- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులకు మోక్షం ఎప్పుడో?
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించి, జిల్లా స్థాయి అధికారులు సైతం పరిశీలించారు.

దిశ, ఏన్కూర్: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అధికారులు నిర్ణయించి, జిల్లా స్థాయి అధికారులు సైతం పరిశీలించారు. ప్రస్తుతం ఈ స్కూల్లో 30 గదులు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సుమారు 54 గదుల అవసరమని అధికారుల ద్వారా తెలిసింది. మరో 24 గదులు నిర్మాణం కోసం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థలాన్ని పరిశీలించారు కానీ నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అధికారుల తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు 54 తరగతి గదులు, మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేసే సమయంలో వారికి సరిపడా టాయిలెట్స్ నిర్మాణం, దాంతోపాటు మధ్యాహ్నం భోజనం చేయడానికి హాల్, వంట నిర్వహణ కోసం కిచెన్ షెడ్లు నిర్మాణం జరగవలసి ఉంది.
వైరా నియోజకవర్గంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏన్కూరు మండలానికి కేటాయించడానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ ఎంతో కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా ఏన్కూర్ కు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు అయింది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో డిసెంబర్ నాటికి ఏన్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కార్యకలాపాలు నిర్వహిస్తారా అనే అనుమానం కూడా తలెత్తక మానలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ఈ ప్రాంత గిరిజన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ పనులు వెంటనే మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.






