వీణ పక్కన బ్యాట్.. స్త్రీ స్వరానికి కొత్త స్వరం

by Ravi |   (  Updated:2025-11-05 01:15:26  IST  )

ఈ దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు.. అది భావోద్రేకం, భక్తి, ఒక మతం. కానీ ఆ మతంలో ఇన్నాళ్లూ పూజారులు పురుషులే. బ్యాట్ ఎత్తే హక్కు మగవాళ్లకే

వీణ పక్కన బ్యాట్.. స్త్రీ స్వరానికి కొత్త స్వరం
X

ఈ దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు.. అది భావోద్రేకం, భక్తి, ఒక మతం. కానీ ఆ మతంలో ఇన్నాళ్లూ పూజారులు పురుషులే. బ్యాట్ ఎత్తే హక్కు మగవాళ్లకే, చప్పట్లు కొట్టే బాధ్యత ఆడవాళ్లకే అనే మౌన ఒప్పందం మన సమాజం రాసుకుంది. కాలం మారినా ఆ గీత మాత్రం అలాగే ఉంది. కానీ ఈ రోజు ఆ గీత దాటిన క్షణం. ఆ మైదానంలో మహిళల చేతుల్లో మెరుస్తున్న ప్రపంచకప్ కేవలం ట్రోఫీ కాదు. అది శతాబ్దాల నిశ్శబ్దానికి సమాధానం, సమానత్వానికి ఒక ధైర్య ప్రకటన.

మహిళల ప్రపంచకప్ విజయం అనేది కేవలం క్రీడా వేదిక మీద గెలుపు మాత్రమే కాదు. శతాబ్దాలుగా నిలిచిన సాంస్కృ తిక నిబంధనపై సూటిగా దూసుకు పోయిన ఒక ధైర్య ఘోష. అమ్మాయిలను ప్రకృతి చేసినట్టు ‘బలహీనులు’ అనే ముద్ర వేసి క్రీడలకు దూరం పెట్టాం. కానీ ఇవాళ మనమే గీసుకున్న గీత దాటి మన ఆడ బిడ్డలు ప్రపంచానికి ముఖ్యంగా మన దేశానికి ఒక పాఠం నేర్పారు. కానీ ఈరోజు ఆవిడలు, ఆ కూతుర్లు, ఆ అక్కలు తమ చేతులతో ప్రపంచకప్ ఎత్తి నప్పుడు, కళ్లలో తారల్లా వెలిగింది ఒక బాధ, ఒక ఆనందం.

ఆట అనవసరం అంటూ..

భారత దేశంలో క్రికెట్ కేవలం ఒక ఆట కాదు. ఇది ఒక సామాజిక నిర్మాణం. ఇది ప్రతి ఇంట్లో నదిలా ప్రవహించే భావోద్వేగం. చాలామందికి పుట్టినప్పుడే నిర్ణయించబడే ‘అబ్బాయిల స్వప్నం’. అలాంటి కప్ మన మహిళా జట్టు గెలిచినప్పుడు నాలో ఏదో తెలియని ప్రజాస్వామ్య వెలుగు సమానత్వ వెలుగు కళ్ల నిండా నిండుకుంది. ఒక బాలిక బ్యాట్ పట్టుకునప్పుడు దాన్ని కల కంటే అనవసర ధైర్యం అన్న వాళ్లు.. ఆమె పరుగులు తీస్తూ రన్స్ స్కోర్ చేసేప్పుడు కొంచెం కూడా గృహస్త లక్షణాలు లేవని మర్చిపోయిందని విమర్శించిన వాళ్లు.. ఆమెకి చెమట పట్టినప్పుడు ‘పాపం..అమ్మాయే కదా’ అని జాలి పేరుతో అడ్డుకున్న వాళ్లు మన మధ్య మన ఇళ్లలోనే ఉన్నారు.. నిజం కాదా? అమ్మాయిల కలలకు స్టేడియం వెలుగులు ఒక కల కదా! వంటగది దీపమే సరిపోతుందని ఎంతమంది తమ కూతుళ్లను ఆపి ఉంటారు?

ఆ ట్రోఫీ ఎత్తిన క్షణం..

సౌత్ ఆఫ్రికన్ క్రీడాకారిణి కొట్టిన బంతిని క్యాచ్ పట్టే ప్పుడు స్క్రీన్ మీద చూసాను ఒక చిన్నారి ఆనందంతో ఎగు రుతూ గెంతుతూ కనిపించింది. అది కేవలం ఒక విజయానందం కాదు. తన భవిష్యత్తు తలుపు తెరుచుకున్న శబ్దం ఆమెకి ఎవరో చెబుతున్నట్టు కనిపిస్తుంది. మైదానంలో ట్రోఫీ ఎత్తిన అమ్మాయిలని చూస్తే కంట్లో కన్నీరు, మనసులో గ‌ర్వం, వాళ్ల కళల్లో నుంచి గతం కన్నీరై కారి ఉంటుంది. ఉదయం 4 గంటలకు లేచి ప్రాక్టీస్ చేసిన అమ్మాయిలు.. ఒకే కిట్‌‌ని ఇద్దరు పంచుకున్న రోజులు...‘ఇవి మగవాళ్ల ఆటలు’ అని తల్లిదండ్రుల అన్న మాటలు.. బట్టల కన్నా బ్యాట్ ఖరీదు ఎక్కువగా అనిపించిన సమయాలు. ఆడవాళ్లు ఆడే ఆటకాదిదీ అని వెక్కిరించి క్షణాలు.. ఇవన్నీ వాళ్ల ముందు ఆ క్షణం కనిపించి ఉంటాయ్. అయినా వాటి అన్నింటిని దిగమింగుకొని గెలుపును జయించారు వాళ్లు..

