తెలంగాణ సాయుధ పోరాటం.. విమోచన పోరాటమే!

by Ravi |   (  Updated:2025-09-17 01:00:38  IST  )

హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో అతిపెద్ద సంస్థానం. తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేది. సుమారు 70 లక్షల ఎకరాల

తెలంగాణ సాయుధ పోరాటం.. విమోచన పోరాటమే!
X

హైదరాబాద్ ప్రాంతం భారతదేశంలో అతిపెద్ద సంస్థానం. తెలంగాణ ప్రాంతం పూర్తిగా ఒక ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేది. సుమారు 70 లక్షల ఎకరాల భూమి జమీందారుల చేతిలో ఉండేది. ఐదున్నర లక్షల ఎకరాల భూమి నిజాం స్వంత ఖర్చులకోసం ఉపయోగించుకునే వారు. దేశముఖ్‌లు జాగిర్దారులు, పటేల్, పట్వారిలు, నిజాం బంధు గణాలు ఎవరికి తోచిన విధంగా వారు తెలంగాణ ప్రజలను, ప్రాంతాన్ని పితిరి గద్దల లాగా పీక్కొని తిన్నారు.

ఆ రోజుల్లో వెట్టిచాకిరి బ్రహ్మాండంగా ఉండేది. గ్రామాల్లో ఎలాంటి ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థా ఉండేది కాదు. పాలనలో, బోధనలో మాతృభాష స్థానంలో ఉర్దూ తీసుకొచ్చి రుద్దడం విద్యావ్యవస్థలోకి మతాన్ని జోప్పించడం ఇలాంటి చర్యలతో అనేకమంది ప్రజలకు పాలన, విద్య దూరమైంది.

హిందువులంతా బానిసలు..

ముస్లింలంతా పాలకులు హిందువులంతా బానిసలు అనే భావజాలాన్ని సంస్థానం మొత్తం వ్యాపింప చేశారు. ముస్లింల జనాభాను పెంచడమే ప్రధాన ధ్యేయంగా పనిచేసే సంస్థలు మజ్లీస్ -ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రజాకార్లు, సిద్ధికి దీందారు సంస్థ, కాక్సర్, బెల్ఫా హౌస్ ముఠాలను... తానే స్వయంగా పెంచి పోషించేవాడు. భాంచన్ దొర అనే భావనను అభివృద్ధి చేశాడు. అలా అనకుంటే చర్మం ఒలిచేవారు. తబ్లిక్ అంటే మతమార్పిడిలు, కొలువుల కోసం, ఉద్యోగాల కోసం, బిరుదుల కోసం, పదవుల కోసం, అధికారం కోసం నయానో భయానో పెద్ద ఎత్తున తబ్లిక్ జరిగేది. వీధులకు నగరాలకు సంస్థలకు ఒకే మతానికి చెందిన పేర్లు పెట్టేవారు. ఇవన్నీ గమనించిన ఇక్కడి ప్రజలలో నిజాం పాలనపై వ్యతిరేకత బాగా పెరిగింది. తమ భాష, సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబొట్టులపై ఆంక్షలు విధించే సరికి చావో రేవో తెలుసు‌కోవడానికి ఇక్కడి ప్రజలంతా ఏకమై నిజాం వ్యతిరేక పోరాటాలకు జంగ్ సైరన్ మోగించారు.

ముస్లిం దేశం స్థాపన కోసం..

