- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ బహిష్కరణ దారుణం!
ఏ దేశంలోనైనా చట్టవ్యతిరేక వలస దారులను గుర్తించినప్పుడు, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వారిని గౌరవప్రదంగా

ఏ దేశంలోనైనా చట్టవ్యతిరేక వలస దారులను గుర్తించినప్పుడు, అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వారిని గౌరవప్రదంగా, ఆ దేశాల నేతలతో చర్చలు జరిపి, సాధారణ వాణిజ్య విమానాల్లోనే పంపాలి. కానీ ట్రంప్ ఈ సూత్రాలను తుంగలో తొక్కి, భారతీయులను సైనిక కార్గో విమానాల్లో నేరస్తుల్లా బంధించి పంపాడు. ఇది కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, భారత్ వంటి దేశాల గౌరవాన్ని కూడా దిగజార్చే చర్య.
డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలు ఎల్లప్పుడూ జాత్యహంకారంతో, ద్వంద్వ నీతులతో, మానవ గౌరవాన్ని పూర్తిగా విస్మరించే ధోరణితో ముడిపడ్డవే. విద్య, ఉద్యోగం, మంచి భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులను సైనిక కార్గో విమానాల్లో అవమానకరంగా వెనక్కి పంపిం ది కేవలం కఠిన విధానం కాదు. ఇది మానవత్వంపై చేసిన మాఫ్ చేయలేని నేరం. వీళ్లంతా నేరస్తులు కాదు. కేవలం కొన్ని వీసాల ఉల్లంఘనలు ఉంటే, వారిని నేరస్తుల్లా బంధించడం సరైన చర్య కాదు. ఈ దారుణంపై ప్రపంచ ప్రజలు గళం విప్పాలి.
ట్రంప్ కుటుంబమే వలసదారు!
ఇక్కడ అసలు విషయంలోని విరోధాభాసాన్ని మర్చిపోవడం ఎలా? ట్రంప్ కుటుంబమే వలస కుటుంబం. అతని తల్లి మేరీ యాన్ మాక్లియడ్ స్కాట్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చిందే. అతని తాత ఫ్రెడ్రిక్ ట్రంప్ జర్మనీలో పుట్టి అమెరికా స్థిరపడ్డాడు. ట్రంప్ తన నరనరాల్లో ఉన్న వలస చరిత్రను మరచిపోయి వలసదారులపై ద్వేషాన్ని పెంచుతున్నాడు. అదే "ట్రంప్ విధానం" అతని పైనే అమలు చేస్తే, అతన్ని కూడా "చట్ట వ్యతిరేక వలసదారుడు" అని ముద్రించి జర్మనీ లేదా స్కాట్లాండ్‌కు పంపించాల్సి వచ్చేది. ట్రంప్ కుటుంబమే అసలు వలస సమస్య అని చెప్పాలి! అమెరికా చట్టాల ప్రకారం వలసదారుల పిల్లలు అమెరికాలో పుట్టినట్లయితే, వారికి పౌరసత్వ హక్కులు స్వయంగా లభిస్తాయి. అయినా, ట్రంప్ ప్రభుత్వం కేవలం చట్టవ్యతిరేక వలసదారులకే కాకుండా చట్టబద్ధంగా ఉన్న వలసదారుల కుటుంబాలపై కూడా ద్వేషంతో నడుచుకుంది. ఇది కేవలం వలసదారుల సమస్య కాదు. ట్రంప్ ద్వేష రాజకీయాలపై ఒక స్పష్టమైన ఉదాహరణ. అతని పాలనలో జాతి, వర్ణం, మతం ఆధారంగా తేడాలు స్పష్టంగా కనిపించాయి.
వలసలతోటే అమెరికా వికాసం!
భారత ప్రభుత్వం ఎల్లప్పుడూ అమెరికాతో సహకరిస్తూ, చట్ట వ్యతిరేకంగా ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. అయినప్పటికీ, ట్రంప్ దానిని పట్టించుకోకుండా, భారతీయులను ప్రపంచంలో అవమానపర్చాడు. ఇది కేవలం వ్యక్తులపై కాదు, భారత్ పట్ల కూడా అవమానకరమైన చర్య. ఇది కేవలం భారతీయుల సమస్య కాదు. ప్రపంచమంతా ఇలాంటి అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పాలి. అమెరికా ఎదుగుదలకు కారణం వలసదారులే. అనేక రంగాలలో విజ్ఞానం, పరిశ్రమ, కళ, సాంకేతికత, వలసదారులే ప్రధాన పాత్ర వహించారు. కానీ ట్రంప్ అమెరికా చరిత్రను విస్మరించి, వలసదారులను నేరస్తుల్లా చిత్రించడంలో కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నాడు.
నిరసనలు మాత్రమే సరిపోవు..
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ట్రంప్ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అంతటా, ప్రపంచ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ నేతలు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే కేవలం నిరసనలు మాత్రమే సరిపోవు. ప్రపంచ దేశాలు ట్రంప్ అమెరికా విధానాలపై గట్టి ప్రతికూల విధానాలు చేపట్టాలి. అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని, దాని సుంక విధానాలను, ఆగ్రమార్గ ప్రవర్తనను ఎదుర్కోవడానికి ప్రపంచం ఒక్క టిగా ఐక్యంగా నిలవాలి. చిన్న దేశాలను బెది రించే ట్రంప్ సామ్రాజ్యవాదాన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది.
ట్రంప్ పతనం తప్పదు!
ట్రంప్ పాలన కేవలం వలసదారుల పట్ల ద్వేషంతోనే కాదు, మానవత్వానికి వ్యతిరేకంగా కూడా నిలిచింది. అతని జాత్యహంకార విధా నాలు, విస్తరణవాద కలలు, ఇతర దేశాలపై ఆగ్రహవేతర ధోరణి ప్రపంచం గుండెను కలచివేస్తున్నాయి. అతను గోడలు కట్టించవచ్చు, కానీ చరిత్ర ఆ గోడలను కూల్చివేస్తుంది. ట్రంప్ జ్ఞాపకాలు పౌరసత్వం లేదా చట్టాల కోసం చేసిన గొప్ప కృషి ద్వారా కాదు, ద్వేషం, విభజ న, మానవ హక్కుల అవమానాలుగా గుర్తించబడతాయి. వలసదారుల పట్ల ద్వేషం చూపిన నేతగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోతాడు.
డాక్టర్ శ్రీరామ్ సాగర్
98493 28496






