- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరావళి పర్వత శ్రేణులు.. మన అంతరాత్మకు పరీక్ష
సుమారు 250 కోట్ల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్న ఆరావళి పర్వతాలు.. నేడు మన నిర్లక్ష్యానికి బలై క్రమంగా కనుమరుగవుతున్నాయి.

భారతదేశ పర్యావరణ చరిత్రలో ఆరావళి పర్వత శ్రేణులు ఒక అపూర్వమైన సహజ వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. ఇవి కేవలం రాళ్ల గుట్టలు కాదు, ఉత్తర భారతదేశ వాతావరణ సమతుల్యతకు వెన్నెముకలు. గుజరాత్ నుంచి ఢిల్లీ సమీపం వరకూ సుమారు 650 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ పర్వతాలు, భూమి మీద అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటిగా భూగోళ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. సుమారు 250 కోట్ల సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఆరావళులు, నేడు మన నిర్లక్ష్యానికి బలై క్రమంగా కనుమరుగవుతున్నాయి.
అభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల పేరిట ఆరావళి పర్వతాలను పీక్కుతింటున్న దృశ్యం నేడు బహిరంగ రహస్యం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, మైనింగ్ మాఫియా ఆరావళులను లాభాల గనులుగా మార్చాయి. రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో అక్రమ రాయి గనులు విస్తృతంగా కొనసాగాయి. ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ చట్టాలను, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ను లెక్కచేయకుండా వేల ఎకరాల అటవీ భూమి, జీవ వైవిధ్యత ధ్వంసం చేశారు.
అభివృద్ధి పేరుతో విధ్వంసం
ఢిల్లీ–NCR విస్తరణతో గుర్గావ్ , ఫరీదాబాద్, నోయిడా వంటి ప్రాంతాల్లో ఆరావళి పర్వతాలపై రహదారులు, విలాసవంతమైన భవనాలు, ఫార్మ్ హౌస్‌లు పుట్టుకొచ్చాయి. ఆరావళులకు తీవ్రమైన ముప్పుగా మారింది. ఢిల్లీ జనాభా ఒత్తిడి పెరుగుతుండటంతో నగర విస్తరణ పర్వతాల వైపు సాగుతోంది. ఒకప్పుడు అడవులు, జంతువుల నివాసాలుగా ఉన్న ప్రాంతాలు నేడు కాంక్రీట్ అడవులుగా మారాయి. దీని ప్రభావంగా వర్షపు నీటి నిల్వ తగ్గింది, వరదలు–ఎండల తీవ్రత పెరిగింది. ఢిల్లీ వాయు కాలుష్య సమస్యకు ఒక ప్రధాన కారణం ఆరావళుల అటవీ నాశనమేనని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు జోక్యం.. ఆలస్యమైన జాగృతి
ఆరావళుల విధ్వంసాన్ని గమనించిన సుప్రీంకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుంది. ఆరావళి ప్రాంతాల్లో మైనింగ్ నిషేధం, పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు (1990&2009) ఇచ్చింది. తరువాత క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహుఏజెన్సీ కమిటీ (Multi-Agency Committee) ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఆరావళుల ప్రస్తుత స్థితిని అధ్యయనం చేసి కీలక సిఫార్సులు చేసింది. వాటిని సుప్రీం కోర్టు సమర్ధించి, ముఖ్యంగా ఆరావళి ప్రాంతాల్లో వంద మీటర్స్ ఎత్తు దాటిన పర్వతాలను ఆరావళి పర్వత శ్రేణులుగా గుర్తించాలని చెప్పింది. కొత్త మైనింగ్ లీజులు, రెన్యూవల్స్ ఇవ్వకూడదు అని, లీగల్ మైనింగ్ కూడా శాస్త్రీయ పద్ధతిలో చేయాలని, అక్రమ మైనింగ్ కఠినంగా కట్టడి చేయాలని సూచించింది. ఎక్కడ అడవి జీవులు అధికంగా ఉన్నాయో, నీరు ఎక్కడ భూగర్భంలో కలుస్తుందో అక్కడ మైనింగ్ చేయరాదని సూచించింది. సంరక్షిత పర్యావరణ జోన్‌గా ప్రకటించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. కానీ కాగితాల మీద సిఫార్సులు ఉన్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నెమ్మదిగా కొనసాగే అవకాశ మెండుగా ఉంది.
గ్రీన్ వాల్ ప్రాజెక్ట్.. ఆశాజనక అడుగు
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2023–24లో ‘ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్’ ను ప్రారంభించింది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో విస్తరించిన ఆరావళి శ్రేణుల వెంబడి భారీగా వన సృష్టి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సుమారు 26 మిలియన్ హెక్టార్ల ప్రాంతంలో పచ్చదనం పెంచడం ద్వారా ఎడారి విస్తరణను అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేవలం మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఇది కూడా కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.
ప్రభుత్వ ద్వంద్వ వైఖరి!
ఒకవైపు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలు ఆరావళి ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం విరుద్ధాభాసంగా కనిపిస్తోంది. అభివృద్ధి అవసరం నిజమే. కానీ అది ప్రకృతి విధ్వంసం మీద ఆధారపడితే, ఆ అభివృద్ధి దీర్ఘకాలికంగా నిలవదు. ప్రభుత్వాలు తక్షణ లాభాలకంటే దీర్ఘకాలిక పర్యావరణ భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. చట్టాలను కఠినంగా అమలు చేయాలి. అక్రమ మైనింగ్, ఆక్రమణలపై రాజకీయ రంగు లేకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రజల పాత్ర.. మౌనంగా ఉండకూడదు
ఆరావళుల సంరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. పౌర సమాజం, విద్యావేత్తలు, పర్యావరణ కార్యకర్తలు, మీడియా కీలక పాత్ర పోషించాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆరావళుల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించాలి. స్థానిక ప్రజలను సంరక్షణలో భాగస్వాములుగా మార్చినప్పుడే ఫలితాలు కనిపిస్తాయి. ఆరావళి పర్వతాలు లేకపోతే ఉత్తర భారతదేశం వాతావరణం తీవ్రంగా మారిపోతుంది. నేటి తరం ఒక నిర్ణయం తీసుకోవాలి. తాత్కాలిక లాభాల కోసం శాశ్వత నష్టాన్ని ఆహ్వానించాలా లేక భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ప్రకృతిని అందించాలా? ఆరావళి పర్వతాలు ఈ ప్రశ్నకు మౌనంగా ఎదురు చూస్తున్నాయి. వాటి మౌనం మన అంతరాత్మను కదిలించాలి.
కమలహాసన్ తుమ్మ
95056 18252






