- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Budget: సంక్షేమం - అభివృద్ధి సమతౌల్యం!
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో సంక్షేమ ఆధారిత వృద్ధి, మహిళా, విద్యార్థి, రైతు సంక్షేమం, గ్రామీణ-పట్టణ అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల కేటాయింపులపై సమగ్ర విశ్లేషణ.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ఒక సాధారణ లెక్కల పత్రంగా మాత్రమే చూడటం సరిపోదు.. ఇది రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్దేశించే దార్శనిక పత్రంగా కనిపిస్తోంది.
₹3.24 లక్షల కోట్ల భారీ పరిమాణంతో రూపొందిన ఈ బడ్జెట్, గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సూచిస్తూ, సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజల జీవితాల్లో తక్షణ ఉపశమనం కల్పించడమే కాకుండా, భవిష్యత్ ఆర్థిక స్థిరత్వానికి పునాది వేయాలనే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
సంక్షేమ ఆధారిత వృద్ధి.. కొత్త ఆర్థిక తత్వం
ఈ బడ్జెట్‌లో ప్రధానంగా కనిపించే అంశం ‘సంక్షేమ ఆధారిత వృద్ధి’. అంటే, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించాలనే దృక్పథం. మహిళలు, రైతులు, విద్యార్థులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు వంటి విభిన్న వర్గాలకు లక్ష్యంగా పథకాలను రూపొందించడం ద్వారా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం ద్వారా ఆదాయం పెరగ డమే కాకుండా, ఆ ఆదాయం సమాజంలోని అన్ని వర్గాలకు చేరేలా చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది.
మహిళల సంక్షేమం.. సామాజిక మార్పుకు పునాది!
మహిళల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ఉచిత బస్సు ప్రయాణం, తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు మహిళల రోజువారీ జీవనాన్ని సులభతరం చేస్తున్నాయి. ఈ పథకాలు కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, మహిళల స్వతంత్రత ను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉచిత రవాణా వల్ల మహిళలు ఉద్యోగాలు, విద్య, ఆరోగ్య సేవలకు సులభంగా చేరుకునే అవకాశం పెరిగింది. అయితే, ఈ పథకాల వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం కూడా గణ నీయమైనదే. దీర్ఘకాలంలో ఇవి ఆర్థిక క్రమశిక్షణపై ప్రభావం చూపే అవకాశముంది.
విద్యారంగం.. మానవ వనరుల నిర్మాణం
విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు ఈ బడ్జెట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాల విస్తరణ ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, చదువుపై దృష్టి పెట్టారు.. పోషకాహారం అందించడం వల్ల విద్యార్థుల హాజరు పెరగడమే కాకుండా, వారి నేర్చుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది భవిష్యత్‌లో నాణ్యమైన మానవ వనరులను తయారు చేయడంలో కీలకంగా మారుతుంది. అయితే, ఈ పథకాల అమలులో పారదర్శకత నాణ్యత నియంత్రణ అవసరం.
గ్రామీణ అభివృద్ధికి దృఢమైన మద్దతు!
వ్యవసాయ రంగానికి కేటాయించిన ₹23,179 కోట్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించవచ్చు.. సౌర పంపులు, సూక్ష్మ నీటి పారుదల, పామాయిల్ సాగు వంటి కార్యక్రమాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడవచ్చు..గిరిజన రైతులకు 100% సబ్సిడీతో సోలార్ పంపులు అందించడం, పోడు భూముల్లో సాగును ప్రోత్సహించడం వంటి చర్యలు సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధి మధ్య సమతౌల్యాన్ని చూపిస్తున్నాయి.
పట్టణాభివృద్ధి.. సామాజిక సంక్షేమం!
పట్టణాభివృద్ధి ఈ బడ్జెట్‌లో కీలక అంశంగా నిలిచింది. హైదరాబాద్‌ను గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దడం, ఇతర నగరాలకు కూడా అదే అభివృద్ధి మోడల్‌ను విస్తరించడం ప్రభుత్వ లక్ష్యం. మెట్రో విస్తరణ, మూసీ నది పునరుద్ధరణ, రహదారి అభివృద్ధి వంటి ప్రాజెక్టులు నగర జీవన ప్రమాణా లను మెరుగుపరచవచ్చు. ఇక సామాజిక సంక్షేమ కార్య క్రమాలకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రేషన్ కార్డుల జారీ, ఆరోగ్య సేవల విస్తరణ, గృహ నిర్మాణ పథకాలు వంటి చర్యలు పేదల జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో కీలకంగా మారవచ్చు. నగదు రహిత ఆరోగ్య సేవలు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ద్వారా ఆరోగ్య సేవల ప్రాప్యతను పెంచే ప్రయత్నం కనిపిస్తోంది.
దీర్ఘకాలిక దృష్టితో..
‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ ఈ బడ్జెట్‌కు ఒక దీర్ఘకాలిక దిశను ఇస్తోంది. 2036 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాలను సాధించాలంటే సంక్షేమంతో పాటు ఉత్పాదక రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. పరిశ్రమలు, ఎగుమతులు, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు పెరగడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయి. మొత్తంగా చూస్తే, తెలంగాణ బడ్జెట్ 2026–27 ఒక సమతౌల్య ప్రయత్నంగా నిలుస్తోం ది. ఇది ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించే సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా, భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టింది.
- శ్రీధర్ వాడవల్లి
99898 55445






