- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరసమైన ధరలో ఉత్తమమైన ఔషధం.. జన్ ఔషధి
భారతదేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి దారి తీసిన అత్యంత ప్రధానమైన కార్యక్రమాల్లో ఒకటి

భారతదేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకి దారి తీసిన అత్యంత ప్రధానమైన కార్యక్రమాల్లో ఒకటి ‘ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పర్యోజన యోజన’ ఈ జన ఔషధి ఔషధాలు అధిక ఖర్చుతో కూడిన బ్రాండ్ ఔషధాలకు బదులుగా ప్రజలకు లభించడం వల్ల, వారిపై ఉన్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించగలిగాయి. గ్రామీణ, అర్బన్ పేద ప్రజలు సైతం తక్కువ ధరలకు నాణ్యమైన ఔషధాలను పొందే అవకాశం కలిగింది.
నేడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా మధుమేహం, హేపర్ టెన్షన్, కిడ్ని సంబంధ, లివర్ సంబంధ, నరాలు, బ్రెయిన్ సంబంధ వ్యాదులు విస్తరిస్తున్న సందర్భంలో జన ఔషధి గురించి సామాన్య ప్రజలకు తెలియాల్సిన అవశ్యకత ఉంది. భారతదేశంలో అధిక ధరల కారణంగా అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజలు అవసరమైన ఔషధాలను కొనలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత ప్రభుత్వం 2008లో జన ఔషధి పథకాన్ని ప్రారంభించింది. అయితే, 2015లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దీనిని పునర్నిర్మించి, ‘ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి పర్యోజన యోజన’గా రూపుదిద్దుకుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రజలకు నాణ్యమైన జెనరిక్ ఔషధాలను తక్కువ ధరలకు అందించడం. బ్రాండ్ కంపెనీలు విక్రయించే ఔషధాలకు బదులుగా, అదే సమర్థత ఉన్న తక్కువ ధర కలిగిన ఔషధాలను ప్రజలకు సరఫరా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.
జన ఔషధి ప్రత్యేకతలు..
జన ఔషధి మందుల ధరలు బహిరంగ మార్కెట్లో లభించే బ్రాండెడ్ మందుల ధరల కంటే 50%-80% తక్కువ. ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మంచి తయారీ పద్ధతులు (WHO-GMP) సర్టిఫైడ్ తయారీదారుల నుండి మాత్రమే మందులు సేకరించబడతాయి. ప్రతి బ్యాచ్ ఔషధాన్ని ఉత్తమ నాణ్యతను నిర్ధారించడానికి 'నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్' (NABL) గుర్తింపు పొందిన ప్రయోగశాలలలో పరీక్షిస్తారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాలు.. నీతి ఆయోగ్ ద్వారా ఆకాంక్షాత్మక జిల్లాలుగా పేర్కొనబడిన వెనుకబడిన ప్రాంతాలలో లేదా మహిళా పారిశ్రామికవేత్త, మాజీ సైనికుడు దివ్యాంగ్, ఎస్సీ, ఎస్టీల ద్వారా ప్రారంభించబడిన PMBJP కేంద్రాలకు ఒకేసారి రూ. 2.00 లక్షల ప్రోత్సాహకాలు అందించబడతాయి. ఈ ఔషధ కేంద్రాల నాణ్యతను భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఇతర ఆరోగ్య సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తాయి. ప్రస్తుతం 2000కు పైగా ఔషధాలు, 300కు పైగా శస్త్రచికిత్సలకు అవసరమైన వస్తువులు జన ఔషధి కేంద్రాల్లో లభిస్తున్నాయి. దేశంలో 10,000కు పైగా జన ఔషధి కేంద్రాలు పనిచేస్తున్నాయి.
మధ్యతరగతికి ఊరట
జన ఔషధి ఔషధాలు అధిక ఖర్చుతో కూడిన బ్రాండ్ ఔషధాలకు బదులుగా ప్రజలకు లభించడం వల్ల, వారిపై ఉన్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించగలిగాయి. గ్రామీణ, అర్బన్ పేద ప్రజలు సైతం తక్కువ ధరలకు నాణ్యమైన ఔషధాలను పొందే అవకాశం కలిగింది. ప్రజలకు ఔషధ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధికి మార్గం సుగమం చేసింది. ఔషధ నెలవారీ ఖర్చులు తగ్గుట వలన పేద మధ్యతరగతి వారికి కాస్త ఊరటగా ఉంటుంది. అయితే నేటికి చాలా మంది జన ఔషధి ఔషధాల గురించి తెలియక బ్రాండ్ ఔషధాలపైనే ఆధారపడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు మరింత ప్రచారం అవసరం. కొన్ని ప్రాంతాల్లో జన ఔషధి కేంద్రాలు తక్కువగా ఉండటం వల్ల అందుబాటులో సమస్య ఉంది. అందుకే ప్రభుత్వం మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కొంతమంది ప్రజలు జెనరిక్ ఔషధాలపై నమ్మకం లేకుండా ఉన్నారు. వారి అపోహలను తొలగించేందుకు మరింత పారదర్శక ప్రభుత్వ ప్రయత్నం అవసరం.
మరింత ప్రజాదారణ పొందేలా..
భారత ప్రభుత్వం 2025 చివరి నాటికి 25,000కి పైగా జన ఔషధి కేంద్రాల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మరిన్ని ఔషధ రకాలను జాబితాలో చేర్చి, వ్యాధులకనుగుణంగా వైద్య సేవలను విస్తరించనుంది. ఇటీవలి కాలంలో టెలీ మెడిసిన్, డిజిటల్ ఆరోగ్య సేవలు వంటి కొత్త సాంకేతికతలతో జన్ ఔషధి సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే దేశంలోని ప్రతి ఒక్కరూ ఈ గొప్ప పథకాన్ని ప్రోత్సహించాలి. ఆరోగ్య సేవలను సమానంగా అందించడంలో జన ఔషధి ఒక ముఖ్యమైన మైలురాయి. దీనిని మరింత ప్రజాదరణ పొందేలా చేయడం ద్వారా, ఆరోగ్య భద్రతను మెరుగుపరిచేలా చేయగలుగుతాం. ప్రజలు తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన ఔషధాలను పొందేందుకు మరింతగా ప్రయోజనం పొందేలా చేయడం మనందరి బాధ్యత. మండలానికి ఒక జన ఔషధి కేంద్రం వచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేయాలని కోరుకుందాం..."సరసమైన ధరలో ఉత్తమమైన ఔషధం – ఆరోగ్య భారత లక్ష్యం!"
కమల్ హాసన్ తుమ్మ
ప్రొఫెసర్
95056 18252






