వందేమాతరంపై.. చర్చ ఇలా జరగాల్సింది కాదు!

by Ravi |   (  Updated:2025-12-12 00:30:17  IST  )

వందేమాతరం గీతం బంకించంద్ర చటో పాధ్యాయ రచించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆంగ్లేయుల పాలనకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసి నడిపించిన ఆ గీతం

వందేమాతరంపై.. చర్చ ఇలా జరగాల్సింది కాదు!
X

వందేమాతరం గీతం బంకించంద్ర చటో పాధ్యాయ రచించి 150 ఏళ్లు గడిచిన సందర్భంగా పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆంగ్లేయుల పాలనకి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసి నడిపించిన ఆ గీతం, స్వాతంత్ర్య పోరాటానికి ముందు, తర్వాత దేశభక్తిని ప్రోది చేస్తూ ప్రజల్ని ఉర్రూతలూపింది. ఆ గీతం పార్లమెంట్‌లో అన్ని పక్షాల్ని ఏకం చేయడంలో మాత్రం విఫలమైంది. పార్లమెంట్‌లో తాజాగా దేశం ఎదుర్కొంటున్న రూపాయి విలువ దారుణ పతనం, విమానయాన ప్రయాణాల సంక్షోభం, పంటల గిట్టుబాటు ధరల గురించి చర్చించాల్సి పోయి 150 సంవత్సరాల నాటి వందేమాతరం గీతాన్ని పాలకులు చర్చనీయాంశం చేసారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు, మతతత్వ అజెండాను కొనసాగించేందుకు వందేమాతరం అంశాన్ని మరోసారి తెరమీదికి తెచ్చారని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. ఈ చర్చలు చూస్తే ఆ ఆరోపణలు నిజమేనని అనిపిస్తుంది. ఏదేమైనా వందేమాతరం గీతంపై వివాదాలు పాతవే అయినా, నేడు వివాదాలను పక్కనపెట్టి, స్ఫూర్తిని నింపుకోవాల్సింది. రానున్న కాలంలో భారతీయత గొప్ప‌దనాన్ని ఎలా కాపాడుతూ ముందుకు పోగలమో అక్కడ చర్చించాల్సింది. ఆ దిశగా చర్చ నడిపించడం కన్నా, తమ తమ వాదనల్ని ముందుకు నడిపించడానికే ఇరు వర్గాల ప్రయత్నాలు జరిగాయి. 150 ఏళ్ల పాటు జాతిని మేల్కొలిపిన వందేమాతరం గీతంపై చర్చ జరగాల్సిన తీరు ఇది మాత్రం కాదు. స్వాతంత్ర్య పోరాటంలోని రణన్నినాదం, నేడు స్వతంత్ర భారతంలో రాజకీయ నినాదాల నడుమ స్వరం తగ్గి నిలబడినట్టయింది. ఆ జాతీయ గేయం సౌందర్యం, స్ఫూర్తి కాపాడుకొనే అవసరం ఇప్పుడు అందరిపై ఉంది.

డా.డి.వి.జి. శంకరరావు,

94408 36931

Next Story