ద్వారకుంట గ్రామంలో విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సమీపంలోని నెమలిపురి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

ద్వారకుంట గ్రామంలో విషాదం.. విద్యుదాఘాతంతో యువకుడు మృతి
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామ సమీపంలోని నెమలిపురి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని సరిచేసే క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై రెడ్డిబోయిన గోపి( 20) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపగా, మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిబోయిన గోపి గ్రామంలో మీటర్ రీడర్‌గా పనిచేస్తూనే, విద్యుత్ శాఖ సిబ్బందికి సహాయకుడిగా విధులు నిర్వహించేవాడు. నెమలిపురి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను పరిష్కరించేందుకు అధికారులు సూచించిన మేరకు గోపి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేపట్టాడు.

అయితే పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహానికి గురైన గోపి, స్తంభంపైనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడు తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, బంధువులు చేసిన రోదనలు హృదయ విదారకంగా మారాయి. గ్రామస్థులు కూడా గోపి మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన పై స్థానికులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. శాశ్వత ఉద్యోగి కాని వ్యక్తితో ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదా కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోపి మృతికి కారణమైన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.ఒక్కడే కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరులో మునిగిపోగా, విద్యుత్ శాఖ పనితీరు పై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Next Story