నవభారత నిర్మాణం.. జన గణనతో శ్రీకారం

by Ravi |   (  Updated:2025-06-19 00:31:07  IST  )

146 కోట్ల మంది ప్రజలతో, ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం, జనాభా లెక్కల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

నవభారత నిర్మాణం.. జన గణనతో శ్రీకారం
X

146 కోట్ల మంది ప్రజలతో, ప్రపంచ జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం, జనాభా లెక్కల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అందుకు గాను కేంద్రం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో రెండు విడతల్లో గణన జరిగి 2027 మార్చి ఒకటవ తారీఖుకి కొత్త అధికారిక లెక్కలు పూర్తవుతాయి. అయితే దశాబ్దానికి ఒకసారి జరగాల్సిన గణన ఈసారి కొవిడ్ పరిస్థితుల కారణంగా, ఏడేళ్లు ఆలస్యంగా జరగబోతోంది. ఈ గణన దేశ రాజకీయ, శాసన, పాలన ముఖచిత్రాల్ని మార్చబోతోంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగి 2029 ఎన్నికలకు దేశం సిద్ధపడుతుంది. ఇంతవరకూ 1971 జనాభా ఆధారంగా ఉండడం వల్ల, అప్పటికీ, ఇప్పటికీ అది ఎన్నో రెట్లు పెరగడం వల్ల నియోజకవర్గాలు కూడా ఎక్కువవుతాయి. వాటిని ఎలా వివాద రహితంగా పెంచాలన్నది పెద్ద సవాలు.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తాము నష్టపోగల పరిస్థితి పట్ల ఆందోళన వెలిబుచ్చుతూ కేంద్రాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ సారి స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా జనాభా లెక్కల్లో కులగణన కూడా జరగబోతోంది. ఇప్పటి వరకూ కులాల విషయంలో 1931 లెక్కలే ప్రాతిపదికగా కొనసాగాయి. రానున్న కొత్త లెక్కలు మరింత వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. అయితే అది రాజకీయ ప్రభావంతో కొత్త వివాదాల్ని తీసుకురావచ్చు. ఏదేమైనా అసలు గణాంకాలు, వాస్తవ స్థితులు పారదర్శకంగా ప్రజల ముందు ఉండాలి. సామాజిక న్యాయం అమలు వాటిపైనే ఆధారపడి ఉంటుంది. కనుక ఖచ్చితత్వం తప్పనిసరి. ఆధునిక సాంకేతికత సాయంతో, రాజకీయ సంకల్పంతో జనగణన సజావుగా సాగాలి. భార త దేశం సంపన్న దేశంగానే కాకుండా ఆర్థిక, సామాజిక, ప్రాంతీయ అంతరాలు లేని దేశంగా రూపుదిద్దుకోడానికి జనగణన మొదటి మెట్టు.

డా. డి.వి.జి. శంకరరావు

94408 36931

Next Story