బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన ద్రోహలు..

by Ravi |   (  Updated:2025-07-17 01:15:39  IST  )

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎంతోమంది బీసీలు

బీసీలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన ద్రోహలు..
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఎంతోమంది బీసీలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చారు. బీఆర్ఎస్ సైతం బీసీ ఓటు బ్యాంక్‌ను పటిష్టంగా తమవైపు నిలబెట్టుకునేందుకు ఎన్నో హామీలను ప్రకటించింది. కానీ 10 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనను పరిశీలిస్తే, బీసీలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పూర్తిగా అమలు కాలేదు.. కానీ 2023 డిసెంబర్‌లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీల సంక్షేమానికి ప్రత్యేకంగా ₹10,000 కోట్ల బీసీ సబ్‌ప్లాన్ ప్రకటించింది. ఇది చరిత్రలో బీసీల అభివృద్ధికి తెలంగాణ చేసిన తొలి ప్రయత్నం.

తెలంగాణ రాష్ట్రంలో 56%కి పైగా జనాభా బీసీలు.. కానీ రాజకీయంగా ఈ వర్గానికి న్యాయం జరగడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం బీసీలను రక్షించేందుకు ఎన్నో కమిటీలను వేశానని చెప్పుకుంటూ వచ్చింది గానీ, అవి తుది నివేదికలు సమర్పించకుండానే మూసివేసిన ఘనమైన చరిత్ర ఆ పార్టీది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పి.. నివేదికలు ఇవ్వనివ్వకుండా మూసివేశారు. బీసీ ఓట్లపై ఆధారపడిన పార్టీగా చెప్పుకున్నా, అసెంబ్లీలో, మంత్రి మండలిలో బీసీ మంత్రుల ప్రాతినిధ్యం గణనీయంగా లేదు. బీసీ గురుకులాలు, హాస్టల్స్, స్టడీ సర్కిల్స్ అన్నీ దిగజారిపోయాయి. బీసీ ఉద్యమాలు చేసినవారిని కొండపై నుండి తన్నిపడేసినట్టే ఆ ఉద్యమ నేతలను బీఆర్ఎస్ ఆదరించలేదు.

కుల గణనకు అడ్డుపుల్ల..

దేశవ్యాప్తంగా బీసీ వర్గాలు కోరుతున్న ప్రధాన న్యాయ అజెండా కుల గణన. ఇది జరగాల్సినది కేంద్రం నిబంధనల ప్రకారం. అదీ రాష్ట్రాల సహకారంతోనే సాధ్యమవుతుంది. అయితే బీజేపీ కుల గణనపై అణచివేత విధానం అవలంబిస్తే, బీఆర్ఎస్ మాత్రం గుండెలపై చెయ్యేసుకుని బీసీలకు తాను గొప్ప మిత్రుడినని నటిస్తూ వచ్చింది. తాము బీసీలకు మిత్రులమని చెబుతూ, అన్యాయాన్ని అడ్డుకునే అవకాశం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా నిలిచారు.. బీసీలకు న్యాయం చేయాలన్న నిజమైన ఆసక్తి ఉన్న పార్టీల దృష్టిలో బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టమవుతోంది. కులగణనలో పాల్గొనకపోవడం, డెడికేషన్ కమిషన్‌కు సహకరించకపోవడం, బీసీ వర్గీకరణ నివేదికలను పక్కన పెట్టడం ఇవన్నీ బీసీలను వంచించడమే.

తమ ఆధీనంలోని డేటాను ఇవ్వకుండా..

