- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ విమోచనమే.. నా విముక్తి
సెప్టెంబర్ 17ను తలచుకోవడం అంటే నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందిన చరిత్రను యాది చేసుకోవడం. పాత తరాల పోరాట

సెప్టెంబర్ 17ను తలచుకోవడం అంటే నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందిన చరిత్రను యాది చేసుకోవడం. పాత తరాల పోరాట వారసత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే ఉద్వేగ సందర్బం. నిరంకుశ ప్రభువుకు, ప్రజలకు మధ్య జరిగిన పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాడిగా ఇప్పటికీ నా 94 ఏళ్ల వయసులోనూ నాటి రణనినాదం నా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది, చెవుల్లో మారుమోగుతూనే ఉంది. నాటి హైదరాబాద్ రాష్ట్ర విముక్తి కోసం పోరాటం చేసినందుకు 16 ఏళ్ల వయసులోనే నన్ను మూడు పర్యాయాలు బందిఖానాలో పెట్టారు. తెలంగాణ విమోచనంతోటే నాకూ జైలు గోడల మధ్య నుంచి ఉద్యమకారుడిగా విముక్తి లభించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడైన మా తండ్రిగారు వెలిచాల కేశవరావు గారి చిటికెన వేలు పట్టుకుని తిరిగినందుకు వారి పోరాట వారసత్వం కూడా నా రక్తంలో అణువణువు ఇంకిపోయింది.
కరీంనగర్ జిల్లా రామడుగు దగ్గర గుండి అనే ఊరు నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ విముక్తి ఉద్యమ సాలు పోశాను. కరీంనగర్ హైస్కూలులో గౌతమరావు, సి.నారాయణరెడ్డి, సి. ఆనందరావు, సిహెచ్. హన్మంతరావు తదితరులతో సాహచర్యం ఏర్పడింది. నేను, సినారె ఇరువురం ఒకే తరగతి, ఒకే బెంచ్. సోషలిస్ట్ నాయకుడు గౌతం రావు, పీవీ నరసింహారావు నాకు సీనియర్లు. గౌతం రావుకు లోహియా సోషలిస్ట్ భావాలు ఉంటుండె. ఆయన వల్ల నేనూ కాంగ్రెస్‌లో సోషలిస్ట్ గ్రూపులో తిరుగుతుండె. అప్పుడు అల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది. అందులో కమ్యూనిస్ట్, సోషలిస్ట్ భావాలున్న వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండేటోళ్లు. నాకు ఆ సంస్థతో సంబంధాలు ఏర్పడినయి.
వందేమాతరం పాడితే బహిష్కరించారు
ఆ కాలంలో అన్ని స్కూళ్లలో ఒక ప్రార్థన గేయం చదవడం పరిపాటిగా ఉండేది. దాని పేరు 'తాబద్ ఖాలఖ్ ఆలమ్' అంటే 'మన రాజు' ఎల్లకాలం కుశలంగా ఉండుగాక! అంటూ రాజు గుణగణాలను పొగిడేలా ఉండేది. ఎన్నో దేశభక్తి పుస్తకాలు, వివేకానందుని బోధనలు చదివిన నాకు ఆ ప్రార్థనా గీతానికి బదులు 'వందేమాతరం' చదవాలని అనిపించేది. ఒకరోజు అందరూ రాజును కీర్తిస్తూ ప్రార్థనా గీతం పాడుతుంటే నేను మాత్రం వందేమాతరం అని ఎలుగెత్తి పాడిన. అందరూ ఆశ్చర్యంగా నా వైపే చూశారు. మా నాన్న కేశవరావు జాతీయోద్యమం, సహకార ఉద్యమాల్లో చురుకుగా ఉండె. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్ కి కార్యదర్శిగానూ పనిచేశారు. మంచి రచయిత. మాతోని దినపత్రికలు, మహనీయుల పుస్తకాలు చదివించి స్ఫూర్తి నింపారు. అందుకే కాబోలు నేను అంత ధైర్యంగా వందేమాతరం అనగలిగాను. క్షమాపణ చెప్పను అంటే నన్ను బడి నుంచి బహిష్కరించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్లు నాకు హైదరాబాద్‌లో చదువుకునే ఏర్పాటు చేశారు.
