తల్లి జ్ఞాపకాన్ని అరణ్యంగా మలిచిన నటుడు.. షియాజీ శిండే

by Ravi |   (  Updated:2026-06-06 01:15:44  IST  )

నటుడు షియాజీ షిండే తన తల్లి జ్ఞాపకార్థం ప్రారంభించిన పచ్చని ఉద్యమం మహారాష్ట్రలో లక్షలాది చెట్లుగా విస్తరించింది. ‘సహ్యాద్రి దేవరాయి’ కార్యక్రమం ద్వారా ఆరున్నర లక్షలకుపైగా మొక్కలు నాటి ప్రకృతి సంరక్షణకు ఆదర్శంగా నిలిచిన ఆయన సేవల విశేషాలు తెలుసుకోండి.

తల్లి జ్ఞాపకాన్ని అరణ్యంగా మలిచిన నటుడు.. షియాజీ శిండే
X

ఒక తల్లి జ్ఞాపకం.. ఒక కుమారుడి సంకల్పం.. లక్షలాది చెట్ల రూపంలో పచ్చని విప్లవంగా మారితే ఎలా ఉంటుందో షియాజీ షిండే కథ చెబుతుంది. నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన, నేడు చెట్లను కాపాడే ఉద్యమ‌కారుడిగా మహారాష్ట్రలో విశేష సేవలు అందిస్తున్నారు. చెట్ల కోసం ప్రత్యేకంగా అనాథా‌శ్రమాలు ఏర్పాటు చేసి ప్రకృతి సంరక్షణకు కొత్త దారిని చూపుతున్నారు.

‘తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా’ ఈ డైలాగ్ వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే నటుడు షియాజీ షిండే. నటుడిగా మరాఠీ నాటకాల ద్వారా మొదట గుర్తింపు లభించింది. తర్వాత మరాఠీ సినిమాల్లో, పలు భాషా సినిమాల్లో విస్తృత ప్రజాదరణ పొందాడు. తెలుగులో ఈయన క్రూరమైన ప్రతినాయక పాత్రలు, గంభీరమైన క్యారెక్టర్ రోల్స్ ద్వారా ఖ్యాతి సంపాదించారు. ముఖ్యంగా ఠాగూర్, అతడు, పోకిరి, అరుంధతి, దుబాయ్ శీను లాంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈయన నటనాప్రతిభ, శక్తివంతమైన స్వరం, భావోద్వేగపూరిత ప్రదర్శన దక్షిణ భారత సినీరంగంలో అత్యంత గుర్తింపు పొందింది.

నిజ జీవితంలోనూ హీరో..

భారతీయ సినీరంగంలో చాలామంది నటీ నటులు సినిమాల్లో నటించి పేరు గడించి డబ్బు సంపాదించి అట్లా మిగిలిపోయారు. కానీ కొందరు అందుకు భిన్నం. వారు సమాజంలో ఒక ఆలోచనగా, ఒక చైతన్యంగా నిలిచి పోయారు. అలాంటి అరుదైన వ్యక్తిత్వాలలో షియాజీ షిండే ఒకరు. ఆయన నిజ జీవితంలో ప్రకృతిని కాపాడే పచ్చని యోధుడిగా నిలిచారు. ఆయన లాగే నిజ జీవితంలోనూ హీరోలుగా నిలబడేవారు కొందరే.. అలాంటి అరుదైన కళాకా రులలో సోనూ‌సూద్, నానా పటేకర్, షియాజీ షిండే ప్రముఖులు.. ఈయన ప్రకృతి సంరక్షణను తన జీవిత ధ్యేయంగా మలచుకున్నారు. వేలాది మొక్కలు నాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నారు. మనిషి ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనిషిని కాపాడుతుందని ఆయన కార్యాచ‌రణ చెబుతోంది. వెండితెరపై పాత్రలు సినిమా అయిపోగానే ముగిసిపోవచ్చు. కానీ సమాజం కోసం చేసిన మంచి పనులు ఎన్నటికీ చెరిగిపోవు.

రెండు లారీల నిండా మొక్కలు తెప్పించి..

