పరాధీనంలో తెలంగాణ పల్లెలు..

by Ravi |   (  Updated:2025-03-27 01:16:09  IST  )

తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో 1980 తర్వాత గ్రామాలలో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు

పరాధీనంలో తెలంగాణ పల్లెలు..
X

తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ప్రభావంతో 1980 తర్వాత గ్రామాలలో ఉన్న భూస్వాములు, జాగీర్దారులు, దేశ్ ముఖ్‌లు గ్రామాలను, భూములను వదిలి పట్టణాలకు వలస పోవడం తెలిసిన విషయమే. దీంతో ఆ గ్రామాల మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి రైతులు కొంతమంది పట్టాదారులుగా మారారు. ఇప్పుడు పేరు మార్పుతో (రియల్ ఎస్టేట్, ఫామ్ హౌస్ పేర్లతో) మళ్లీ తెలంగాణ పల్లెల్లో ఆనాటి వలసదారులే ఈనాడు రైతుల నుండి వందల ఎకరాలలో భూములు కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ పేర్లతో నయా భూస్వామ్య విధానం కళ్లముందే కనబడుతుంది.

గతంలో అయితే భూస్వాములు ఎవరో ఆ గ్రామాల రైతులకు తెలిసేవారు కానీ ఇప్పటి ఫామ్ హౌస్ పట్టాదారులు ఆ గ్రామస్తులకు కనీసం పరిచయం కూడా ఉండరు. అదేనేమో ఈ ఫామ్ హౌస్ కల్చర్! తెలంగాణ పల్లెల్లో 2005 సంవ త్సరం వరకు ఆ గ్రామాల్లో రైతుల అవసరాల కోసం భూములు అమ్ముకుంటే పక్కన ఉన్న రైతులు, గ్రామస్తులు సమక్షంలో గ్రామ పంచాయతీ దగ్గర ఆ భూమికి ధర నిర్ణయించి వాయిదాల పద్ధతిలో పంటల మీద ఆరు నెలలకు ఒక కిస్తీల రూపంలో కొన్నవారు అమ్మినవారికి డబ్బులు కట్టి సాదా బైనామా లేదా రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. కానీ ఇప్పుడు ఏ గ్రామంలో నైనా భూములను అమ్మితే ఆ పక్కనే ఉన్న రైతుకు కూడా తెలియకుండా అమ్ముతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఇదేనా?

భూమి మొత్తం వేరే వారి చేతుల్లో..

భూమిని రెండు రకాలుగా విభజించవచ్చు! భూమిని నమ్ముకునేవారు (రైతులు).. రెండో రకం భూమిని అమ్ముకునేవారు (కొని, అమ్మేవారు వ్యాపారులు). ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార భూతం తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో రైతుల భూములను దావానంలా దహించి వేస్తోంది. పట్టణాలలో, నగరాలలో, విదేశాల్లో డబ్బు ఉండి వ్యవసాయం అంటే తెలియని వారి చేతుల్లోకి తెలంగాణ వ్యవసాయ భూములు సగానికి పైగా వెళ్లిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల వ్యవసాయ భూములు సగం కంటే ఎక్కువగా ఆ గ్రామ వాసులు కానీ రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. అందుకు ఉదాహరణ- సిద్దిపేట జిల్లా, వర్గల్ మండలం, తునికి ఖల్సా గ్రామం. నేను ఈ గ్రామంలో ఏడు సంవత్సరాలుగా ఉంటూ పరిశీలించి, పరిశోధన చేసిన అంశాలు..

ఈ గ్రామం నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు నుండి 20 కిలోమీటర్ల (హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్లు) దూరంలో ఉంది. రాజీవ్ రహదారికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం HMDA పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామంలో జనాభా ప్రస్తుతం సుమారు 4600, మొత్తం కుటుంబాలు 930, ఈ గ్రామ రెవిన్యూ ప్రకారం భూమి విస్తీర్ణం సుమారు 4,192 ఎకరాలు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3300 ఎకరాలు. ఆ గ్రామ రైతులు చేతిలో ఉన్న భూమి 1,113 ఎకరాల 33 గుంటలు. ఈ గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 2006లో ఒక ఎకరా 35 వేల రూపాయల చొప్పున ప్రారంభమయింది. ప్రస్తుతం ఈ గ్రామ భూమి ఇతర ప్రాంతాలకు చెందిన వారి చేతులలో 1,203 ఎకరాలు ఉంది. మిగతా భూమిలో గ్రామం, 15 చెరువు కుంటలు, వాగు, అడవి, గుళ్ళు గోపురాలు, పాఠశాలలు, పార్కు, కరెంటు సబ్‌ స్టేషన్ మొదలైనవి ఉన్నాయి. ఈ గ్రామంలో ప్రస్తుతం భూమి ఉన్న కుటుంబాల సంఖ్య 534, భూమిలేని కుటుంబాల సంఖ్య 396.