పదహారేళ్ల వయసులో జైలు శిక్ష
సుల్తాన్ బజార్‌లో ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్‌లో ఆఫీస్ సెక్రటరీగా నియమించారు. అక్కడికి డా. మర్రి చెన్నారెడ్డి, హెగ్దే, డా. జి.ఎస్. మెల్కోటే లాంటివారు వచ్చేవారు. వారి వలన నాకు రాజకీయ చైతన్యం మరింత పెరిగింది. అక్కడ పని చేసుకుంటూనే కేశవ మెమోరియల్ స్కూల్‌లో చదువుకున్న. అక్కడి దేశభక్తి వాతావరణం నన్ను మరింత ప్రభావితం చేసింది. వివేకవర్ధినిలో ఇంటర్ చదువుతున్నప్పుడే రెడ్డి హాస్టల్ ఉన్న రామచంద్రారెడ్డి, బాగారెడ్డి, రామిరెడ్డిలతో పరిచయం కలిగింది. వివేకవర్ధిని విద్యాలయం విద్యార్థి సంఘానికి లీడర్‌గా ఎన్నికైన. హైదరాబాద్‌లోని పుత్లీబౌలీలో 1947 ఆగస్టు 7న డాక్టర్ మెల్కొటే ఆధ్వర్యంలో సత్యాగ్రహం దీక్ష జరిగింది. ఆ దీక్షలో నేనూ పాల్గొన్నాను. నిజాంను ధిక్కరిస్తూ స్వాతంత్య్రం కావాలని దీక్షచేసినందుకు పోలీసులు వారితో పాటు నన్నూ అరెస్ట్ చేశారు. నాకు అప్పుడు పదహారేళ్లు. నన్నుచూసి జడ్జి ఆశ్చర్యపోయారు. 'క్యా కర్తే హై' (ఏమి చేస్తావు) అని అడిగాడు. నేను దానికి 'యహీ కర్తాహు' (ఇదే చేస్తాను) అని బదులిచ్చాను. దానికి ఆయన చకితుడై 'బచ్చే హో... మాఫీనామా దేవ్ ... చోడ్‌దేంగే' (చిన్నపిల్లాడివి.. క్షమించమని అడుగు.. వదిలేస్తాను) అని అన్నారు. నేను దానికి 'నహీ' (క్షమాపణ అడగను) అని జవాబిచ్చాను. దానికి ఆయన నా వయసును దృష్టిలో పెట్టుకొని వారం రోజులు జైలు శిక్ష విధించాడు. అది విముక్తి పోరాటంలో నాకు పడిన తొలి జైలు శిక్ష. వారం రోజులు చంచల్‌గూడ జైలులో ఉన్నాను.
నెహ్రూ ప్రసంగం అందించిన స్ఫూర్తి
ఇంటర్ చదివే రోజుల్లోనే గొప్ప సాహితీవేత్తలతో పరిచయాలు ఏర్పడ్డాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, విశ్వనాథను తీసుకువచ్చి మా కాలేజీలో ప్రసంగం ఇప్పించాను. విశ్వనాథ సాహిత్యాన్ని అనువదించాను. బీకామ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి రామ్ మనోహర్ లోహియాను రప్పించాను. ఆయన ప్రధాని నెహ్రూకి విరోధి, వద్దని వీసీ వారించినా సభ నిర్వహించాను. ఓ సారి హైదరాబాద్ (నానల్ నగర్) లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. దానికి జవహర్‌లాల్ నెహ్రూ వచ్చారు. ఆ మీటింగ్ కి మా నాన్నతో పాట నేను వెళ్లాను. నెహ్రూకు హైదరా బాద్ స్టేట్‌లో అదే తొలి మీటింగ్. ఆయన ప్రసంగాన్ని కేవీ నరసింహారావు అనువాదం చేశారు. భారత దేశంతో పాటు హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలకూ స్వాతంత్ర్యం కావాలె. భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తే మీకూ వస్తది. మీరూ పోరాడాలే" అని నెహ్రూ పిలుపునిచ్చిండు. నెహ్రూ సందేశం నాలో తెలియని స్ఫూర్తిని నింపింది. అప్పుడు నాకు పదహారేళ్లు. ఆ రోజున నేను దేశం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నా.
