రాజ్యాంగం.. మార్గం చూపే జీవన పత్రం

by Ravi |   (  Updated:2025-11-26 00:45:58  IST  )

భారత రాజ్యాంగం కేవలం 1950లో అమలులోకి వచ్చిన ఒక రాజకీయ పత్రం మాత్రమే కాదు. ఈ రోజు దేశంలో పనిచేసే ప్రతి వ్యవస్థకు ప్రాణాధారం. దేశంలో రాజకీయ విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడినా

రాజ్యాంగం.. మార్గం చూపే జీవన పత్రం
X

భారత రాజ్యాంగం కేవలం 1950లో అమలులోకి వచ్చిన ఒక రాజకీయ పత్రం మాత్రమే కాదు. ఈ రోజు దేశంలో పనిచేసే ప్రతి వ్యవస్థకు ప్రాణాధారం. దేశంలో రాజకీయ విచ్ఛిన్నకర పరిస్థితులు ఏర్పడినా, ప్రభుత్వ అధికారాన్ని నియంత్రించి, ప్రజల హక్కులను రక్షించేది మన రాజ్యాంగం. ప్రస్తుతం పెరుగుతున్న జనాభా, ఆర్థిక అసమానతలు, మత విభేదాలు, ప్రాంతీయ అసమానతలు, సాంకేతికత వల్ల ఏర్పడిన గోప్యత సవాళ్లు వంటి అనేక సమస్యల మధ్య, ప్రతి పౌరుడి జీవితం గౌరవప్రదంగా ఉండేలా, మన మౌలిక హక్కులు రక్షణ కల్పిస్తున్నాయి. వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు, సమానత్వపు హక్కు, విద్యా హక్కు ఇలాంటి హక్కులు లేకపోతే ప్రజాస్వామ్యం అనేది కేవలం పేరుకే మిగిలిపోయేది. ఈరోజు డిజిటల్ యుగంలో పౌరుల డేటా రక్షణ, మీడియా స్వేచ్ఛ, ఇంటర్నెట్ హక్కు వంటి నూతన పరి ణామాలను కూడా భారత న్యాయస్థానాలు రాజ్యాంగ సూత్రాల ద్వారా వ్యాఖ్యానాలు చేసి, భారత రాజ్యాంగ ప్రతిష్టను కాపాడుకుంటూ వస్తున్నాయి. రాజ్యాంగం అధికార విభజన ద్వారా విధాన సభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ, ఈ మూడింటిని స్పష్టమైన పరిమితుల్లో ఉంచి, ఒకదానిపై మరొకదానికి చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేసి అధికార దుర్వినియోగాన్ని నివా రించడంలో ఎంతో కీలక పాత్రను పోషిస్తోంది. మన న్యాయవ్యవస్థ ఇప్పటికీ స్వతంత్రంగా ఉన్నదంటే అది కూడా మన రాజ్యాంగం వల్లే.. ఇక దేశంలో రాజకీయ మార్పులు వచ్చినా, ప్రభుత్వాలు మారినా, దేశవ్యవస్థ సాఫీగా పని చేయడానికి మన భారత రాజ్యాంగం ఇచ్చిన స్థిరమైన వ్యవస్థే కారణం. అందువల్ల, మన రాజ్యాంగం, ఈరోజు కేవలం ప్రభుత్వాన్ని నడిపించే పత్రం కాదు.. భారతదేశం ఏ దిశలో నడవాలి, సమాజం ఎలా ఉండాలి, పౌరులకు ఎంత స్వేచ్ఛ, ఎంత రక్షణ ఉండాలనే అన్నింటికి మార్గం చూపే జీవన పత్రం, ప్రజా స్వామ్యానికి రక్షణ కవచం, దేశ స్థిరత్వానికి బలమైన పునాది. మన భారత రాజ్యాంగం’ అని చెప్పవచ్చు.

- బాసాని లావణ్య

91609 75164

Next Story