- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభినయానికి పెట్టని కోట
ఈ పేరు వినగానే ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్‌లో 24 క్యారెట్ల

ఈ పేరు వినగానే ఆయన పండించే వినోదంలో పెద్దరికం ఉంటుంది. విలనిజంలో రాజసం ఉంటుంది. క్యారెక్టర్‌లో 24 క్యారెట్ల మేలిమి పనితనం ఉంటుంది. ఫన్నీరు.. కన్నీరు రెండూ పండించగలిగే అరుదైన నటుడు కోట శ్రీనివాసరావు. ఈయన తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు. దాదాపు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం.
నాటక రంగం నుండి వెండితెరకు
1942, జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు, వైద్య కుటుంబంలో పుట్టిన ప్పటికీ నటన పట్ల ఉండే ఆసక్తి ఆయనను రంగస్థలం వైపు లాగింది. బీఎస్‌సీ చదివిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఆయన గుండె నాటకాలకే అంకితం. రంగస్థల అనుభవం ఆయనకు డైలాగ్ డెలివరీలో అసమానమైన నైపుణ్యం. నిజమే అన్నంతగా భయపరిచే విలక్షణ విలనిజం ఆయన సొంతం. 1978లో చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు, అంతరంగం కనిపించే నటన అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. విలన్ పాత్రలకు కొత్తగా అర్థం చెప్పిన నటుడు కోట. విలన్ పాత్రల్లోకి ప్రవేశించిన తర్వాత, ప్రతి నాయకత్వానికి పాత సినిమాల్లో ఉన్న రొటీన్ ధోరణిని చెరిపేశారు. గాయం, శివ, శత్రువు, లీడర్, రక్తచరిత్ర వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు, భయపెట్టే విలన్‌గా కాదు, మాట్లాడే ప్రతి నాయకుడిగా మిగిలిపోయారు.
హాస్యానికి కొత్త నిర్వచనమిచ్చి..
జంధ్యాల గారి 'అహ నా పెళ్లంట'లో లక్ష్మీపతి పాత్ర అతన్ని అజరామరుడిని చేసింది. పిసినారి క్యారెక్టర్‌గా చేసిన అభినయానికి ఇప్పటికీ హాస్యప్రియులు సెల్యూట్ చేస్తారు.. కోట, బాబు మోహన్ కాంబినేషన్ ఉండే సినిమాలకు ‘మినిమం హిట్’ గ్యారంటీగా ఉండేది. బ్రహ్మానందంతో కలిసి చేసిన సన్నివేశాలు కోట గారి హావ భావాలు బలంగా నమ్మించేవి. కేవలం విలన్‌గా, హాస్యనటుడిగానే కాకుండా, సహాయ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పిం చారు. తండ్రి, బాబాయ్, పెద్దమనిషి, రాజకీయ నాయ కుడు, పిసినిగొట్టు, ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయారు..
పురస్కారాలు, ప్రశంసలు..
నంది నుండి పద్మశ్రీ వరకూ తన విశిష్ట నటనకు గుర్తింపుగా 9 రాష్ట్ర నంది అవార్డులు పొందారు. 1985లో ప్రతిఘటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు 1993లో గాయంకు ఉత్తమ ప్రతినాయకుడు, 2004లో 'ఆ నలుగురు' సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు, 2012లో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రానికి SIIMA అవార్డు, 2015లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం 2013లో అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం. ఇవీ ఆయన నటజీవితంలో వరించిన కొన్ని పురస్కారాలు..
అనుకరించలేని డైలాగ్ డెలివరీ
ఆర్టిస్టుకు టైమ్ వస్తే.. టైమ్ ఉండదు అని చెప్పిన కోట శ్రీనివాసరావు, పాత్రకు ప్రాణం పోసే డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, యాసల్లో నైపుణ్యం కోసం ప్రేక్షకుల అభిమానం పొందారు. తెలంగాణ, రాయలసీమ, శ్రీకాకుళం, గోదావరి యాసలను అద్భుతంగా పలకగలిగేవారు.. తెలుగు సినిమా విలనిజానికి అర్థం చెప్పిన నటుడు. హాస్యానికి ఉత్సాహం ఇచ్చిన నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకున్న నటుడు. ఆయన ఈ లోకాన్ని వీడినా, ఆయన మాటలు, నటన, పాత్రలు మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కోటా శ్రీనివాస రావు నటుడిగానే కాదు, ఒక నాటకీయ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం.
(విలక్షణ నటుడికి అక్షర నివాళి)
-వాడవల్లి శ్రీధర్,
99898 55445






