- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధ్యాయులు బోధించేదొకటి.. వారికి పరీక్ష మరొకటా?
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు టెట్ పరీక్షలు నిర్వహించడం స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, టెట్ సిలబస్‌లో ఉన్న లోపాలు, సంబంధం లేని సబ్జెక్టుల ప్రశ్నలు, అధిక అర్హత మార్కులు సవరించకపోతే 2028 నాటికి వేలాది మంది ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఏడాదికి రెండు టెట్ పరీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించదగ్గదే. అయితే, ఇది మాత్రమే సమస్యకు పూర్తి పరిష్కారం కాదు. ప్రస్తుతం అమల్లో ఉన్న అశాస్త్రీయ టెట్ సిలబస్, బోధించే సబ్జెక్టుతో సంబంధం లేని ప్రశ్నలు, అధిక అర్హత మార్కులు సీనియర్ ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.. 2028 సుప్రీంకోర్టు గడువును దృష్టిలో ఉంచుకుని వాటిని సవరిస్తేనే ఆ ఉపాధ్యాయు లకు నిజమైన భరోసా..
2028 ఆగస్టు 31లోగా టెట్ పాస్ కాని టీచర్లకు నిర్బంధ ఉద్యోగ విరమణ గండం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ, దశాబ్దాల క్రితం అశాస్త్రీయంగా నిర్ణయించిన సిలబస్ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సంబంధం లేని సబ్జెక్టులో పరీక్షలా!
ప్రస్తుత టెట్ సిలబస్‌లో తీవ్ర లోపాలు ఉన్నాయి. ఆ లోపాలే ఇన్-సర్వీస్ టీచర్ల పాలిట శాపాలుగా మారాయి. వారి భవిష్యత్తుకు, ఉద్యోగ భద్రతకు పెద్ద అడ్డుగోడగా నిలిచాయి. ఉన్నత పాఠశాలల్లోని హిందీ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే 150 మార్కుల టెట్ పరీక్షలో వారు నిత్యం బోధించే హిందీ సబ్జెక్టుపై కేవలం 30 మార్కుల సిలబస్, వారికి ఏ మాత్రం సంబంధం లేని, ఒక్క రోజూ బోధించని సోషల్ స్టడీస్‌కి ఏకంగా 60 మార్కుల సిలబస్ పెట్టారు. వాస్తవానికి హిందీ టెన్త్ వరకు మాత్రమే చదువుతారు. ఆ తర్వాత ఎక్కడా వారికి సోషల్ సబ్జెక్టు ఉండదు. అలాంటి వారికి సోషల్ ప్రధాన సబ్జెక్టుగా టెట్ సిలబస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇదే విచిత్రమైన పరిస్థితి తెలుగు, ఉర్దూ స్కూల్ అసిస్టెంట్లకు సైతం ఎదురవుతోంది. సొంత సబ్జెక్టుకు 30 మార్కుల సిలబస్, సంబంధం లేని సోషల్ స్టడీస్‌కు 60 మార్కుల సిలబస్ ఉంటే వారు టెట్ ఎలా క్వాలిఫై అవుతారు? ఈ ప్రాథమిక సత్యాన్ని ఉన్నతాధికారులు ఉద్దేశ్య పూర్వకంగా విస్మరిస్తున్నారు. అలాగే, బయోలాజికల్ సైన్స్ బోధించే టీచర్లకు మ్యాథ్స్ సిలబస్ పెట్టడంలో ఔచిత్యం ఉందా? ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపొందించిన ఈ అశాస్త్రీయ సిలబస్‌ను ఇప్పటికీ కొనసాగించడంలో అర్థం లేదు. ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టును బోధిస్తున్నాడో, ఆ సబ్జెక్టు ప్రాతిపదికగానే అతనికి టెట్ పరీక్ష ఉండాలి. అలా కాకుండా సంబంధం లేని సబ్జెక్టులను రుద్ది, వారి ఉద్యోగ భవిష్యత్తును పణంగా పెట్టడం ముమ్మాటికీ అన్యాయమే.
క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించాలి!
ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల వయస్సు, దశాబ్దాలుగా వారు అందిస్తున్న సుదీర్ఘ సేవలను పరిగణనలోకి తీసుకుని, టెట్ క్వాలిఫైయింగ్ మార్కులను తగ్గించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. మొత్తం 150 మార్కులకు గానూ జనరల్ కేటగిరీ టీచర్లకు 60 శాతం (90 మార్కులు) వస్తేనే టెట్ క్వాలిఫై అయినట్లు పరిగణిస్తారు. బీసీ కేటగిరీకి 50 శాతం (75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 40 శాతం (60 మార్కులు) రావాలి. సుదీర్ఘ కాలంగా పుస్తకాల కు, పరీక్షలకు దూరంగా ఉండి కేవలం తన సబ్జెక్టు బోధనకే పరిమితమైన జనరల్, బీసీ కేటగిరీల ఉపాధ్యాయులకు తమ సబ్జెక్టుతో సంబంధం లేకుండా పెట్టిన సిలబస్‌తో టెట్ ఉత్తీ ర్ణత సాధించడం పెద్ద అడ్డంకిగా మారింది. ఈ విషయాన్ని సానుభూతితో, మానవీయ కోణంలో ఆలోచించి జనరల్ కేటగిరీ టీచర్లకు క్వాలిఫైయింగ్ మార్కులను 50 శాతానికి, బీసీ కేటగిరీ వారికి 45 శాతానికి తగ్గించాలి. ఇప్పటికే బిహార్ వంటి రాష్ట్రాలు ఇన్-సర్వీస్ టీచర్ల ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని క్వాలిఫైయింగ్ మార్కులను సడలించాయి. అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూల నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయుల ఉద్యోగాలకు భరోసా కల్పించాలి.
సీఎం సత్వరం స్పందించాలి!
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచీ సానుకూల వైఖరితో ఉంటూ వాటిని ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తున్నారు. క్రమం తప్పకుండా బదిలీలు, పదోన్నతులు కల్పిస్తున్నారు. రికార్డు సమయంలో డీఎస్సీ నిర్వహించి పోస్టింగులు ఇచ్చారు. అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేలా చేస్తున్నారు. ఇదే చొరవ టెట్ విషయంలోనూ చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే టెట్ సిలబస్‌లో ఉన్న లోపాలను, అర్హత మార్కుల తగ్గింపు ఆవశ్య కతను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాయి. కేవలం పరీక్షల సంఖ్యను పెంచినంత మాత్రాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. టీచర్ బోధించే సబ్జెక్టుకు అనుగుణంగా సిలబస్‌లో ఆచరణాత్మకమైన, హేతుబద్ధమైన మార్పులు చేసి, క్వాలిఫైయింగ్ మార్కులు తగ్గించినప్పుడే ప్రభుత్వ నిర్ణయానికి సార్థకత చేకూరుతుంది. అలా కానీ పక్షంలో, 2028 నాటికి టెట్ పాస్ కాని వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో చూసి తగిన జీవో జారీ చేయాలని ఉపాధ్యాయలోకం విజ్ఞప్తి చేస్తోంది.
-మానేటి ప్రతాపరెడ్డి,
రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, TRTF
98484 81028






