ఓటు ధర కాస్ట్‌లీ గురూ..

by Ravi |   (  Updated:2025-12-16 00:30:31  IST  )

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు, కానీ నేడు ఆ ప్రజలే అపహాస్యం అవుతున్నారనే మాటలు ప్రధానంగా వినవస్తున్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే

ఓటు ధర కాస్ట్‌లీ గురూ..
X

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు, కానీ నేడు ఆ ప్రజలే అపహాస్యం అవుతున్నారనే మాటలు ప్రధానంగా వినవస్తున్నాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే గ్రామాల్లోని ప్రధాన సమస్యలైనా తాగు నీరు, వీధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం వంటి మౌలిక అవసరాలు తీర్చే వ్యవస్థ. కానీ నేడు ఆ వ్యవస్థకు పూర్తి భిన్నంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయంటేనే ప్రధాన సమస్యలను గాలికొదిలేసి నీ కులపోళ్లు ఎంత మంది? నా కులపోళ్లు ఎంత మంది? అంటూ లెక్కలు వేసుకొని మందు, మాంసం, ఓటుకు నోటు.. అంటూ ఇటు ప్రజలు అటు నాయకులు బేరసరాలకు దిగుతున్నారు. దీంతో గ్రామంలోని మౌలిక సమస్యల ప్రస్తావన గాలికొది లేశారు.. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఓటుకు 2 వేల నుండి 5 వేలు పంపిణీ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే పరిస్థితులు ఎక్కడికి వెళ్తున్నాయో గమనించవచ్చు.. కొందరు నాయకులైతే ఇంతటితో ఆగకుండా ఓ కులంలో ఓట్లు గంపగుత్తగా పడతాయని తెలుసుకొని ఆ కులంతో 10 లక్షల బ్లాంక్ చెక్‌ను బేరం ఆడుకున్నాడంటే నోటుకు ఓటు ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో ఓటర్లను ఆకర్షించడానికి వస్తువులు పంచేవారు. కానీ ఇప్పుడు డబ్బుల పంపిణీ విపరీతంగా పెరిగిపోయింది. గ్రామంలోని ఏ ఒక్కరు కూడా అభ్యర్థులను మా సమస్యలు పరిష్కరించండి చాలు.. అంటూ అడగడం మర్చి పోయారు. మీకు ఓటేయడానికి ఎంతిస్తారు? నగరంలో ఉంటే చార్జీలు పంపండనే నానుడి గ్రామాల్లో మొదలయింది. దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ ఎటువైపుకు పరుగెడుతుందోననే ఆందోళన మొదలయింది. ఎన్నికలు ఇలా జరుగుతున్న సందర్భంలో అంతిమంగా ప్రజలు మారాలో.. నాయకులు మారాలో కాలమే సమాధానం చెప్పాలి. ఇదే ఇలా ఉంటే కొద్ది రోజుల్లో మొదలు కానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా ఉంటాయో?

- తీగల రఘు

96669 00922

Next Story