- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమరావతిలో ఆర్థిక విప్లవం ప్రారంభం.. ఒకే రోజు 15 బ్యాంకుల శంకుస్థాపన
వేల మంది అన్నదాతలు స్వచ్ఛందంగా చేసిన భూముల త్యాగాలే దన్నుగా లేస్తున్న మహానగరం రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆంధ్రప్రదేశ్ రేపటి మహోదయానికి

వేల మంది అన్నదాతలు స్వచ్ఛందంగా చేసిన భూముల త్యాగాలే దన్నుగా లేస్తున్న మహానగరం రాజధాని అమరావతిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆంధ్రప్రదేశ్ రేపటి మహోదయానికి కాంతి బీజాలై మేము సైతం అంటూ 15 జాతీయ బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ముందుకొచ్చి ఏపీని భారత ఆర్ధిక పటంలో ముందంజలో నిలబెట్టే చారిత్రాత్మక ఘాతానికి పునాది వేసాయి.
జాతీయ బ్యాంకుల రాష్ట్ర కార్యాలయాలకు అమరావతి చిరునామా కానున్నది. ఒకే రోజు, ఒకేసారి 15 బ్యాంకులు అమరావతిలో ఆర్థిక సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణా లకు, రెండు బీమా కంపెనీల ప్రాంతీయ ప్రధాన కార్యా లయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చెయ్యడంతో అమరావతిలో ఆర్ధిక విప్లవం ఆరంభం అని చెప్పాలి.
అర్థిక నగరానికి పునాది రాళ్లు..
రాజధాని అమరావతికి వస్తున్న జాతీయ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్, ఏపీ గ్రామీణ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఎల్‌ఐసీ, ఎన్‌ఐఏసీఎల్. ఈ 15 ఆర్థిక సంస్థల కార్యాలయాల ఏర్పాటు ద్వారా రూ.1,334 కోట్ల పెట్టుబడులు రాజధాని అమరావతికి రావడంతో పాటు 6,576 ఉద్యోగాల కల్పన జరుగుతుందని రాజధాని ప్రాంత అభివృద్థి ప్రాధికార సంస్థ [ఏపీసీఆర్డీఏ] వెల్లడించింది. 15 జాతీయ బ్యాoకుల శంకుస్థాపన కార్యక్రమంలో ముంబైలో ఉండాల్సిన ఆర్థిక యంత్రాంగం అంతా అమరావతిలోనే కనిపించడం విశేషం. 15 ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యా లయాల ఏర్పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతున్న ఆర్ధిక నగరానికి పునాది రాళ్లు.
ఒకే రోజు 15 బ్యాంకుల ఏర్పాటు..
దేశంలో ఎక్కడా ఆర్ధిక సంస్థలన్నీ ఒకే చోట ఏర్పాటు అయిన దాఖలాలు లేవు.. 15 జాతీయ బ్యాంకులు ఒకే రోజు, ఒకేసారి ప్రారంభించడం ఏ నగరంలోనూ జరగలేదు, అది అమరావతిని ఆర్ధిక శక్తిగా నిలపడానికి వేసిన శిలా ఫలకం. ఇది దూరదృష్టి కలిగిన ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక. అమరావతి నగరంలో ఒకే చోట 15 బ్యాంకులు ఆరంభం కావడం అంటే, ఆ నగర భవిష్యత్తుపై బ్యాంకింగ్ సెక్టర్‌కు సంపూర్ణ నమ్మకంతోనే.. అమరావతిలో బ్యాంకుల భారీ విస్తరణ జరుగుతుండటం వల్ల నగరంలో పెట్టుబడులు, వాణిజ్యం, నిర్మాణ రంగం మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం పడుతున్నారు.
బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం
అమరావతి పరిధిలోని గ్రామాలు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు తదితర వర్గాలకు కూడా ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరనున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్, రుణాలు, డిపాజిట్లు, సేవింగ్స్ వంటి సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకుల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. రాజధాని నిర్మాణంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో బ్యాంకుల ప్రారంభం కీలక మలుపు కానున్నది. ప్రభుత్వం అమరావతిని ఆర్థిక, పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. మౌలిక వసతుల అభివృద్ధి, వాణిజ్య అవకాశాల సృష్టి, పెట్టుబడుల రక్షణ, పారదర్శక విధానాల అమలు వంటి చర్యలు బ్యాంకులను, పెట్టుబడి దారులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించాయి.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. గొప్ప మలుపు..
అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. పలు ప్రభుత్వ బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, ఇన్‌కం ట్యాక్స్ వంటి పలు ప్రభుత్వ అనుబంధ ఆర్థిక కార్యాలయాలు ఇక్కడకు రానున్నాయి. గతంలో హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చంద్రబాబు హయాం లోనే ఏర్పాటు కాగా నేడు అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆయన హయాంలో ఏర్పాటు కావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక గొప్ప మలుపు.. భారత దేశంలోని ముంబై, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, హైదరాబాద్ గచ్చిబౌలి తరహాలో, ప్రపంచ ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు, స్టాక్ ట్రేడింగ్ సర్వీసులు వంటి ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థల కేంద్రంగా నిలిచే ప్రణాళిక ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రణాళికలో భాగంగా ప్రపంచస్థాయి వ్యాపార భవనాలు, డేటా సెంటర్లు, అంతర్జాతీయ సమావేశ కేంద్రాలు, బ్యాంకులు, ఫిన్‌టెక్ పార్కులు, స్టార్టప్ & ఇన్నోవేషన్ జోన్లు ఏర్పాటు కాన్నాయి. ఇవన్నీ ఏర్పడటం వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలతో సమానంగా లేదా వాటిని మించిన ఆర్ధిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ అవతరించనున్నది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల, లక్షలాది ఉద్యోగావకాశాలు, వ్యాపార విస్తరణకు, ఎకోసిస్టమ్, అంతర్జాతీయ పెట్టుబడులకు అమరావతి ముఖద్వారం కానున్నది.
అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు..
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది రాష్ట్ర భవిష్యత్‌కు, ఆర్ధిక స్వావలంబనకు వేసిన శక్తివంతమైన పునాది. అమరావతి ప్రపంచ ఆర్ధిక పటంలో కొత్త గుర్తింపుతో వెలిగే రోజు దగ్గరలోనే ఉన్నది. సింగపూర్, దుబాయ్, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో స్థానాన్ని సంపాదించుకున్నట్లే, అమరావతిని కూడా భారత నూతన ఫైనాన్షియల్ హబ్‌గా నిలబెట్టే సంకల్పం సీఎం చంద్రబాబుది. అమరా వతిలో ప్రపంచ స్థాయి వాణిజ్య భవనాలు, స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్, డేటా సెంటర్లు, హై-ఎండ్ ఐటీ & ఫైనాన్షియల్ టెక్నాలజీ జోన్లు, స్టార్టప్, ఇన్నోవేషన్ వేదికలు ఏర్పాటు ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో గేర్ మార్చనున్నాయి. పెట్టు బడులు, వ్యాపారాలు విస్తరించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించబడతాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థిక శక్తిని నిర్మించే నూతన యుగంలో సీఎం చంద్రబాబు చూపుతున్న దూరదృష్టి అద్భుతం, ప్రశంసనీయం.
- నీరుకొండ ప్రసాద్
98496 25610






