- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేడా 10%.. కానీ 100% హైప్.. యూరియా కొరత వెనుక అసలైన కథ
తెలంగాణ రాష్ట్రంలో యూరియా పంపిణీపై ప్రతికూల వార్తలను ఈ మధ్య సోషల్ మీడియాలో, వార్తా పత్రికలలో కోకొల్లలుగా చూస్తున్నాం. ఒక వికలాంగ రైతు యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి తీవ్రంగా గాయపడిన

తెలంగాణ రాష్ట్రంలో యూరియా పంపిణీపై ప్రతికూల వార్తలను ఈ మధ్య సోషల్ మీడియాలో, వార్తా పత్రికలలో కోకొల్లలుగా చూస్తున్నాం. ఒక వికలాంగ రైతు యూరియా కోసం క్యూలైన్‌లో నిలబడి తీవ్రంగా గాయపడిన సంఘటన మహబూబాబా ద్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఇందుకు కారణమైన జిల్లా యంత్రాంగంపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడానికై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో యూరియా పంపిణీని పరిశీలిస్తే వాస్తవంగా కొరత ఉందా? లేదా కృత్రిమంగా సృష్టించబడిందా? అన్న అనుమానాలు కలుగకమానవు..
రాష్ట్రానికి కావాల్సిన యూరియా ఎంత అవసరం అనేది రాష్ట్ర వ్యవసాయశాఖ సీజన్‌ల వారిగా గత నాలుగు సంవత్సరాలలోని సరఫరా, పంపిణీల ఆధారంగా లెక్కించి, ఈ సీజన్‌కు ఎంత అవసరమో నిర్ధారిస్తుంది. ప్రతినెలలో ఈ అంచనాల వివరాలు రాష్ట్ర అధికారులు కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్ శాఖకు తెలియపరుస్తారు. ఈ వివరాలను కేంద్ర మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకుని తదను గుణంగా చర్యలు చేపడుతుంది.
కేవలం 10 శాతమే తేడా..
అధికారుల అంచనాల ప్రకారం 2025 వానాకాల సీజన్ అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 9లక్షల 80వేల టన్నుల యూరియా అవసరమని ప్రణాళికలు తయారు చేసుకున్నారు. దీనిని రాష్టవ్యాప్తంగా 2020-24 సంవత్సరాలలో వాడబడిన మొత్తం యూరియా నుంచి యావరేజ్‌గా లెక్కించి రూపొందించారు. ఈ సీజన్‌లో పంపిణీ జరిగిన యూరియాను పరిశీలిస్తే సెప్టెంబర్ మొదటి వారం వరకే దాదాపు 8లక్షల 33వేల టన్నుల పంపిణీ పూర్తి అయ్యింది. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సీజన్‌లో ఇప్పటికే పంపిణీ చేయబడిన యూరియా 85 శాతం దాటింది. కేవలం 10-15 శాతం పంపిణీ తేడా ఉంది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత తలెత్తుతుందనే ముందస్తు ఆలోచనతో కేంద్రం నుండి సెప్టెంబర్ మాసం కోటాతో పాటు అదనంగా యురియా కావాలని అడగడం జరిగింది. నిజానికి ఈ కొద్ది యూరియా కొరత రాష్ట్రాన్ని ఇంతలా వేధించదు. కాబట్టి దీని వెనకాల ఉన్న నిగూఢ అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి.
కొరత భయంతో నిల్వ చేసుకోవడంతో..
రాష్ట్రంలో రైతులకు యూరియా అందటం లేదనే వార్తలు ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమైనవి. అప్పుడే కలెక్టర్లు సరైన రీతిలో స్పందించుంటే బాగుండేది. కానీ యూరియా పంపిణీలపై అప్పటికే జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంలో జిల్లా స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అలాగే ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్‌లకు కేటాయించిన 40శాతం యూరియాను సొసైటీలకు మళ్లించి ఉంటే రైతులకు కొంత ఊరట లభించేది. ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్‌లకు కేటాయించిన యూరియా కేవలం పెద్ద రైతుల చేతుల్లోకి వెళ్లింది. మరికొందరు రైతులు అతిగా భయపడి యాసంగి పంట కోసం నిల్వచేసు కోవడం మొదలు పెట్టే సరికి కొరత తీవ్ర తరమైంది. సొసైటీలు తక్కువ, రైతుల సంఖ్య ఎక్కువ ఉండటంతో అందరికీ సరైన రీతిలో సరఫరా జరగకపోవడం మరో కారణం.. కలెక్టర్లు పంపిణీ కేంద్రాలను, సొసైటీలను సబ్ సెంటర్‌లుగా క్రియేట్ చేసి లైసెన్సులిచ్చి, ప్రభుత్వ ఉద్యోగులను డిప్యూటేట్ చేస్తే రైతులందరికీ యూరియా అందేది. అన్నింటికి మించి ఒక రైతుకు ఎన్ని బస్తాలు ఇవ్వాలనే దానిపై సీలింగ్ లేకపోవడం. ఈ-పాస్ మిషన్లలో కేవలం వేలిముద్రలు తీసుకోవడం తప్ప రెండోసారి అదే రైతు వస్తే మిషన్‌లలో గుర్తించే సౌలభ్యం లేకపోవడం లోపంగా చెప్పవచ్చును.
నేర్చుకున్న పాఠం ఏమిటి?
కేంద్రం నుంచి యూరియా సకాలంలో రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కావాల్సినంత నిల్వలు లేకపోవడమనేది వాస్తవమే. కానీ ప్రచార మధ్యమాల్లో హైప్ చేయబడినంత కొరత మాత్రం ఉన్నట్లుగా కనిపించడం లేదు. వాస్తవానికి ఇది కృత్రిమంగా క్రియేట్ చేయ బడింది. కొరత అనే భయాన్ని సృష్టించడంతో రైతులు మరింత నిల్వ చేసుకోవాలనే ఆతృతను సోషల్ మీడియా కల్పించింది. దీనికి కారణం అధికారులు అప్రమత్తంగా ఉండకపోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు వెను వెంటనే తీసుకోకపోవడమే. ప్రభుత్వం కూడా ఈ-పాస్ యంత్రాలను అప్‌డేట్ చేయాలి. పౌర సరఫరా శాఖ మాదిరిగా ఒకసారి రేషన్ తీసుకుంటే మళ్లీ రెండోసారి తీసుకోకుండా ఉండే విధంగా, యురియా పంపిణీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ డిజైన్ చేయాలి. తగినన్ని సబ్ సెంటర్‌లను తెరచి పంపిణీని డిసెంట్రలైజ్ చేయాలి. అధికార యంత్రాంగం చిత శుద్ధితో వ్యవహరిస్తే ఇలాంటి కృత్రిమ కొరత, విష ప్రచారాలను ఎదుర్కోవడం పెద్ద కష్టమైన పనేం కాదు.
-డాక్టర్ సందెవేని తిరుపతి
98496 18116






