- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతోన్మాదానికి ప్రత్యామ్నాయం అంబేడ్కర్ వాదమే!
భారతదేశంలో 140 కోట్ల మందిలో సుమారు 50 కోట్ల మంది యువకులే ఉండటం మనకు గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక

భారతదేశంలో 140 కోట్ల మందిలో సుమారు 50 కోట్ల మంది యువకులే ఉండటం మనకు గర్వకారణం. అయితే వీరికి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా రంగాల్లో అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల చేతిలో ఉంది. కానీ పాలక వర్గాలు యువత మీద దృష్టి పెట్టకుండా ఆశ్రితులైన వారికి ఎక్కువగా ఆర్థిక వెసులుబాటును కల్పిస్తూ యువత శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని, నవ్యతను దెబ్బ తీస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అనుకూల పెట్టుబడిదారి కార్పొరేట్ వర్గం ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొట్టడం వలన యువతకు, వారి ప్రతిభకు ఆర్థిక వెసులుబాటు కలిగించే లఘు పరిశ్రమలు రూపొందించలేకపోతున్నాయి.
నిజానికి ప్రభుత్వానికి చెల్లించే ప్రత్యక్ష, పరోక్ష పన్నులను తమకు అనుకూలంగా మార్చుకోవడం, తర్వాత ఎగ వేయటం, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఆర్థిక ప్యాకేజీల పేరు మీదుగా కొత్తగా మరికొంత సబ్సిడీలను, ట్యాక్స్ హాలిడేలను పొందటంలో కొర్పొరేట్లే అత్యధికం. ఇలా గత ఏడాదిలో వారు 5 లక్షల కోట్లు లాభం పొందినట్లు పత్రికలు రాశాయి. మనదేశంలో ప్రభుత్వ రంగంలో జరిగిన పెట్రోలు, గ్యాస్, మందులు, డిఫెన్స్, స్పెక్ట్రమ్ వంటి పరిశోధనల ఫలాలు సునాయాసంగా దక్కించుకొని మొత్తం లాభాలను ఒకరు ఇద్దరు మాత్రమే అనుభవించటం మనకు విదితమే. దేశాన్ని లూటీ చేసేవారికేమో ఎక్కువ సంపద వెళుతుంది. కానీ దేశంలోని యువత బి.ఏ.లు, బి.టెక్‌లు చదివినా, బ్యాంకులు వీరికి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా లోన్లు ఇవ్వటం లేదు.
కార్పొరేట్ కంపెనీల్లోనూ కులతత్వం!
నిజానికి ప్రభుత్వం ఎవరికీ, ఎందులోనూ లోన్లు ఇవ్వడం లేదు. బ్యాంకు అధికారులు ధనవంతుల ఇండ్ల వెంట తిరిగి, వారికి లోన్లు ఇచ్చి, వారు లోన్లు ఎలా ఎగర వేయాలో వారికి వీరు బోధించి, వారి దగ్గర నుంచి ఆ ధనంలో భాగస్వామ్యం పొందుతున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కార్పొరేట్ చేతుల్లో నలిగిపోతుంది. దానికి కారణం కార్పొరేట్లు కులతత్వాన్ని పాటిస్తున్నాయి. ఏ సంస్థ ఏ కులం నుంచి ఏ వర్ణం నుంచి ఆవిర్భవించిందో అంతర్గతంగా ఆ కులాల వారికే ఎక్కువ ప్రాధాన్యత వుంది. అందువల్ల దళితులకు, గిరిజనులకు ఎంత ప్రతిభ వున్న ఈ కార్పొరేట్ వ్యవస్థల్లో ఉద్యోగ వసతి దొరకడం లేదు. ఆ సంస్థల్లో వీరు ఒక్క శాతం ఉన్నారు. నిజానికి ప్రవేటు, కార్పొరేట్ నిర్మాణ వ్యవస్థలంతా కూడా రిజర్వేషన్లు పొందే కులాల వారిపై ద్వేషంతో ఉంటున్నాయి. వారు అగ్రకులాల వారికే ప్రతిభ పేరుతో ప్రాధాన్యం ఇస్తు న్నారు. కింది కులాల వారు ఎంత చదువుకున్నా వ్యాపార, వాణిజ్య, భవన నిర్మాణ, వస్తు నిర్మాణ రంగాల్లో చొరబాటు దొరకడం లేదు. మరో పక్క వ్యవసాయం యంత్ర పరికరాలతో నిండిపోతున్న తరుణంలో నాటు, కోత, కుప్పనూర్పిడు కూడా యంత్రాలతో చేస్తూ దళితుల వ్యవసాయ కూలీ వ్యవస్థను కుప్పకూలుస్తున్నారు. దళిత స్త్రీలకు ఇప్పుడు గ్రామాల్లో పని లేదు. వారు ఇంటర్మీడియట్, బి.ఏ., ఎం.ఏ.లు చదివినా దళిత యువత కూడా రొయ్యలు వొలవడానికి, క్వారీల్లో పనిచేయడానికి, భవన నిర్మాణాల రాళ్లు ఎత్తే పనికి, లేదా పేయింటింగ్ పనికి వెళుతున్నారు. దళితుల్లో విద్యాభ్యాసం చేసిన యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురి అవుతున్నాయి.
