సామాజిక కార్యకర్తల అవస్థలు ఎన్నాళ్లు?

by Ravi |   (  Updated:2026-06-12 00:45:25  IST  )

తెలంగాణలో సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులపై ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు, పోలీసు నిఘాపై పెరుగుతున్న ఆందోళనలను విశ్లేషించే కథనం. ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన హక్కు, ప్రభుత్వ బాధ్యతలపై సమగ్ర చర్చ.

సామాజిక కార్యకర్తల అవస్థలు ఎన్నాళ్లు?
X

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వేలాది మంది సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను అంకితం చేశారు. ప్రజాస్వామ్య హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం పోరాడిన వారే నేడు అదే తెలంగాణలో పోలీసుల నిఘా, ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాల మధ్య జీవించాల్సిన పరిస్థితి ఏర్పడటం ఆందోళన కలిగించే విషయం.

నిరసనలను సహజంగా స్వీకరించాలి!

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ప్రజల విమర్శలను, నిరసనలను సహజంగా స్వీకరించాలి. కానీ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు మాత్రం భిన్నాభిప్రాయాలను అణచివేసే ధోరణికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో ఏ మంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యక్రమం జరిగినా, నిరసన తెలిపే అవకాశం ఉందనే అనుమానంతో సామాజిక కార్యకర్తలను ముందుగానే అదుపులోకి తీసుకోవడం పరిపాటిగా మారింది. ఒక సంఘం నిరసనకు పిలుపునిస్తే, ఆ సంఘంతో ప్రత్యక్ష సంబంధం లేని ఇతర ప్రజా సంఘాల సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగ పోరాట సమితి సభ్యులు, ఫార్మ్ సిటీ పోరాట సమితి కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు తరచూ ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు.

ముందస్తు నిర్బంధాలే ప్రక్రియగా...

రోజంతా ప్రివెంటివ్ అరెస్ట్ పేరుతో పోలీస్ స్టేషన్‌లలో లేదా గృహ నిర్బంధంలో ఉంచడం వల్ల సామాజిక కార్యకర్తలు తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన బాధ్యత లను నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యమైన సమావేశాలు, ఉపాధి అవకాశాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాలు సైతం వాయిదా పడుతున్నాయి. ఈ పరిస్థితి పదేపదే పునరావృతమవుతుంటే వారి కుటుంబాలు ఎదుర్కొనే మానసిక, ఆర్థిక, సామాజిక ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును గౌరవించాల్సిన చోట, ముందస్తు నిర్బంధాలను సాధారణ ప్రక్రియగా మార్చడం అమానవీయమైనదే కాకుండా అప్రజాస్వామిక చర్యగా కూడా పరిగణించాల్సి ఉంటుంది.

ప్రివెంటివ్ అరెస్టుకు కొత్త నిర్వచనం

స్థానిక సామాజిక కార్యకర్త సరస్వతి కవుల విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు బయలు దేరుతున్న సమయంలో యాచారం పోలీసులు వచ్చి “ప్రివెంటివ్ అరెస్ట్” చేస్తున్నామని తెలిపారు. కారణం అడిగితే ఫార్మ్ సిటీ ప్రాంతంలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉందని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఎటువంటి నోటీసు లేకుండా, చట్టబద్ధమైన ప్రక్రియ పాటించకుండా అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని, నోటీసు ఇస్తామని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చివరకు ఉన్నతాధికారుల జోక్యంతో, ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలుప బోతున్నారనే సమాచారంతో ఆమెను విడుదల చేసినప్పటికీ, తన వెనకాల పోలీసు వాహనం నిరంతరం వస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కుల అమలుపై ఉన్న ఆందోళనలకు ప్రతిబింబంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది.

విభిన్న స్వరాలను అనుమానిస్తారా?

నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఆ హక్కును వినియోగించుకునే అవకాశమే లేకుండా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. శాంతిభద్రతల పేరుతో ప్రతి విభిన్న స్వరాన్ని అనుమానంతో చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరుస్తుంది. సామాజిక కార్యకర్తలను నేరస్థులుగా చూడకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం బలపడేది ప్రశ్నలను అణచివేయడం ద్వారా కాదు వాటిని వినడం ద్వారా.

స్వీకరించే సంస్కృతి పెరగాలి!

తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులే ప్రశ్నార్థకమైతే అది రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకం కాదు. ప్రభుత్వం విమర్శలను శత్రుత్వంగా కాకుండా ప్రజల అభిప్రాయాలుగా స్వీకరించే సంస్కృతిని పెంపొందించాలి. అప్పుడే తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణగా నిలుస్తుంది.

- సయ్యద్ రఫీ

[email protected]

Next Story