1978లో ఆనకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం వారి భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆయనకు నీటిపారుదల శాఖలో వాచ్‌మన్ ఉద్యోగం ఇచ్చారు. కానీ ప్రత్యామ్నాయంగా ఇస్తామని చెప్పిన భూమి కుటుంబానికి అందడానికి ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది. ఇక 2016లో మహారాష్ట్ర తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. ‘గ్రామాల్లో ఒక్క చెట్టూ లేదు. గ్రామాలను కాపాడాలంటే ముందుగా చెట్లు నాటాలి’ అనుకున్నాడాయన. ఆ ఆలోచన నుండే ఒక అసాధారణ ఉద్యమం ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి రెండు లారీల నిండా మొక్కలను తెప్పించాడు. వాటి కోసం దాదాపు లక్ష రూపాయలు ఖర్చు చేశాడు. అదే సమయంలో భారతీయ సంస్కృతిలోని “దేవరాయి” అనే పవిత్ర అరణ్యాల భావన ఆయనకు గుర్తుకు వచ్చింది. తరతరాలుగా ప్రజలు పూజిస్తూ సంరక్షించిన ఆ అడవుల స్ఫూర్తితో “సహ్యాద్రి దేవరాయి” అనే ఉద్యమాన్ని ప్రారంభించాడు. తన తల్లి పేరుతో అడవులను పెంచడం మొదలుపెట్టాడు.

తల్లి బరువుకు సమానంగా విత్తనాలు నాటి..

ఈ ఉద్యమం వెనుక ఒక గాఢమైన వ్యక్తిగత బాధ దాగి ఉంది. 2016 నాటికి షియాజీ తల్లి వయసు 92 సంవత్సరాలు. ఆమెను కోల్పోతానన్న ఆలోచనే ఆయనను వెంటాడేది. “ఈ ప్రపంచంలో నాకు అత్యంత ప్రియమైనది మా అమ్మ. కానీ ఆమెను ఎప్పటికీ నా దగ్గర ఉంచుకోలేనని తెలిసి ఒకరోజు తల్లి పక్కన కూర్చుని తన అసహాయతను ఒప్పుకున్నాడు. మరణాన్ని ఆపలేడు. కాలాన్ని నిలిపివేయలేడు. కానీ ఆమె సాన్నిధ్యాన్ని మరో రూపంలో నిలబెట్ట వచ్చని భావించాడు. “నేను మా అమ్మతో చెప్పాను, నిన్ను శాశ్వతంగా బతికించగల శక్తి నాకులేదు. కానీ నీ బరువుతో సమానంగా విత్తనాలు తూచి వాటిని మహారాష్ట్ర అంతటా నాటుతాను. అవి ఒకరోజు చెట్లుగా పెరిగి పూలు పూస్తాయి, పండ్లు ఇస్తాయి, నీడనిస్తాయి. ఆ పరిమళంలో నేను నిన్ను చూసుకుంటాను. అలా నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు,” అని ఆయన చెప్పాడు.. ఆ ఆలోచనే ఆయన జీవిత లక్ష్యంగా మారింది.

కళాకారుడు ప్రజా ఉద్యమకారుడిగా మారి..

ఇవ్వాళ షియాజీ మహారాష్ట్రలో 48 ప్రాంతాల్లో చెట్ల పెంపకం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. కొన్ని చోట్ల వేలాది మొక్కలు, మరికొన్ని చోట్ల లక్షల సంఖ్యలో చెట్లు పెరుగుతున్నాయి. ఆ చిన్న మొక్కలు ఇప్పుడు పండ్లతో నిండిన సస్యశ్యామల అరణ్యాలుగా మారి పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరిస్తున్నాయి. అలా మా అమ్మ ఇప్పటికీ బతికే ఉంది’ అని ఆయన అంటాడు. ఒక గ్రామంలో వెయ్యి చింతచెట్లు నాటితే, పదిహేనేళ్ల తర్వాత అవే గ్రామస్తులకు దాదాపు కోటి రూపాయల ఆదాయం తెచ్చిపెడతాయి’ అని ఆయన భావించాడు. దేవాలయాల్లో ప్రసాదం బదులుగా మొక్కలు ఇవ్వాలన్న ఆలోచనను కూడా ఆయన ప్రతిపాదించాడు. ప్రసాదంగా ఇస్తే ప్రజలు వాటిని భక్తితో నాటుతారు, కాపాడుతారు”. ఆయన ఉద్యమంలో ప్రధానంగా ప్రోత్స హించే చెట్లు మర్రి, వేప, రావి, మామిడి, నేరేడు, చింత. ఈ చెట్లు పక్షులు, పురుగులు, నేల సారవంతం, భూగర్భ జలాల సంరక్షణకు ఎంతో మేలు చేస్తాయి. సినిమా ద్వారా ప్రజా దరణ పొందిన ఒక కళాకారుడు సమాజానికి ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ ఒక ప్రజా ఉద్యమకారుడిగా మారి ఆరున్నర లక్షల మొక్కలు నాటిన అరుదైన ఉదాహరణగా సయాజీ షిండే నిలిచారు. వెండితెరను దాటిన సామాజిక సేవా వెలుగు షియాజీ శిండేకు జయహో..

-వారాల ఆనంద్

94405 01281

Next Story