ఊరి భూమిలో పని దొరకదు

1995 నుండి 2014 వరకు సుమారు రెండు దశాబ్దాల పాటు తెలంగాణలో విపరీతమైన కరువు ఏర్పడి ఆ వ్యవ సాయం బతుకు పై భరోసానివ్వక ఇతర అవసరాలు, కుటుం బ పోషణ భారంగా మారడంతో రైతులు భూములను అడ్డికి పావుశేరు లెక్కన అమ్ముకున్నారు. ఆ కరువు సమయంలో డబ్బులు ఉన్నవాళ్లు వ్యవసాయ భూములను ప్రాంతాలకతీతంగా కొనుగోలు చేశారు. ఈ గ్రామానికి రోడ్డుకు ఇరువైపులా ఇతర ప్రాంతాల వారు భూములను కొనేశారు. హైదరాబాదుకు అతి సమీపంలో ఉండడంతో 50% కంటే ఎక్కువ భూమి ఇతరుల చేతిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఒక ఎకరా ధర 2 కోట్ల వరకు ఉంది. గ్రామస్తులు కూడా ఇక్కడ ఇల్లు జాగ కొని ఇల్లు కట్టుకోవడానికి ధరలు అందుబాటులో లేవు. భూమి ఉన్న రైతులకు మాత్రం అమ్ముకుంటే ధర వస్తది అని ఒక భరోసా అయితే ఉంది. గ్రామాలు హైదరాబాదుకు దగ్గరగా ఉండడం వరమా శాపమా?

భూమిని, వ్యవసాయాన్ని కాపాడదాం

ఇక్కడ 150 ఎకరాలలో విత్తన పరిశోధన కేంద్రం ఉంది. అందులో ఈ గ్రామానికి చెందిన మహిళలు దాదాపుగా 100 మంది పనిచేస్తారు. మిగతా భూములలో చుట్టూ కాంపౌండ్ వాల్స్ పెట్టి ఇందులో సోలార్ పవర్ ప్లాంట్, మామిడి తోట లు, నర్సరీలు, స్పిన్నింగ్ మిల్, ఫామ్ హౌస్‌లు కట్టుకుంటున్నారు. ఇక్కడ సొంత గ్రామస్తులకు కూడా పని దొరకదు. ఈ భూములన్ని పంటలు పండించకుండా పడావుగా ఉన్నాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! దాదాపు రాష్ట్రంలో పట్టణాలకు సమీపంలో ఉన్న హైదరాబాదుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలలో కొంచెం ఎక్కువ, తక్కువ అన్ని గ్రామాలలో పరిస్థితి ఇలానే ఉంది. రైతులు కాని వారి చేతిలో భూమి ఉండడంతో అందులో పంటలు పండించక కేవలం సామాజిక హోదా కోసం మాత్రమే భూమిని కొనుగోలు చేసి పంటలు వేయకపోవడంతో భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పంటలు వేయని భూముల పైన చర్యలు తీసుకునే చట్టాలు తీసుకురావాలి. రైతులారా, ఎవరు కూడా భూములను అమ్ముకోవద్దు. భూములు సామాజిక హోదాకు నిదర్శనం. దాంతో పాటు తరతరాలకు తరగని నిధి ఆ భూమి. భవిష్యత్ తరాలకు భూమిని, వ్యవసాయాన్ని అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. భూమిని, వ్యవసాయాన్ని కాపాడుకుందాం! రైతును గౌరవిద్దాం!

- పులి రాజు

సామాజిక కార్యకర్త

99083 83567

Next Story