దారుల్ ఇస్లాం అంటే హైదరాబాద్ మొత్తాన్ని ముస్లిం దేశంగా మార్చడం అనే ముఖ్య ఉద్దేశంతో 1940లో రజాకారుల దళం ఏర్పడింది. ఆజాద్ హైదరాబాద్ అనేది వీరి నినాదం. హిందువుల సంపద దోచుకోవడం కుదరకపోతే కాల్చి బూడిద చేయడ‌ మే. పఠాన్లు, అరబ్బులు, అఫ్గాన్లు హైదరాబాద్ రాష్ట్రమంతా వ్యాపించి సంస్థా నం మొత్తం అరాచకాలు సృష్టించారు. కాశీం రజ్వీ నాయకుడిగా దారు-ఉ-సలాం కేంద్రంగా 56 రాజ కారుల కేంద్రాలను నెలకొల్పారు. ఈ కేంద్రాలకు రజ్వీ నుండి ఆదేశాలు అందగానే పట్టణాలలో, పల్లెలలో ఎన్నో అకృత్యాలకు వారు ఒడిగట్టారు. బైరాన్ పల్లి, పరకాల, గుండ్రంపల్లి, పాములగుంట, బోరవెల్లి, కూటిగల్లు, అమీర్పేట్, పంజాగుట్ట.. ఇలా అనేక గ్రామాల్లో వేలాది మంది ప్రజలను అతి కిరాతకంగా హతమార్చారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కల పాలని రాసినందుకు ఇమ్రోజ్ రోజు పత్రిక సంపాదకుడైన షోయబుల్లాఖాన్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు.

విమోచన పోరాటంలో ఆర్యసమాజ్!

హైదరాబాద్ సంస్థానంలో నిజాం, తన అనుచరులను ఎదిరించడానికి అనేక సంస్థలు ఇక్కడ ఉద్భవించాయి. అందులో ముఖ్యమైనవి ఆర్య సమాజ్, హిందూ మహాసభ, ఆంధ్ర మహాసభలు.. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ అలుపెరుగని పోరాటాలు చేసింది. తెలంగాణ విమోచన పోరాటంతో ఆర్య సమాజ్ తన కీర్తిని హిమాలయ శిఖరాలకు చేర్చింది. పండిట్ నరేంద్ర, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు, భాగ్యరెడ్డి వర్మ, నారాయణరావు పవార్ వందేమాతరం రామచంద్రరావు.. లాంటి అనేకమంది నాయకులను ఆర్య సమాజ్ అందించింది. ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయి స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టులుగా పోరాటం కొనసాగించారు. దాశరథి లాంటి కవులు, వినాయకరావు విద్యాలంకార్ లాంటి న్యాయవాదులు, వావిలాల వీరభద్ర రావు లాంటి స్వయం సేవకులు అనేకమంది వ్యక్తులు, సంస్థలు నిజాంకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటాలు చేశారు.

ఆపరేషన్ పోలో.. తోకముడిచిన నిజాం

రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రజా వెల్లువ వచ్చింది. 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్రం సిద్ధించగానే ప్రజలలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చింది. లక్షలాది మంది ప్రజలు తమ పనిముట్లనే ఆయుధాలుగా పట్టుకొని నిజాంకు వ్యతిరేకంగా పారాడారు. పరిస్థితులు పరిపక్వత సాధించినప్పుడు ప్రజలు ఏ విధంగా కదులుతారనేదానికి ఒక అద్భుతమైన విషయం అదే తెలంగాణ విమోచన అనే విధంగా కన బడింది. బ్రిటిష్ వారు ఈ దేశం నుండి వెళ్లిపోయేటప్పుడు స్వదేశీ సంస్థానాలు స్వతంత్ర రాజ్యంగా ఉండవచ్చు లేదా భారతదేశంలో కానీ పాకిస్తాన్‌లో కానీ కలవచ్చు అని నిబంధన పెట్టి వెళ్లారు. అందుకే నిజాం స్వతంత్ర దేశంగా ఉంటానని ప్రకటించాడు. దీంతో ఆగ్రహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 13 సెప్టెంబర్ 1948 రోజున హైదరాబాద్ సంస్థానంపై ఆపరేషన్ పోలోను ప్రారంభించాడు. భారత సైన్యం పరాక్రమం ముందు నిజాం సైన్యం తోకముడిచింది. నిజాం రాజు మెడలు వంచుకొని లొంగి పోయాడు. 430 సంవత్సరాల బానిస సంకెళ్లు తెంచుకుని తెలంగాణ ప్రజలు నిజాం పాలన నుంచి విమోచనం పొందారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని గుర్తిస్తూ కేంద్ర హోమ్ శాఖ జారీచేసిన గెజిట్‌ను గౌరవించి రాష్ట్ర ప్రబుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినం పండుగ వాతావరణంతో జరపాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

-డా.బొప్ప భాస్కర్

96523 32870

Next Story