- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంతకీ అది ప్రభుత్వ భూమా, ప్రైవేటు వ్యక్తుల భూమా?.. వివాదాస్పద భూమి వద్ద మోహరించిన పోలీసులు
గత కొన్ని సంవత్సరాల నుండి చిన్నతోకట్ట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 157/1లో ఖాళీగా ఉన్న సుమారు 6 నుండి 8 ఎకరాల భూమి అసలు ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు వ్యక్తుల భూమా అనే విషయం ఎవరికి సరిగా తెలియని పరిస్థితి నెలకొంది.

దిశ, తిరుమలగిరి: గత కొన్ని సంవత్సరాల నుండి చిన్నతోకట్ట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 157/1లో ఖాళీగా ఉన్న సుమారు 6 నుండి 8 ఎకరాల భూమి అసలు ప్రభుత్వ భూమా లేక ప్రైవేటు వ్యక్తుల భూమా అనే విషయం ఎవరికి సరిగా తెలియని పరిస్థితి ఉండగా, ఈ భూమిపై కొంతమంది వ్యక్తుల కన్ను పడడంతో ప్రశాంతంగా ఉన్న బోయినపల్లిలో గత వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాదస్పదంగా మారిన ఈ భూమి ప్రాంతంలో రోజురోజుకు యుద్ధ వాతావరణం నెలకొని ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోనని ఈ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మనోవికాస్ నగర్‌లోని మానసిక వికలాంగుల ఆసుపత్రికి వచ్చిపోయే చిన్నారులతో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండే ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పాతబస్తీకి చెందిన బౌన్సర్ లు, రౌడీలు తిరుగుతుండడంతో ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోయినపల్లి మనోవికాస్ నగర్ ఏరియాలోని ఎన్ఐఎంహెచ్ఎస్ ఎదురుగా గల భూముల వివాదం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. ఒకరికంటే ఒకరు ఈ భూమి తమదంటే తమ భూమి అంటూ భూమి వద్ద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ స్థానిక ప్రజలు, ఆసుపత్రికి వచ్చే మానసిక వికలాంగులను, వారి తల్లిదండ్రులు సైతం భయభ్రాంతులకు గురి అయ్యే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది సంవత్సరాల క్రితం ఇవి తమ భూములేనని అంటూ కొంతమంది వ్యక్తులు వచ్చి హద్దులు వేసుకోవడానికి రాగా అనాడు అక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు స్థానికులు చేరుకొని పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే తిరిగి గత వారం రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు వచ్చి దాదాపు 3 ఎకరాల వరకు భూములు తమ పూర్వీకుల నుంచి తమకు సంక్రమించాయని హద్దులు వేయడానికి ప్రయత్నించడంతో స్థానికంగా ఉండే 2 వర్గాల నాయకులు ఈ భూములలో తమకు కూడా పేపర్లు ఉన్నాయంటు వివాదాలు సృష్టించారు. ఇంతటితో ఆగకుండా మరో వర్గం వారు తమకు ఈ భూమిపై తమకే అన్ని హక్కులు ఉన్నాయని, భూమి చుట్టు ప్రహరి గోడను నిర్మించుకోవడం కోసం కోర్టు అనుమతులు ఉన్నాయంటు ఇతర ప్రాంతాల నుంచి ప్రైవేటు వ్యక్తులను తీసుకువచ్చి ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా గత 4 రోజుల క్రితం ఇవే భూముల సరిహద్దులలో తెల్లవారుజామున దేవతల విగ్రహాలు, యేసు క్రీస్తు సిలువ వెలవడంతో భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కమ్యూనల్ వివాదాలు చెలరేగే ప్రమాదం ఉందని బేగంపేట ఎసిపి గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో బోయినపల్లి, తిరుమలగిరి సీఐ లు తిరుపతి రాజు, నాగరాజు ల ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆ తరువాత ఆ విగ్రహాలను అర్ధరాత్రి వాటిని తొలగించారు. అయితే పాతబస్తీకి చెందిన కొంతమంది రౌడీషీటర్లు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆ భూమి చుట్టు రేకులతో హద్దులు వేసేందుకు మోహరించడంతో ఇక్కడ ఏం జరుగుతుందోనని అటుగా వెళ్ళే ప్రజలతో పాటు స్థానిక ప్రజలు సైతం రోజు రోజుకు భయాందోళనలో మధ్య జీవిస్తున్నారు. అయితే తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు, కంటోన్మెంట్ బోర్డు అధికారులు అటుగా వచ్చి విచారణ జరపకపోతుండడంలోని ఆంతర్యం ఏమిటి అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
కానీ స్థానిక పోలీసులు అటుగా వచ్చి చూసి వెళ్తున్నారు, తప్ప బయట వ్యక్తులు అక్కడ ఎందుకు సంచరిస్తున్నారని ప్రశ్నించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒక భూమికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నప్పుడు రౌడీలు, గుండాల పహారాలో హద్దులు వేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.అసలు ఆ భూములు ఎవరికి చెందినవో వారియే అయితే బౌన్సర్లు గూండాలు రౌడీల మధ్యన హద్దులు వేయాల్సిన అవసరం ఏముందని పలువురు చర్చించుకుంటున్నారు.రోజు రోజుకు వివాదం ముదురుతుండడంతో ఈ ప్రాంతంలో ఎలాంటి భయంకర సంఘటనలు చోటు చేసుకుంటాయోనని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా సర్వేనెంబర్157/1లోని ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తులకు ఎలా సంక్రమించాయో సంబంధిత రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ భూమి వివాదాన్ని పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అయితే గురువారం కొందరు హనుమాన్ దేవాలయం వద్ద కంచె కట్టడాన్ని అడ్డుకున్నారు.
దీంతో మరో వర్గం వారు పెద్ద ఎత్తున రౌడీలు,గుండాలను రంగంలోకి దింపడంతో యుద్ద వాతావరం నెలకొంది.విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బారి బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇరువర్గాలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పోలీసులకు,లేదా న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకోవాలని బోయినపల్లి పోలీసులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.కాగా ఇంత జరుగుతున్న సంబదిత అధికారులు స్పందించకపోవడంతో పెద్ద ఎత్తున చేతులు మారినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.ఇప్పటికైనా చిన్నతోకట గ్రామ పరిధిలోని 157/1సర్వేనెంబర్ లోని భూములను పూర్తిస్థాయిలో సర్వే జరిపించి మానసిక వికలాంగుల ఆసుపత్రి ఎదురుగా గల భూములు ఎవరవో తేల్చేలా జిల్లా కలెక్టర్,రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






