- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన గ్రామాభివృద్ధి.. మన చేతుల్లోనే!
భారతీయ ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన పునాది గ్రామం. గ్రామం బలపడితేనే దేశం బల పడుతుంది. ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధాన మైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. చట్టసభల ఎన్నికల కంటే సాధారణంగా చిన్నవి అనుకున్నా

భారతీయ ప్రజాస్వామ్యంలో అత్యంత బలమైన పునాది గ్రామం. గ్రామం బలపడితేనే దేశం బల పడుతుంది. ఈ గ్రామ పాలనలో అత్యంత ప్రధాన మైనవి గ్రామపంచాయతీ ఎన్నికలు. చట్టసభల ఎన్నికల కంటే సాధారణంగా చిన్నవి అనుకున్నా, నిజంగా చూసుకుంటే మన దైనందిన జీవితంపై ప్రతిరోజూ ప్రభావం చూపేది గ్రామస్థాయి పరిపాలనే.
నీరు, రహదారులు, వీధి దీపాలు, చెత్త నిర్వహణ, పాఠశాల పరిస్థితే కాకుండా, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు.. ఇవన్నీ నిర్ణయించే బాధ్యత గ్రామపంచాయతీలోని సర్పంచ్‌దే. అందుకే ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ‘హక్కు’ మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించే బాధ్యత కూడా. ఈ నేపథ్యంలో ప్రతి ఓటరు ఏ విషయాలు ఆలోచించి ఓటు వేయాలి సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేసే ముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలి అనే అంశంపై లోతైన చర్చ చేసుకోవాలి.
ఇంతవరకు ఏం చేశారన్నదే కీలకం
ఎన్నికల ముందు అభ్యర్థులు హామీల వరద పారిస్తారు. అప్పుడు ఓటరు మాయ మాటలకు లోనుకాకుండా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ‘ఇప్పటి వరకు అభ్యర్థి ఏం చేశారు’ అనే ప్రశ్నే అత్యంత ప్రధానమైనది. గతంలో పదవిలో ఉన్న అభ్యర్థి అయితే అతని పనులు పరిశీలించాలి. కొత్త అభ్యర్థి అయితే గ్రామం కోసం చేసిన సామాజిక సేవలు చూసుకోవాలి. వాగ్దానాల జాబితా పొడవుండొచ్చు, కానీ హామీలను సాధించే, నెరవేర్చే కృతనిశ్చయం అభ్యర్థి కలిగి ఉండాలి. అభివృద్ధి అనేది కాగితంపై గీసిన ప్రణాళిక కాదు, అది రహదారుల రూపంలో, పరిశుభ్రమైన వీధుల రూపంలో, పారదర్శక పాలన రూపంలో కనిపించాలి.
మా వర్గం, మా గోత్రం వాడే రావాలి?
సర్పంచ్ ఒక పదవి మాత్రమే కాదు, గ్రామానికి చెవి, కళ్లూ, హృదయం. కాబట్టి అభ్యర్థి వ్యక్తిత్వం అత్యంత కీలకం. నిజాయితీ ఉన్నవాడా ప్రజల మాట వినగలడా వివాదాలను శాంతితో పరిష్కరించగలడా? అహింసను నమ్ముతాడా అని ఆలోచించాలి. గ్రామ రాజకీయాలు ఎక్కువగా వ్యక్తిగత విభేదాలపై తిరుగుతాయి. అలాంటి సమయంలో నాయకుడు కోపానికి లోనుకాకుండా, ప్రజల మధ్య సమైక్యతను పెంచే వాడై ఉండాలి. చాలా గ్రామాల్లో ‘మా ఇంటివాళ్లే రావాలి’, ‘అది మా వర్గం’, ‘మా గోత్రం’ అనే భావాలతో ఓటు వేయడం సంప్రదాయం అయిపోయింది. కానీ గ్రామ అభి వృద్ధికి ఈ భావజాలం అడ్డంకి. సర్పంచ్ అభ్యర్థిని ఎంచు కోవడంలో చూడవలసింది, అభ్యర్ధి సామర్థ్యం, జ్ఞానం, దూరదృష్టి మాత్రమే.. ప్రజలు కుటుంబ సంబంధాల్ని పక్కనబెట్టి సమర్దవంతుడైన అభ్యర్థిని ఎన్నుకుంటేనే గ్రామ పరి పాలనలో నూతన మార్పులు వస్తాయి..
