- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశాన్ని కుదిపేస్తున్న కాక్రోచ్ గర్జన!
దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, పరీక్షల లీకులు, అవకాశాల కొరతపై యువత ఆవేదన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ రూపంలో సోషల్ మీడియాలో విస్ఫోటనంగా మారుతోంది. డిజిటల్ యుగంలో కొత్త తరపు నిరసన రాజకీయాలకు గట్టి హెచ్చరికగా మారిన ఈ ఉద్యమంపై ప్రత్యేక విశ్లేషణ.

దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది.. పరీక్షలపై నమ్మకం కూలిపోతోంది.. డిగ్రీలు చేతిలో ఉన్నా భవిష్యత్తు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో యువత కోపం వీధుల్లో కాకుండా, సోషల్ మీడియా స్క్రీన్లపై పేలుతోంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) అనే వ్యంగ్య ఉద్యమం వెనుక దాగి ఉన్నది నవ్వు కాదు.. అవకాశాలు కోల్పోయిన తరం ఆవేదన.
అధికార వ్యవస్థలు యువతను ఎగతాళి చేస్తే, అదే తరం ఒక రోజు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి చేరుతుందని ఈ పరిణామం గట్టిగా హెచ్చరిస్తోంది. ఆ అరుపును ఇప్పటికైనా వినకపోతే, రేపు అది కేవలం రాజకీయాలను కాదు, దేశ భవిష్యత్తునే కుదిపే తుఫానుగా మారవచ్చు.
వ్యంగ్యం నుంచి విస్ఫోటనంగా మారి..
2026 మే 16న అభిజీత్ దీప్కే ప్రారంభించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ మొదట సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టుల రూపంలో కనిపించింది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ చేసిన “బొద్దింకలు, పరాన్నజీవులు” వ్యాఖ్యల తర్వాత ఈ ఉద్యమం యువతలో వేగంగా వ్యాపించింది. కొద్ది రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్లాది మంది ఫాలో వర్లను సంపాదించి, ప్రధాన రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకంటే ఎక్కువ చర్చకు దారి తీసింది.
యువత కోపానికి అసలు కారణాలేమిటి?
ఇది కేవలం మీమ్ కల్చర్ కాదు. ఉద్యోగాల కొరత, నీట్ వంటి పరీక్షల లీకులు, అవినీతి, అవకాశాల్లో అస మానత.. ఇవన్నీ కలిసి యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచుతున్నాయి. రాత్రింబవళ్లు చదివి పరీక్షలు రాసినా, చివరికి వ్యవస్థల వైఫల్యంతో భవిష్యత్తు చీకటిగా మారుతుండటం యువతను మానసికంగా కుంగదీస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే వ్యంగ్య పోస్టులు, సెటైర్లు, మీమ్స్.. ఇవన్నీ చూస్తే ఒక తరం బాధకు ప్రతిబింబాలు. నవ్వుల వెనుక నిరాశ, సెటైర్ల వెనుక కోపం, వైరల్ పోస్టుల వెనుక అవకాశాల కోసం అల్లాడుతున్న జీవితాలు కనిపిస్తున్నాయి.
బ్లాక్ చేసినా ఆగని డిజిటల్ అలజడి!
ఎక్స్ ఖాతాలు బ్లాక్ కావడం, వెబ్‌సైట్ డౌన్ అవడం, హ్యాకింగ్ ఆరోపణలు వచ్చినా ఈ ఉద్యమం ఆగలేదు. కొత్త ఖాతాలు, కొత్త పేజీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కాక్రోచ్ కాస్ట్యూమ్స్‌తో క్లీనప్ డ్రైవ్స్ వంటి ఆఫ్‌లైన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ కాదు.. డిజిటల్ యుగంలో కొత్త తరపు నిరసన రూపంగా మారుతోంది. ఇప్పటివరకు యువతను కేవలం ఎన్నికల సమయంలో గుర్తు చేసుకునే రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు వారి ఆవేదనను వినక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలు, విద్యా సంస్కరణలు, పరీక్షల పారదర్శకత, ‘రైట్ టు ఎంప్లాయ్‌మెంట్’ వంటి అంశాలు రేపటి రాజకీయ అజెండాలను ప్రభావితం చేసే అవకాశముంది. ప్రధాన పార్టీలు యువత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, సీజేపీ వంటి ప్రత్యామ్నాయ ఉద్యమాలు మరింత బలపడతాయి. ఇవి సంప్రదాయ రాజకీయాలకు సవాల్‌గా మారవచ్చు..
డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఉద్యమం భారత యువతలో పెరుగుతున్న ‘డిజిటల్ ఐడెంటిటీ పాలిటిక్స్’కు ప్రతీకగా మారుతోంది. ఒకప్పుడు రాజకీయ పార్టీల జెండాల కింద నిలిచిన యువత, ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్‌ల కింద ఏకమవుతోంది. భావోద్వేగాలు, అసంతృప్తి, సామాజిక ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే వేగంగా ఉద్యమాలుగా మారుతున్నాయి. యువత మనస్తత్వంలో వచ్చిన ఈ మార్పును రాజకీయ వ్యవస్థలు అర్థం చేసుకోకపోతే, రేపటి భారత రాజకీయ పటంలో ఊహించని మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
రాజకీయాలకు గట్టి హెచ్చరిక!
ఇప్పటివరకు యువతను కేవలం ఎన్నికల సమయంలో గుర్తు చేసుకునే రాజకీయ వ్యవస్థ, ఇప్పుడు వారి ఆవేదనను వినకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలు, విద్యా సంస్కరణలు, పరీక్షల పారదర్శకత, “రైట్ టు ఎంప్లాయ్‌మెంట్” వంటి అంశాలు రేపటి రాజకీయ అజెండాలను ప్రభావితం చేసే అవకాశముంది. ప్రధాన పార్టీలు యువత సమస్యలను నిర్లక్ష్యం చేస్తే, సీజేపీ వంటి ప్రత్యామ్నాయ ఉద్యమాలు మరింత బలపడతాయి. ఇవి సంప్రదాయ రాజకీయాలకు సవాల్‌గా మారవచ్చు.
ప్రజాస్వామ్యానికి ముందున్న ప్రమాదం!
ప్రతి విమర్శను దేశద్రోహంగా, ప్రతి వ్యంగ్యాన్ని కుట్రగా చూడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అదే సమయం లో, డిజిటల్ కోపం నియంత్రణ కోల్పోతే సామాజిక అస్థిరత పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ ఉద్యమాన్ని కేవలం “మీమ్ గ్యాంగ్”గా తీసిపారేయడం ప్రమాదకరం. ఈ కథలో అసలు విషాదం ఏమిటంటే.. దేశ భవిష్యత్తు కావాల్సిన యువత, ఇప్పుడు తమ బాధను “కాక్రోచ్” అనే ప్రతీకతో వ్యక్తం చేయాల్సిన పరిస్థితికి చేరుకుంది. ఇది ఒక తరానికి జరిగిన అవమానం మాత్రమే కాదు.. మన వ్యవస్థల వైఫల్యానికి అద్దం. యువతను ట్రోల్స్‌గా, మీమ్ క్రియేటర్లుగా చూడడం సులువు. కానీ వాళ్ల కలలు ఎందుకు కూలిపోతున్నాయో అర్థం చేసుకోవడం కష్టం. అదే బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, విద్యా వ్యవస్థలపై ఉంది.
వినిపించని తరం ఆర్తనాదం
ప్రజాస్వామ్యం కేవలం ఓట్లతో కాదు.. యువత నమ్మకంతో నిలబడుతుంది. ఆ నమ్మకం విరిగిపోతే, వ్యవస్థల పునాదులే కదిలిపోతాయి. చిన్నచూపు చూసిన స్వరాలే ఒక రోజు మహా ఉద్యమాలుగా మారుతాయని చరిత్ర చెబుతోంది. “కాక్రోచ్” అనే పదం వెనుక దాగి ఉన్నది అసహనం కాదు.. వినిపించని తరం ఆర్తనాదం. ఆ అరుపును ఇప్పటికైనా వినకపోతే, రేపు అది కేవలం రాజ కీయాలను కాదు, దేశ భవిష్యత్తునే కుదిపే తుఫానుగా మారవచ్చు.
-కాలగిరి శ్రీనివాస్ రెడ్డి,
90101 28884






