరోనా లాక్ డౌన్ వల్ల 2020లో గోల్డెన్ బీచ్ మూత పడడంతో అజీజ్ ఉద్యోగం పోయింది. వయసు మీద పడడంతో ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుం టున్నాడు. దశాబ్దాల పాటు నిలబెట్టుకున్న ఆయన ప్రతిభకు సందర్శకుల ప్రశంసలు తప్ప మరే సత్కారం లభించలేదు. పట్టుదల పర్యాయపదంగా పిల్లలకు పాఠ్యాంశంగా రావాల్సిన వాడు చివరకు అనామ కుడిగా మిగిలిపోయాడు.

- బద్రి నర్సన్

94401 28169

Next Story