అమ్మాయిల క్రీడల కోసం ఏం చేశాం?

అమెరికా ‘టైటిల్ IX’తో పిల్లలకి సమాన క్రీడా హక్కు ఇచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ సమాన వేతనం అమలు చేశాయి. ఇంగ్లండ్ పాఠశాలల్లో మహిళా క్రీడలు తప్పనిసరి చేసింది. కానీ మనం? ఇన్నాళ్లూ ప్రేరణ ఇచ్చాం.. చేయాలి గెలవాలి అన్నాం.. కానీ సమాన అవకాశం మాత్రం ఇవ్వలేదు. అంత ఎందుకు? సెమిస్‌లో మ్యాచ్ గెలిచి ఈ కప్పు గెలవడానికి కారణమైన ఓ క్రీడాకారిణిని తన దేవుడిని తలచుకున్నందుకు ట్రోల్ చేసి నానా బూతులు తిట్టాం.. ఇప్పుడు మనం గమనించాల్సిందీ.. ఈ విజయం మనకిచ్చిన ప్రశ్నలు ఏంటి అని? మన స్కూళ్లలో అమ్మాయిలకూ, అబ్బాయిలకు మైదానం ఉందా? ఉంటే సమానంగా ఉందా? మహిళా జట్లకు స్పాన్సర్‌లు ఇచ్చే లెక్కకట్టే విలువ ఎప్పుడు సమానమవుతుందని? గ్రామీణ బాలికల శ్రమకు తగిన వేదిక మనం ఎప్పుడు నిర్మిస్తాం? గెలిచినప్పుడు ఆ ఒక్కరికే భూమి, పైకం ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవటమేనా? ఇలాం టివన్నీ ఆలోచించాలి మనం..

సంగీత వాయిద్యాలే చిరునామానా?

ప్రపంచకప్ ట్రోఫీ వాళ్ల చేతులలో అద్భుతంగా మెరుస్తూ ఉండచ్చు. కానీ అది 4 దశాబ్దాల కల.. ఇన్నేళ్ల నిశ్శబ్ద పోరాటం. వాళ్లను నమ్మి పంపిన తల్లితండ్రుల విశ్వాసం. వాళ్ల చెమటతో రాసుకున్న గీతలు. సమాజపు చూపుల్ని తట్టుకున్న ధైర్యం. ఈ గెలుపుతో మన సంస్కృతికి కొత్త అర్థం వచ్చిందనీ గట్టిగా చెప్పగలను. సంగీత వాయిద్యాలే స్త్రీల చిరునామా అన్నచోట వీణ పక్కన బ్యాట్ కూడా ఇపుడు ఆడవాళ్లకి హక్కు అవుతుంది. అమ్మాయిల అడుగులు తక్కువ శబ్దం చేస్తున్నా కూడా అవి దేశాన్ని ముందుకు నడిపే శక్తి అవుతాయి. ఇక మీదట.. అమ్మాయి మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు దానిని ‘ధైర్యం’ అని ముద్రిం చకండి. అది కూడా ఆమె హక్కు.

గెలిచే అవకాశాలు కల్పించాలి!

క్రికెట్ కేవలం మగ వాళ్లకే అన్న భావనని పటాపంచలు చేసిన ఈ స్త్రీలు సమాన హక్కులకు ప్రతినిధులుగా క్రికెట్ బాషలోనే మాట్లాడి పితృస్వామ్య ముఖం మీద చాచికొట్టా‌రు. వాళ్లు గొంతెత్తి చెప్తున్నారు. ప్రపంచాన్ని గెల వకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు.. ఒకటి మాత్రం నిజం ‘అమ్మాయిల కలలను చిన్నగా చూడడం అంటే దేశ కలనే చిన్నచేయడమే’. దేశం ఈ రోజు క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. కానీ రేపు? ఈ దేశం ఈ క్రీడలోనైనా, ఇతర క్రీడల్లోనైనా అమ్మా యిలు గెలిచే కల కని దానిని సాకారం చేసుకునేందుకు మౌలిక అవసరాలు అన్నీ ఆడే అమ్మాయిలకు కల్పించాలి.

-మెర్సీ మార్గరెట్

90528 09952

Next Story