- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ PSC విధానం..
రాష్ట్ర నిరుద్యోగ యువత ఆశలన్నీ ఆవిరి అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ప్రభుత్వ

రాష్ట్ర నిరుద్యోగ యువత ఆశలన్నీ ఆవిరి అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్యపెడుతూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న విధానాలు న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. ప్రభుత్వం జీవో 55ను రద్దు చేసి జీవో -29 విడుదల చేయడంతో నిరుద్యోగుల భవిష్యత్తును మరింత గందరగోళంలోకి నెట్టింది. ఇది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం జీవో 55ని మార్చి, యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (PSCలు) అవలంబిస్తున్న విధానాలకు విరుద్ధంగా జీవో- 29ని తీసుకురావడం వెనుక గల కారణాలపై నిరుద్యోగులు తీవ్రమైన సందేహాలు లేవనెత్తుతున్నారు. టీజీపీఎస్సీ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన నిర్ణయం జీవో 29 రూపంలో వచ్చిందని నిరుద్యోగులు వాపోతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కడం విచారకరమని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన అధికారులకు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులకు నిజమైన సమస్య ఎక్కడ ఉందో బాగా తెలుసని, కానీ దానిని పరిష్కరించే చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టికల్ 371D ఉల్లంఘన..
ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులను తెలంగాణ ఈడబ్ల్యూఎస్ కోటాలోకి చేర్చడం. జీవో-29 ద్వారా తలెత్తిన కీలక సమస్యలలో ఒకటి. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 371Dకి తీవ్ర విఘాతం కలిగిస్తుందని, తెలంగాణ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తుందని న్యాయ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. స్థానిక అభ్యర్థులకు దక్కాల్సిన అవకాశాలను ఇతర ప్రాంతాల వారికి కట్టబెట్టడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తికి, రాజ్యాంగం కల్పించిన స్థానికత హక్కుకు పూర్తి విరుద్ధమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకే పరిమి తం కాకుండా, రిజర్వేషన్ల మొత్తం వ్యవస్థను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఈ విధానం వల్ల ప్రాంతీయతత్వం, స్థానికతకు సంబంధించిన వివాదాలు మళ్లీ ప్రజ్వలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
యూపీఎస్సీ విధానాల ఉల్లంఘన..
యూపీఎస్సీతో పాటు అధికశాతం ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు (PSCలు) ప్రిలిమ్స్ స్థాయి నుంచే రిజర్వేషన్లను పార దర్శకంగా అమలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 'బాలాజీ బడావత్ తీర్పు' ను సాకుగా చూపుతూ ప్రిలిమ్స్ స్థాయిలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం విడ్డూ రంగా ఉందని న్యాయ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో దివ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (WP(C) No. 724/2023, 2023 INSC 900) కేసులో యూపీఎస్సీ, ఖాళీల ఆధారంగా ప్రతి దశలో వర్గం వారీగా కట్-ఆఫ్‌లను నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పు స్ఫూర్తిని సైతం తెలంగాణలో విస్మరించడం నిరుద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
మెరిట్ వచ్చినా.. రిజర్వేషన్ కేటగిరీనేనా?
గతంలో, WP 3048/2023 కేసులో గౌరవ హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్‌లో, చీఫ్ సెక్రటరీ (GAD) జీవో -55 అవసరాన్ని 2023 ఫిబ్రవరిలో స్పష్టంగా వివరించారు. అలాంటి సమగ్ర వివరణ ఇచ్చిన తర్వాత, GAD తన మనసు మార్చుకుని, ఎవరి ప్రయోజనాలను ఆశించి జీవో-29ని తీసుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ జీవో ద్వారా తెలంగాణ నిరుద్యోగులకే కాదు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కూడా అన్యాయం చేస్తోందని తీవ్ర ఆరోపణలున్నాయి. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించినా, వారిని మళ్లీ రిజర్వేషన్ కేటగిరీలకే పరిమితం చేస్తూ మెరిట్‌కు అన్యాయం చేస్తోందని బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇదే అంశాన్ని ఓ నాయకుడు అసెంబ్లీలో సైతం ప్రశ్నించారు, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా పరిష్కారం దొరకకపోవటం గమనార్హం. ఓపెన్ కేటగిరీలో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు? అనే ప్రశ్నకు టీజీపీఎస్సీ వెబ్‌నోట్‌లో, స్పష్టమైన గణాంకాలు లేకపోవడం నిరుద్యోగుల్లో తీవ్ర అనుమానాలకు తావిస్తోంది.
ఇప్పుడైనా జీవో రద్దు చేయండి!
ఈ కేసులో అప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయినందున కేవలం వెబ్‌నోట్‌లో తెలిపిన విషయాలతో జోక్యం చేసుకొలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, పిటిషన్లు దాఖలు చేయడంలో జాప్యం జరిగినందున పూర్తి సమాచారం లేనందున ప్రభుత్వం జారీ చేసిన, జీవో- నం.29, తేదీ 2024.02.08ను పక్కన పెట్టలేమని మాత్రమే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది తప్పితే ఎక్కడా కూడా జీవో 29, సక్రమమే అని చెప్పలేదు. పైగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో పై అంశాలపై ప్రత్యేకంగా కొత్త పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛను కూడా ఇచ్చింది. అందుకే అధికారులు ఇచ్చే తప్పుడు సలహాలను పక్కన పెట్టి, నిరుద్యోగ యువతకు వెంటనే న్యాయం చేయాల్సిన ప్రాథమిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కనీసం ఇప్పుడైనా జీవో 29ని రద్దు చేసి, పారదర్శకమైన, న్యాయబద్ధమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలి. ఈ వైఫల్యం ప్రభుత్వానికి తీవ్ర పరిణామాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని గుర్తించాలి. ముఖ్యమంత్రి వరకు ఈ జీవోలో ఉన్న అసలు లోపం అధికారులు తెలియనీయకపొవడం కొసమెరుపు.
-డా.కట్కూరి
సామాజిక, న్యాయ విశ్లేషకులు