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కేంద్రం జస్టిస్ జి. రోహిణి నేతృత్వంలోని డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రాల సహకారంతో దేశ వ్యాప్తంగా బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఆధీనంలోని డేటాను ఇవ్వలేదు. బీసీల ఉపవర్గాల రిజర్వేషన్ పై అభిప్రాయం తెలియజేయలేదు. అసెంబ్లీలో దీనిపై చర్చకే వీలు కల్పించలేదు. తెలంగాణలో బీసీ అభ్యర్థులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న భావన వాస్తవానికి దూరం. గ్లోబల్ రిక్రూట్‌మెంట్ పద్ధతులు, కాంట్రాక్ట్ ఉద్యోగాల విధానం, ప్రైవేటీకరణ నినాదాలు.. బీసీల అవకాశాలను తగ్గించేశాయి. ఉదాహరణకు, గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్ ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను ఖచ్చితంగా పాటించలేదు. బీసీ కార్పొరేషన్‌లో నియామకాలు కేవలం రాజకీయ అనుకూలతపై ఆధారపడ్డాయి. బీసీ బ్యాంక్ లోన్‌లకు మంజూరైన నిధులు చాలా తక్కువ. రాష్ట్రంలో బీసీలకు ఉద్యోగాల్లో అవకాశాలు తక్కువగా ఉండడం ద్వారా వారికి ఆర్థిక భద్రత దూరంగా ఉంటోంది.

బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ..

బీఆర్ఎస్ మేనిఫెస్టోల్లో ప్రతిసారి బీసీలకు గద్దె హామీ ఇచ్చినట్టే ఉంది. కానీ ఇద్దరికి తప్ప ఎవ్వరికి మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. ఎన్నికల సమయంలో బీసీలను నమ్మబలికింది. కానీ వారిని కేబినెట్‌లో అసంతృప్తిగా వదిలేసింది. బీసీల హక్కుల కోసం పోరాడే సంస్థలను బీఆర్ఎస్ ప్రోత్సహించలేదు. పరోక్షంగా నిరుత్సాహపరిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం నుంచి 23% తగ్గించింది కూడా బీఆర్ఎస్ పార్టీనే. 2020లో హైదరాబాద్‌లో జరిగిన బీసీ కారవాన్ ర్యాలీకి బీఆర్ఎస్ నేతల నుండి స్పందన రాలేదు. బీఆర్ఎస్ రాజకీయంగా బీసీలను సమగ్ర శక్తిగా గుర్తించలేదు. వర్గీకరణ, ఉప వర్గీకరణ పేరుతో వాళ్లను విభజించడమే చూసింది. కొన్ని బీసీ కులాలకే అవకాశాలు ఇవ్వడం, మరికొన్ని వదిలేయడం బీఆర్ఎస్ ప్రత్యేకత. బీఆర్ఎస్ వ్యవహార శైలి చూస్తే.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిందన్నది స్పష్టం.

బీసీల వైపు కాంగ్రెస్...

బీసీలకు రాజకీయ న్యాయం కావాలి. ఓటుతో మాత్రమే కాకుండా, గద్దెపై కూడా హక్కు కావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ ఉద్యమకారులను అరెస్ట్ చేయలేదు, అలాగే ఏనాడూ అణచి వేయలేదు. బీసీ సంఘాలతో నిరంతరంగా చర్చలు, సమస్యల పరిష్కారానికి సమన్వయం కొనసాగుతోంది. బీఆర్ఎస్ వాగ్దానాలకే పరిమితమై మోసం చేసినప్పుడు, బీజేపీ కుల గణనపై నిర్లక్ష్యం చూపిన సమయంలో, కాంగ్రెస్ మాత్రం బీసీల పట్ల, నిబంధనాత్మకంగా, బడ్జెట్‌తో, ప్రాతినిధ్యంతో కాస్తంత చిత్తశుద్ధితో వ్యవహరించింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గాలు తమకు తామే మార్గదర్శకులుగా మారాలి. న్యాయం కోరేందుకు కొత్త దిశలో ఆలోచించాలి. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ వారిని కాదు, నిజంగా బీసీలకు భవిష్యత్తు ఇవ్వగల వారిని గౌరవించాల్సిన అవసరం ఉంది.

- డాక్టర్. బి. కేశవులు

ఎండి. సైకియాట్రీ.

85010 61659

Next Story