తెలుగుదేశం.. సామాజిక విప్లవం!

by Ravi |   (  Updated:2025-03-29 01:15:58  IST  )

కాలంతో పరిగెత్తుతూ.. కాలం విసిరే సవా ళ్లను ఎదుర్కొంటూ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి

తెలుగుదేశం.. సామాజిక విప్లవం!
X

కాలంతో పరిగెత్తుతూ.. కాలం విసిరే సవా ళ్లను ఎదుర్కొంటూ 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి తెలుగు దేశం పార్టీ అడుగుపెట్టింది. 23 ఏళ్ల పాటు అధికా రంలో ఉంది. 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ప్రతిపక్షంలో ఉన్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే అనేక పోరాటాలు చేసింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తెలుగు నాట ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగా ల్లో అనేకమైన మార్పులు తీసుకువచ్చారు. రాజకీయ అసమానతలను తుడిచిపెడుతూ బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం దక్కేలా చేశారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే ఆశయాలపై పురుడు పోసుకున్న పార్టీ 1982లో జరిగిన ఎన్నికల్లో విద్యావంతులు, యువత, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి 80 శాతానికి పైగా స్థానాలు కేటాయించింది. 294 స్థానాలకు గాను 202 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. 1984లో ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర పార్టీలను కూడగట్టారు. నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను చేయడంలో కీలకపాత్ర పోషించారు. 1994 అసెంబ్లీ ఎన్ని కల్లో ఎన్నడూ లేని విధంగా 226 స్థానాలు దక్కించుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కేవలం 26 సీట్లే దక్కించుకున్న కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

సంక్షేమ రాజ్యానికి ఎన్టీఆరే ఆద్యులు..

దేశంలో సంక్షేమ రాజ్యానికి ఎన్టీఆరే ఆద్యులు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని నినదించి పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే తన రాజకీయ సిద్ధాంతమని ఎలుగెత్తి చాటడమేగాక ఆచరణలో చూపించారు. తెలుగు భాష, సంస్కృతులకు పూర్వవైభవాన్ని తెచ్చారు. మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పి మహిళలకు సమున్నత గౌరవం ఇచ్చారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారు. రైతులకు నీటితీరువా రద్దు చేశారు. మాండలిక వ్యవస్థ తీసుకువచ్చారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం తనదైన ముద్ర వేసింది. పార్ల మెంట్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఒక ప్రాంతీయ పార్టీ వ్యవహరించడం అరుదైన చారిత్రక సంఘటన.

సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుంటూ..

కొంగొత్త రాజకీయ ఆవిష్కరణలకు, నూతన సంస్కరణలకు తెలుగుదేశం ప్రయోగశాలగా మారింది. తెలంగాణలో ఉన్న మంత్రులు, ప్రస్తుత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పార్టీలోనివారే. ప్రజల పక్షాన అనేక ఉద్యమాలను నిర్మిస్తూ పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ తన ఉనికిని కాపాడుకుంటూనే ఉంది. సంక్షోభాలనే అవకాశాలుగా మలుచుకుంటూ ఓటమితో నిరాశ చెందక నిరంతరం తన ప్రయా ణాన్ని సాగిస్తోంది. వేలాది మంది కార్యకర్తలపై లక్షలాది కేసులు పెట్టినా.. కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినా.. ఎక్కడా వెన్నుచూపకుండా తమ పోరాట స్ఫూర్తిని కొనసాగించారు. అలాంటి కార్యకర్తలు కోటికి పైగా తెలుగుదేశం పార్టీకి సొంతం.

ప్రజలే ముందు, ప్రజలే ముఖ్యం

1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి తెలుగుదేశం మరింత బలోపేతమై దిగ్విజయంగా సాగుతూనే ఉంది. ప్రజలే ముందు, ప్రజలే ముఖ్యమనే రీతిలో పాలనలో మానవీయ కోణాన్ని స్పృశించిన ఆదర్శ నేత చంద్రబాబు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు తనదైన శైలిలో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, శ్రమదానం లాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పారిశ్రామికాభివృద్ధికి ఉపాధి అవకాశాలను విస్తారంగా కలిగించారు. విజన్ 2020 డాక్యుమెంటు‌ను రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.

బడుగు బలహీన వర్గాలకు అండగా..

2014లో విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టింది. బడుగుల బతుకుల్లో భాగ్యోదయం కల్పించేందుకు 100కి పైగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచింది. సాగునీటి రంగానికి రూ.67 వేల కోట్లు ఖర్చు చేసి 23 ప్రాజెక్టులు పూర్తి చేసింది. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయింది. రెండంకెల వృద్ధి సాధించడం జరిగింది. ప్రపంచ స్థాయి నగర నిర్మాణం అమరావతికి శ్రీకారం చుట్టింది. పట్టిసీమతో కృష్ణా- గోదావరిని అనుసంధానం చేసింది. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలను తీసుకొచ్చింది. పెన్షన్ రూ.2 వేలకు పెంపు, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా లాంటి పథకాలతో బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది.

అధికారమున్నా లేకున్నా..

తెలుగునాట జరుగుతున్న సకల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక ఉద్యమాలతో తెలుగుదేశం మమేకమైంది. తెలుగుదేశం ప్రతిసారి అధికారంలోకి రాలేకపోయినా ఆ పార్టీ ముద్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో వికసిస్తూనే ఉంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌లో, గతంలో ఉమ్మడి ఏపీలోనూ బలమైన శక్తిగా ఎదిగింది. విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునర్ నిర్మించి, అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ఉత్సవంలో మరో శతాబ్దం రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శకంగా నిలవాలి. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో, ఎన్నెన్నో ఆటుపోట్లు, మరెన్నో సంక్షోభాలు, కుట్రలు, కుతంత్రాలు తట్టుకుని సమున్నతంగా నిలబడింది. పార్టీ ఉనికి లేకుండా చేయడానికి చేయని కుట్ర లేదు. సంక్షోభం ఎదురై నప్పుడల్లా కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు చేరువయ్యారే తప్ప ఎక్కడా అదరలేదు, బెదరలేదు. తొలి నుంచీ ఎన్టీఆర్, చంద్రబాబుల నాయకత్వంలో తెలుగు జాతి ప్రగతి స్వామ్యంలో భాగమైంది. 2047 నాటికి భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతున్న తరుణంలో దేశం సాధించాల్సిన లక్ష్యాన్ని కేంద్రానికి చంద్రబాబు సూచించారు. అదే సమయంలో రాష్ట్రంలో లక్ష్యాలను కూడా నిర్దేశించారు. ఆయన మంత్రించిన విజన్ 2020 చూసిన మనం .. విజన్ 2047 కూడా సాకారం కావాలని కోరడం సముచితంగా ఉంటుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.

(నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..)

మన్నవ సుబ్బారావు

99497 77727

Next Story