నర్సింగ్ ఆఫీసర్ల కొరత.. జిల్లాల నుంచి హైదరాబాద్‌పై నో ఇంట్రెస్ట్

by Ajay Maddhiboyina |

వైద్య, ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న బదిలీల ప్రక్రియ వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్ల కొరత వేధిస్తుంటే... తాజా బదిలీల్లో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, సరోజిని ఐ, ఫీవర్ హాస్పిటల్, సహా కీలకమైన చోట్ల మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి.

నర్సింగ్ ఆఫీసర్ల కొరత.. జిల్లాల నుంచి హైదరాబాద్‌పై నో ఇంట్రెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్య, ఆరోగ్య శాఖలో కొనసాగుతున్న బదిలీల ప్రక్రియ వైద్య సేవలపై తీవ్ర ప్రభావాన్ని చూపించేలా కనిపిస్తోంది. నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఇప్పటికే నర్సింగ్ ఆఫీసర్ల కొరత వేధిస్తుంటే... తాజా బదిలీల్లో ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, సరోజిని ఐ, ఫీవర్ హాస్పిటల్, సహా కీలకమైన చోట్ల మరిన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో వైద్యానికి తీవ్రంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవలే ఫీవర్ హాస్పిటల్‌లో నర్సింగ్ ఆఫీసర్ల బదులుగా ఆయా సెలైన్ ఎక్కించిందంటూ రోగి బంధువులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇక నిత్యం వేలాది మంది రోగులు వచ్చే కీలకమైన ఆసుపత్రుల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను జిల్లాలకు బదిలీ చేసిన అధికారులు... జిల్లాల నుంచి కూడా అదే స్థాయిలో హైదరాబాద్‌లోని ఆసుపత్రుల వేకెన్సీలను భర్తీ చేసే విషయంలో వైఫల్యం చెందారు. దీంతో వైద్యానికి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వైద్యులు సైతం వాపోతున్నారు.

ఖాళీలను భర్తీ చేయక... ఉన్న వారిని పంపించేసి

ఎక్కడ రోగులు ఎక్కువ ఉంటే అక్కడ సిబ్బంది అందుకు తగ్గట్లుగా ఉండాలి. కానీ ఆ మాత్రం కూడా వైద్య, ఆరోగ్యశాఖలో ఆలోచించే అధికారులు కరువయ్యారు. ఉస్మానియా, గాంధీ, నీలోఫర్ లాంటి ఆసుపత్రుల్లో వేలాదిగా రోగులు వస్తారు. అక్కడ మాత్రం రోగులకు తగ్గట్లుగా నర్సింగ్ ఆఫీసర్లు లేరు. కానీ సంగారెడ్డి, కొడంగల్ ఆసుపత్రుల్లో రోగుల కంటే నర్సింగ్ ఆఫీసర్ల సంఖ్యే ఎక్కువైంది. సాధారణంగా జిల్లాల నుంచి కేసులన్నింటినీ గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ తదితర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పంపిస్తారు. కానీ ఘనత వహించిన అధికారులు మాత్రం సిబ్బందిని జిల్లాలకు పంపించి... నగరంలోని ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించే వారి సంఖ్యను భారీగా తగ్గించేశారు. అక్కడ అనుభవం లేని జూనియర్ల వల్ల చిన్న పొరపాటు జరిగిన పసిపిల్లల ప్రాణాలకే ప్రమాదమని ఐఎన్టీయూసీ (నర్సింగ్) ప్రధాన కార్యదర్శి ప్రసన్న తెలిపారు. ప్రభుత్వం ప్రజా వైద్యంపై పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. రోగులు ఉన్న చోట వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్ల కొరత ఎంత ప్రమాదమో గత బదిలీల్లోనే బయటపడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నగరంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్లను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని వైద్య నిపుణులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి

ఉస్మానియా ఆసుపత్రిలో ప్రస్తుతం 188 మంది నర్సింగ్ ఆఫీసర్స్ పనిచేస్తుండగా ఇంకా 130 ఖాళీలున్నాయి. ఇప్పుడు బదిలీల్లో 52 మందిని జిల్లాలకు పంపించేశారు. కానీ తిరిగి ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. ఫలితంగా ఖాళీల సంఖ్య ప్రస్తుతం ఉన్న వారి కంటే ఎక్కువైంది. ఇప్పుడు ఉస్మానియాలో 136 మంది మాత్రమే మిగిలారు. ఖాళీల సంఖ్య 182కు పెరిగింది. ఇక్కడ ఇన్ పేషెంట్ల సంఖ్యనే వెయ్యి మంది వరకు ఉంటుంది. నీలోఫర్ లో చిన్న పిల్లలకు చాలా జాగ్రత్తగా చికిత్స అందించే క్రమంలో క్యానులా పెట్టే అనుభవమున్న నర్సింగ్ ఆఫీసర్లందరినీ బదిలీల్లో పంపించేశారు. దీంతో వైద్య సేవలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

3 నీలోఫర్‌లో 250 మంది పనిచేస్తున్నారు. 124 ఖాళీలున్నాయి. ఇప్పుడు 40 మందికి బదిలీలు కాగా... బయటి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఫలితంగా ఖాళీల సంఖ్య 164కు చేరుకుంది. ఇక్కడ ఇన్‌పేషెంట్లు 1200కు పైమాటే.

3 సరోజిని కంటి ఆసుపత్రిలో 25 మందికి బదిలీ అయితే తిరిగి వచ్చిన వారు 11 మంది మాత్రమే

3 ఛెస్ట్ హాస్పిటల్‌లో ఇప్పటికే 28 ఖాళీలున్నాయి. 21 మందికి బదీలీ అయితే వచ్చింది నలుగురే.

3 ఫీవర్ హాస్పిటల్‌లో 22 ఖాళీలున్నాయి. 18 మందికి బదిలీలు అయ్యాయి. తిరిగి వచ్చింది సున్నా.

3 పేట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్‌లో 22 ఖాళీలున్నాయి. 34 మందికి బదీలీ అయితే తిరిగి వచ్చింది ఏడుగురే.

3 సంగారెడ్డి జీజీహెచ్‌లో 160 మంది పనిచేస్తున్నారు. 74 ఖాళీలుంటే 14 మంది బదిలీపై వెళ్లగా... 75 మంది తిరిగి వచ్చారు. ఇక్కడ ఇన్‌పేషెంట్స్ కేవలం 160 మందే.

3 కొడంగల్ జీజీహెచ్‌లో 115 పోస్టులుండగా... అక్కడికి బదిలీపై 113 మందిని పంపించారు.

3 గాంధీలో 239 మంది నర్సింగ్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. 66 ఖాళీలున్నాయి. ఇక్కడి నుంచి 82 మందిని బదిలీ చేస్తే... ఇక్కడికి బదిలీపై వచ్చింది కేవలం ఇద్దరే. అంటే ఖాళీల సంఖ్య 146కు చేరుకుంది. ఇక్కడ ఇన్ పేషెట్లు నిత్యం 1500 మందికి పైగా ఉంటారు.

Next Story