యువతకు ఏ మేలు లేదు!
ప్రభుత్వాలు ఎంతకూ దేశంలో వున్న స్థలాలను, మైదానాలను, పొలాలను అనేక కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి వేలాది ఉద్యోగాలు వస్తున్నాయనీ మెప్పించే ప్రకటనలు చేస్తున్న దేశ యువతకు ఏ మేలు లేదు. మేము ఇంజనీరింగ్ వ్యవస్థను ఎంతో అభివృద్ధి చేస్తు న్నాం అనేది పెద్ద బూటక విషయం. నిజానికి 1990-91 నుండి 1999-2000 కాలంలోని కంటే ముందు 1983 - 84 ప్రాంతంలోను వచ్చిన మార్పులను పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 4.57 పట్టణ ప్రాంతాల్లో 8.18 శాతం తగ్గింది. మొత్తంగా 5.57 శాతం మంది పేరట నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టాక పేదరికం నుంచి బయటపడ్డారు. అదే ఆర్థిక విధానాలు ప్రవేశ పెట్టక మునుపు 7 ఏళ్ల కాలంలో 8.88 శాతం గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో 2.89 శాతం మొత్తంగా దేశంలో 7.51 శాతం మంది పేదలు పేద రికం నుండి విముక్తులయ్యారు. అంటే ఏడాదికి కనీసం ఒక శాతం మంది పేదలు ఆపద నుండి బయటపడితే నూతన ఆర్థిక విధానాల తరువాత ఒక శాతం కంటే తక్కువ వుంది. ఈ కాల నిర్ణయంలోనూ పేదరిక నిర్ధా రణకు ఉపయోగించిన గణాంక వివరాల శాస్త్రీయతపై వివాదాలు కొనసాగినప్పటికీ, ప్రభుత్వాలు నూతన ఆర్థిక విధానాల ద్వారా దేశంలో అభివృద్ధిని, పేదరికాన్ని పారద్రోలుతామనే నినాదంలోని డొల్లతనం మనకు ఇప్పుడు అర్థం అవుతోంది.
మన హక్కుల కోసం పోరాడాలంటూ..
నిజానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలక వర్గాలు దేశీయ యువత మీద అందునా దళిత, గిరిజన యువత మీద ద్వేషపూరితంగా కులతత్వ పూరితంగా వ్యవహరిస్తున్నారనేది నిష్టూర సత్యం. నిజానికి ఈ పరిస్థితుల్లో కేంద్ర పాలక వర్గాలు దేశీయ యువత ప్రతిభను దెబ్బతీయటం అంటే దేశీయ సంపద సృష్టిని, దేశీయ ఎగుమతులను, దేశీయ ఆర్థిక అంతర్గత శక్తిని దెబ్బతీయడమే అని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే డా. బి.ఆర్.అంబేడ్కర్ 1929 డిసెంబర్ 28న దార్వాడ్‌లో చేసిన ఉపన్యాసాన్ని విందాం. ‘మనది మానవ హక్కుల కోసం సాగుతున్న పోరాటం. అందుకు సత్యాగ్రహం చేయాల్సి రావచ్చు. అదే ఆఖరు అస్త్రం. మన సొంత దేశీయులకు, విదేశీయులకు వ్యతిరేకంగా సత్యాగ్రహం. ఆ రెండు వర్గాల నుండి ఎదురయ్యే ప్రతిఘటనలను ఎదుర్కొనేందుకు మనం ఎన్నో వ్యూహాలు రచించుకోవాలి. అంటరానితనం కొనసాగుతూనే పోతే అది మొత్తం భారతీయ సమాజ పురోగమనాన్ని కుంటు పరుస్తుంది. కానీ మనం మన స్థాయిని మెరుగుపర్చుకోవాలి. మన హక్కుల కోసం పోరాడాలి. అగ్రవర్ణస్తుల్లో ఛాందసత్వం అలాగే ఉంటుంది. అది మనం పొమ్మంటే పోదు. చివరగా, మీరు స్వావలంబన మార్గాన్ని అనుసరించాలి. తమ సొంత బలం మీద వీలయినంత చదువుల సారాన్ని గ్రహించాలి. ఏ కొద్దిమంది మంచి మనుషులు తప్ప ఇంకెవరూ వారికి సహాయపడరు’ అని ఉపన్యసించారు. అంబేడ్కర్ ఆ రోజు చెప్పిన ఆలోచనను ఈనాటి ప్రభు త్వాలు ఆచరించకపోయినట్లైయితే భారతదేశంలో కుల, ఆర్థిక సంక్షోభంలో కుల వివక్షపూరితమైన, స్త్రీ అణచి వేతపూరితమైన దేశంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేడ్కర్ ఆలోచనలను రాజ్యాంగ బద్ధంగా అనుసరించి దేశ ప్రగతికి పట్టం కట్టవలసిన చారిత్రక సందర్భం ఇది. మనమందరం డా. బి.ఆర్.అంబేడ్కర్ మార్గంలో నడుద్దాం.
- డాక్టర్ కత్తి పద్మారావు
9849741695






