కులగణన సరైనదే.. బీసీల ఆశలకు బలం!

by Ravi |   (  Updated:2026-05-27 01:00:44  IST  )

కులగణన అవసరంపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, బీసీల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై కొత్త చర్చకు దారితీశాయి. సమగ్ర కులగణన డిమాండ్ ఎందుకు పెరుగుతోందో విశ్లేషణ.

కులగణన సరైనదే.. బీసీల ఆశలకు బలం!
X

దేశ రాజకీయాల్లో, సామాజిక న్యాయ చర్చల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కులగణన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన వర్గాల అసలు పరిస్థితులు తెలు సు కోవాలంటే కులగణన అవసరమని స్పష్టం చేస్తూ, దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టి వేసింది. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండదని పేర్కొంది.

సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బీసీ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తించగా.. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల అమలుపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.

కొలిచినదే కొలమానమవుతుందన్నట్లు..

దేశంలో దశాబ్దాలుగా బీసీల వాస్తవ గణాంకాలను చాక చక్యంగా దాచిపెట్టారు. బీసీలు ఎంత మంది? వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి? విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో వారికి నిజంగా ఎంత ప్రాతినిధ్యం ఉంది? సంక్షేమ పథకాలు ఎవరికి చేరుతున్నాయి? అనే ప్రశ్నలకు ఈరోజు కూడా అధికారిక సమాధానం లేదు. దేశ జనాభాలో సింహభాగం ఉన్న బీసీ వర్గాల అసలు స్థితిగతులు దేశానికి తెలియకుండా ఒక వ్యవస్థ కొనసాగింది. ఇప్పుడు ఆ వ్యవస్థపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లోనే కాదు, సామాజిక న్యాయ చరిత్రలో కూడా కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. “కొలిచినదే కొలమానమవుతుంది” అన్నట్లు.. లెక్కలలో లేని వర్గాలకు న్యాయం ఎలా జరుగుతుంది? దేశ జనాభాలో ఓబీసీ లు 50% దాటినట్టుగా మండల్ కమిషన్ అంచనా వేసింది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయి అధికారిక కులగణన జరగలేదు. 1931 తర్వాత సమగ్ర కుల ఆధారిత జనాభా లెక్కలు వెలువడ లేదు. ఇదే సమయంలో ఉన్నత విద్య, కేంద్ర ఉద్యోగాలు, పాలన వ్యవస్థల్లో బీసీల ప్రాతినిధ్యం ఇంకా తీవ్ర అసమానతలతోనే ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

గణాంకాలు తెలియకుండా సంక్షేమం సాధ్యమా?

గ్రామాల్లో వేలాది బీసీ కుటుంబాలు ఇంకా కూలీ పను లు, సంప్రదాయ వృత్తులకే పరిమితమై ఉన్నాయి. చదువు మధ్యలో మానేసే పిల్లల్లో, నిరుద్యోగ యువతలో, వలస కూలీల్లో బీసీల శాతం అధికంగా ఉండటం సామాజిక వాస్తవం. ‘కడుపు నిండని వాడికి కలలు ఎలా వస్తాయి?’ అన్న సామెతలా.. అవకాశాలు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం? ఇప్పటి వరకు కొంతమంది ‘కులగణన వల్ల దేశం విడిపోతుంది’ అనే వాదనను ముందుకు తెచ్చారు. కానీ అసలు ప్రశ్న వేరే. జనాభా వివరాలు లేకుండా సంక్షేమం ఎలా అందుతుంది? గణాంకాలు తెలియకుండా రిజర్వేషన్లు ఎలా సమర్థవంతమవుతాయి? బడ్జెట్ కేటాయింపులు ఎలా న్యాయంగా జరుగుతాయి? కులగణన అంటే దేశాన్ని విభజించడం కాదు.. ఇప్పటి వరకు జరిగిన అసమానతలను అద్దంలో చూపించడం. గాయాన్ని దాచిపెడితే నయం కాదు. ముందుగా గాయం ఎక్కడుందో తెలుసుకోవాలి. అదే కులగణన ఉద్దేశ్యం.

కులగణనపై డిమాండ్ ఇందుకే..

దేశ రాజకీయాల్లో బీసీలు ఓట్ల పరంగా అత్యంత కీలకమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందినా, వారి అసలు జనాభా ఎంత? వారి ఆర్థిక, సామాజిక, విద్యా పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయి? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేకపోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇదే కారణంగా దేశవ్యాప్తంగా కులగణనపై డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. బీసీల ఓట్లు కావాలి.. కానీ వారి అసలు పరిస్థితులు బయటపడకూడదా? అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల్లోనే కాకుండా మేధావులు, సామాజిక సంఘాలు, రాజకీయ విశ్లేషకుల మధ్య కూడా చర్చనీయాంశ‌మైంది. ఎందుకంటే కులగణన ద్వారా వాస్తవాలు బయటకు వస్తే దేశంలో సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, ఉద్యోగాలు, విద్యా అవకాశాల పంపిణీపై కొత్త చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు కొన్ని ఆధిపత్య వర్గాల చేతుల్లో కేంద్రీకృతమైన అధికార, అవకాశాలపై ప్రశ్నలు తలెత్తుతాయి. అలాగే బీసీలకు జనాభా నిష్పత్తికి తగ్గ ప్రాతినిధ్యం దక్కుతోందా లేదా అన్న అంశం కూడా స్పష్టమవుతుంది.

ఈ తీర్పు ఆ వర్గాలకు నైతిక బలం!

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు కేవలం న్యాయపరమైన పరిశీలనలు మాత్రమే కావు.. దశాబ్దా‌లుగా అణగారిన వర్గాలకు నైతిక బలం. ఇది సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న కోట్లాది బీసీల ఆశల ప్రతిధ్వని. ఈ తీర్పు దేశానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. ‘సామాజిక న్యాయం కోసం నిజాలను దాచ కూడదు.’ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజకీయ లెక్కలు పక్కనపెట్టి దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన చేపట్టాలి. అదే రాజ్యాంగానికి గౌరవం. అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల. అదే నిజమైన ప్రజాస్వామ్యం.

-దుండ్ర కుమారస్వామి,

జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు

9959912341

Next Story