నూతన ఒరవడికి నాంది!

by Bhoopathi Nagaiah |

ప్రస్తుత సమాజంలో బాదేసిన, సంతోషం వేసిన పార్టీలు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది.

నూతన ఒరవడికి నాంది!
X

సంవత్సరంలో చివరివారం వచ్చిందంటే చాలు.. నగరాలు, పట్టణాలలో హోటల్స్, రెస్టారెంట్లు, పబ్బులు వేడుకలకోసం సర్వం సిద్ధంచేసుకునే పనిలో నిమగ్నమైపోతుంటాయి. వ్యాపార సంస్థలు, సంఘాలు, సమూహాలు కొత్తసంవత్సర క్యాలెండర్ తయారీలో నిమగ్నమైపోతారు. మహిళలోకం నూతనముగ్గులకై పరిశోధనలు గావిస్తుంటారు. యువత అంతా కార్యక్రమాలపై వివిధరకాల ప్రణాళికలు రచించుకునే పనిలో మునిగి పోతుంటారు. ప్రస్తుత సమాజంలో బాదేసిన, సంతోషం వేసిన పార్టీలు చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. ఎప్పుడో ఒకసారి పండుగలకు, పబ్బాలకు జరుపుకునేటటువంటి వేడుకలు కాస్త నిత్యజీవితంలో భాగమై ఏదో ఒకసాకుతో ప్రతిరోజు జరుపుకునే స్థితిలోకి వెళ్ళుతున్నారు.

అందులో భాగంగానే వేడుకలను జరుపుకునే కేంద్రాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి భారీపెట్టుబడులు పెడుతూ వ్యాపారంచేయడం ఒకెత్తయితే, దేశంలో, రాష్ట్రంలో మద్యం అమ్మకాల లెక్కలు సైతం సగటు మనిషిని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తాయని చెప్పవచ్చు. మనదేశ సంస్కృతి, ఆచారాలకు విరుద్ధంగా పాశ్చాత్యీకరణ ఏమేర వ్యాప్తిచెందుతుందో అర్థంగాక మానదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిణామాల దృష్ట్యా భిన్నమైన వాతావరణం నెలకొంది. కావున ఇలాంటి వేడుకలకు ఎంతదూరంగా ఉంటే అంత శుభపరిణామమని చెప్పకతప్పదు.

ముప్పును కొనితెచ్చుకుంటే..

ఇలాంటి పాశ్చాత్య దేశాలనుండి సంక్రమించిన వేడుకల వలన కేవలం యువత సరదాలకోసం, విందు వినోదాలు నేపథ్యంలో మతిస్థిమితం లేకుండా తాగి తందనాలు ఆడటం, మత్తులో స్థిరత్వం కోల్పోయి ఏంచేస్తున్నారో తెలియకుండా, అచేతన స్థితిలోకి వెళ్లి తనప్రాణాలకే ముప్పును 'కొని'తెచ్చుకుని వారి తల్లిదండ్రులకు పుత్రశోకానికి గురిచేయడమనేది ప్రతిఏటా అక్కడక్కడ జగమెరిగిన విషయమే.ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయని తెలిసి కూడా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఎందరికో హాని కలిగిస్తూ, ఇతరులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనడంలో నిజంలేకపోలేదు.

క్షణికావేశం పనికిరాదు

ప్రతిసంవత్సరం ప్రభుత్వాలు సైతం వైన్ షాపులకు, బార్స్, రెస్టారెంట్స్, పబ్బులకు అర్ధరాత్రి 12 దాటాక సైతం షరతులతో కూడిన అనుమతులివ్వడం జరుగుతూ వస్తుంది. తాగిన మత్తులో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి క్షణికావేశంలో చేసే సంఘటనలు ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసిన సందర్భాలున్నాయి. కావున ఉడుకురక్తంతో ఊగిసలాడే యువత, క్షణంపాటు ఆలోచించి ఇలాంటి వేడుకలను ప్రతీకారాలకు వేదికగా మార్చకుండా జరుపుకుంటే మంచిది. సరదాగా స్నేహితులతో సంతోషంగా గడపాలని, ఇలాంటి వేడుకలలో ఆనందాన్ని పొందాలని ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ అనుకున్న పరిస్థితులు తారుమారవ్వడానికి కారణం కేవలం మద్యం, డ్రగ్స్ సేవించడమే. ఆ తర్వాత చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి జీవితాలు సరిపోవు. కావున యువత చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

వాహనదారులూ జాగ్రత్త

ప్రభుత్వం సైతం డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం సేవించి వాహనం నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ, వివిధరకాల ఆంక్షలు విధిస్తూ హెచ్చరికలు జారీచేస్తుంది.అందుకే యువత జాగ్రత్తగా వ్యవరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వీధులలో, జనసమూహాలలో పెద్దపెద్ద శబ్దాలనిచ్చే సౌండ్ బాక్స్ లనుపెట్టి డీజే పాటలతో డాన్సులుచేయడం, ఇరుగుపొరుగు వారికి ఆటంకం కలిగించడం అనేది శుభపరిణామం అనిపించుకోదు. సంతోషకరమైన వేడుకలు జరుపుకోవడంలో తప్పులేదు. కానీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ, ఎలాంటి చెడుపరిణామాలకు దారితీయకుండా కుటుంబసభ్యులతో ఆనందంగా, ఉల్లాసంగా,ఉత్సాహంగా జరుపుకుంటూ అందరు సంతోషించవచ్చు.

సరికొత్త లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

జీవితంలో మంచిపేరు, హోదా తెచ్చుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఎంతోకాలం వేచిచూడాలి. కానీ అదేపేరును క్షణికావేశంతో క్షణంలో పోగొట్టుకునే అవకాశాలుంటాయి. కావున జాగ్రత్త పాటిస్తూ గతసంవత్సరంలో విజయాలను, పరాజయాలను విశ్లేషించుకుని తగినవిధంగా మార్పులు,చేర్పులు చేసుకుంటూ నూతన సంవత్సరంలోకి నూతనంగా సరికొత్త లక్ష్యాలను ఏర్పరుచుకుని, వాటి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ, వాటి అమలుకు ప్రణాళికలు రూపొందించుకుని నూతనకార్యాలు ప్రారంభిస్తూ, శాశ్వితంగా గుర్తుండటానికి ఒక నిర్దేశితకాలంగా ఉపయోగించుకుంటూ విజయంవైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనాఉంది. సమాజంలో బాధ్యతయుతంగా నడుచుకోవడానికి సరికొత్త నిర్ణయాలు తీసుకోని పలువురికి ఆదర్శంగా నిలవాలి.

డా.పోలం సైదులు,

94419 30361

Next Story