విలీనం పదం పలికితే జైళ్లు
ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చాక నిజాం రాజ్యం విలీనం కావాలని ఉద్యమం చేసేటోళ్లని పోలీసులు జైళ్లలో పెట్టారు. నిజాం రాజ్యానికి బయట నాలుగు క్యాంపులు పెట్టినారు. నేను విజయవాడ క్యాంపుకు పోయిన. అక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు బిల్డింగ్‌లో యాభై మంది దాకా ఉంటుండె. వారిలో ఖమ్మం, వరంగల్ నాయకులు ,చానామంది ఉన్నరు. జమలాపురం కేశవ రావు, బొమ్మకంటి, హయగ్రీవాచారి, వీబీ రాజు, ఎస్పీ గిరి లాంటి వాళ్లతో పరిచయం కలిగింది. ఒకరోజు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ మీద దాడి చేయడానికి ఒక టీమ్ బయలుదేరింది. నేను వస్తానని అడిగితే చిన్నవాడివి వద్దన్నరు. అయినా పట్టుబట్టి పోయిన. నాకు పిస్టల్ ఇచ్చినరు. అర్ధరాత్రి ఎర్రుపాలెం స్టేషన్ పై దాడి చేసినం. కొన్నాళ్లకు నన్ను చాందాలో ఉన్న క్యాంప్‌కు పొమ్మన్నరు. విజయవాడల రైలెక్కి చాందాకు బయలుదేరాను. అప్పటికే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం మొదలుపెట్టినరు. నేను కొన్నిసార్లు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో గ్రామాలకు వెళ్లి కొంత సమాచారంతో పాటు చందాలు కూడా పోగుచేసేవాడిని. ఒకసారి విరాళాల కోసం అసిఫాబాద్ పోయిన. జన్నారం దగ్గర బస్సు ఎక్కుతుంటే పోలీస్ ఇన్‌స్పెక్టర్ నా దగ్గరకొచ్చి 'ఎవరు నువ్వు? ఎందుకొచ్చినవ్?" అనడిగిండు. నా జేబులో ఉన్న ఉత్తరాలు చూసి ఓహో! నువ్వు లీడర్‌వేనా ! రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవా?? అంటూ అరెస్ట్ చేసిండు. లక్సెట్టిపేట మెజిస్ట్రేట్ నన్ను 'ప్రభువు ఆజ్ఞాపించేంతవరకు జైల్లో పెట్టమని' తీర్పునిచ్చా రు.
ఆరునెలలు అసిఫాబాద్ జైల్లో ఉన్నాను. ఆపరేషన్ పోలోకి కొద్ది రోజుల ముందు నన్ను వదిలేసిండ్రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్ల కలిసింది. చదువు, కెరీర్ మీదికి మనసు మళ్లింది. కాలేజ్ లెక్చరర్‌గా కెరీర్ మొదలుపెట్టిన. కరీంనగర్, జగిత్యాల, సిటీ కాలేజ్‌లలో ఉద్యోగాలు చేసిన. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పని చేసిన. ఎంతోమందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దానన్న సంతృప్తి మిగిలింది.
- డా. వెల్చాల కొండలరావు,
స్వాతంత్ర్య సమరయోధులు,
తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు
98481 95959






