- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎర్ర జెండా ఇక చరిత్రేనా?
కేరళలో LDF ఓటమితో దేశంలో కమ్యూనిస్టు పాలనకు ముగింపు పలికిన ఈ సందర్భం, భారత వామపక్ష రాజకీయాల పతనం, కారణాలు, చరిత్ర, భవిష్యత్తు దిశలపై విశ్లేషణ.

భారత రాజకీయ చరిత్రలో ఒక యుగం నిశ్శబ్దంగా ముగిసింది. కేరళలో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (LDF) ఓటమితో, 49 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఓ ఎన్నికల ఫలితం కాదు.. ఒక భావజాలం, ఒక ఉద్యమం, ఒక కాలం క్రమంగా వెనుకకు జారిపోతున్న సంకేతం..
గతంలో ఎర్ర జెండా అంటే ఒక పార్టీ గుర్తు కాదు అది ఒక ఆశ, ఒక సమానత్వం, ఒక పోరాటం. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ఓటమి.. అది కేవలం ఓ ఎన్నికల ఫలితం కాదు. ఒక యుగం నిశ్శబ్దంగా ముగిసిన క్షణం. దశాబ్దాల పాటు సమానత్వం, సంక్షేమం, సామాన్యుడి హక్కుల కోసం ఎర్ర జెండా ఎగరేసిన భూమిలో, ఇప్పుడు అదే జెండా క్రమంగా కిందకు జారిపోతున్న దృశ్యం హృదయాన్ని తాకుతోంది.
విప్లవం నుంచి వ్యవస్థకు....
1920లలో భారతదేశంలో కమ్యూనిస్టు ఆలోచనలు ప్రారంభమై, 1925లో CPI స్థాపనతో రాజకీయ శక్తిగా ఎదిగాయి. 1964లో CPI–CPM విభజన జరిగినా, కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపురలో బలంగా నిలిచాయి. కేరళలో 1957లో ఈఎంఎస్ నేతృత్వంలో మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, తర్వాత UDF–LDF మధ్య అధికార మార్పిడి కొనసాగింది. 2016, 2021లో LDF గెలిచింది. మూడోసారి విఫలమైంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో 1977–2011 వరకు 34 ఏళ్లు వామపక్ష పాలన సాగింది. సింగూర్, నందిగ్రామ్ వివాదాలు వారికి చేటు చేయడంతో 2011లో టీఎంసీ చేతిలో ఓడిపోయింది. ఇక త్రిపురలో 1993–2018 వరకు వామపక్ష ప్రభావం బలంగా ఉన్నప్పటికీ 2018లో దాన్ని బీజేపీ కూల్చేసింది. 2026లో కేరళ కూడా దూరమైంది,
ఎందుకు వెనుకబడ్డాయి?
ఇలా ఒక్కొక్క కోట కూలిపోతూ ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అధికారం లేకుండా విధానపరమైన ప్రయోగాలు చేయడం కష్టం. కాలంతో మారని సిద్ధాంతం, ప్రపంచం గ్లోబలైజేషన్ వైపు పరుగులు తీస్తుంటే, వామపక్షాలు 1920ల భావజాలంలోనే నిలిచిపోయాయి. ఇక కొత్త తరానికి దూరం కావడం వారికి శాపమే. నాయకత్వ సంక్షోభం, పాత తరం నాయకత్వం కొనసాగుతుండగా, కొత్త తరానికి అవకాశాలు తక్కువయ్యాయి. ఆర్థిక వాస్తవాలు, చైనా, వియత్నాం వంటి కమ్యూనిస్టు దేశాలు కూడా మార్కెట్ రిఫార్మ్స్ వైపు వెళ్లాయి. కానీ భార త వామపక్షాలు ఆ మార్పును పూర్తిగా అంగీకరించలేదు. అయితే అసమానతలు, లౌకికవాదం వంటి వామపక్ష భావాలకు సమాజంలో ఇంకా ఆదరణ ఉంది. అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుసరిస్తున్న సంక్షేమ విధానాలు వామపక్ష పార్టీల ప్రభావమే సుమా!
కేరళం ఓటమి..
కేరళలో వామపక్ష పాలన మంచి మానవ అభివృద్ధి సూచికలను సాధించింది. విద్య, ఆరోగ్యం, సంక్షేమంలో విజయాలు ఉన్నాయి. కానీ పదేళ్ల నిరంతర పాలన ‘మార్పు’ కోసం ఓటు వేయించింది. ఎన్నో తరాల మనుషుల కలలు, పోరాటాలు, సిద్ధాంతాలు కలిసిన వామపక్ష రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచాయి. దేశంలో కమ్యూనిస్టు పాలన పూర్తిగా లేకపోవడం, రాజకీయ చరిత్రలో ఒక ఖాళీని సృష్టించింది. ఒకప్పుడు ప్రజల మనసుల్లో నిప్పులా రగిలిన ఆ సిద్ధాంతం, మళ్లీ కొత్త రూపంలో పుట్టాల్సిన అవసరం ఉందని ఈ ఓటమి చెబుతోంది. వామపక్ష పార్టీలు అధికారంలో లేకపోయినా, వారి ఆలోచనలు ఇంకా సమాజంలో ఉన్నాయి.
భవిష్యత్తుకు మార్గాలు...
వామపక్షాలు బతకాలంటే కొత్త ఐడియాలజీ రీఫ్రేమ్ చేయాలి, యువతను ఆకర్షించాలి. డిజిటల్ యుగానికి తగ్గ రాజకీయ వ్యూహాలు ఆలోచించాలి. అలయన్స్ రాజకీయాలు భాగస్వామ్యంతో ముందుకు రావాలి. ఈ రోజు ఆ జెండా అధికార భవనాలపై ఎగరకపోయినా.. అనేక మంది మనసుల్లో అది రెపరెపలాడుతోంది. ఇప్పుడు తనను తాను కొత్తగా పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.
-డాక్టర్. కేశవులు ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659