చెప్పడం కాదు చేయడం ముఖ్యం
సర్పంచ్‌కు ఉన్నత విద్య తప్పనిసరి కాకపోయినా, పనుల నిర్వహణ, ప్రణాళికలు రూపొందించడం, డేటా అర్థం చేసుకోవడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన ఇవన్నీ అతనికి తప్పనిసరైన నైపుణ్యాలు. అభ్యర్థి వద్ద ఇవి ఉన్నాయా ప్రభుత్వ పథకాల వినియోగం ఎలా చేయాలో తెలుసా? బడ్జెట్‌పై అవగాహన ఉందా టెండర్లు, నిర్మాణ పనులు, పారదర్శక ఖర్చులపై అవగాహన ఉందా? విద్య ఉన్నవారు మాత్రమే మంచి నాయకులు అవుతారు అనేది నిజం కాకపోయినా, తెలివితేటలు, నేర్చుకోవాలన్న మనస్తత్వం మాత్రం ఉండాలి. గ్రామ సమస్యలకు క్రియాత్మక పరిష్కార ప్రణాళికలు ఉన్నవాడై ఉండాలి. కేవలం ‘తీర్చేస్తాం’, ‘చేస్తాం’ అంటూ సభలలో చెప్పడం సరిపోదు.. ఎలా చేస్తాడు ఏ నిధులతో చేస్తాడు ఏ సమయంలో పూర్తి చేస్తాడు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పగల అభ్యర్థినే ప్రజలు ఎన్నుకోవాలి.
గ్రామాన్ని ఒక్కటిగా ఉంచేవాడే కావాలి..
గ్రామ పంచాయతీ నిధులు పెద్దవి కావచ్చు, చిన్నవి కావచ్చు... కానీ వాటిపై పారదర్శకత లేకపోతే అవినీతి వేళ్లూనుకుంటుంది. అభ్యర్థి మనకు నిర్ధారించవలసిన అంశాలు, ప్రతి రూపాయి ఖర్చులో పారదర్శకత, పనుల నాణ్యత పర్యవేక్షణ. గ్రామసభ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించడం, పారదర్శకతను పాటించే నాయకుడే నిజమైన ప్రజా నాయకుడు. సంప్రదాయాలు, పండుగలు, సమాజ కార్యక్రమాల్లో గ్రామాన్ని ఒక్కటిగా ఉంచే నాయకుడే గ్రామ అభివృద్ధికి దారితీయగలడు.
డబ్బు తీసుకుంటే ఇక పని చేయరు..
ఎన్నికల సమయంలో చాలా చోట్ల డబ్బు, బహుమతులు, విందులు ఇవ్వడం సాధారణం. అవి తీసుకుని ఓటు వేయడం మన వ్యక్తిగత ప్రయోజనం అనిపించినా, గ్రామ భవిష్యత్తుకు అది పెద్ద నష్టం. డబ్బు ఇచ్చే నాయకుడు పదవిలోకి వెళ్లాక మరింత డబ్బు సంపాదించడానికే ప్రయత్నిస్తాడు. అందువల్ల ఓటర్లు ‘ఈరోజు ప్రయోజనం’ కన్నా 5 సంవత్సరాల అభివృద్ధి గురించి ఆలోచించాలి. గ్రామాభివృద్ధి అనేది మాంత్రికం కాదు, అది సమష్టి కృషి. కానీ ఆ కృషికి దిశ నిచ్చేది, గ్రామాన్ని ముందుకు నడిపేది సర్పంచ్ మాత్రమే. మంచి నాయకుడు ఉంటే గ్రామం అద్భుత మార్పులు చూడగలదు. చెడు నాయకుడు ఉంటే గ్రామం సంవత్సరాల పాటు వెనుకబడిపోవచ్చు. అందుకే ఓటు వేయడానికి ముందు ఓటరు నిశితంగా ఆలోచించాలి.
గ్రామం అభివృద్ధి చెందితేనే..
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం అంటే కేవలం ఓటు చెల్లించడం కాదు. మన గ్రామ భవిష్యత్తుకు ఓ నిర్ణయం తీసుకోవడం. మన పిల్లల రేపటి పరిస్థితులు, మన జీవన ప్రమాణాలు, గ్రామ అభివృద్ధి.. ఇవన్నీ మన ఓటుతోనే నిర్ణయించబడతాయి. అందుకే జాగ్రత్తగా ఆలోచించి, అభ్యర్థి పనులు చూసి నిర్ణయించి, సామర్థ్యాన్ని పరిశీలించి మాత్రమే సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవాలి. గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశం బలపడుతుంది. ఆ బలం మన చేతుల్లో ఉన్న ఓటుతో ప్రారంభమవుతుంది.
- తుమ్మ కమలహాసన్
95056 18252






