ఉప్పల్ స్కైవాక్‌లో అర్ధరాత్రి భయానక దృశ్యం.. గంటల తరబడి లిఫ్ట్‌లో నరకం చూసిన యువకుడు!

by Jakkula.Mamatha |

ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో ఓ యువకుడు చిక్కుకుపోయిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఉప్పల్ స్కైవాక్‌లో అర్ధరాత్రి భయానక దృశ్యం.. గంటల తరబడి లిఫ్ట్‌లో నరకం చూసిన యువకుడు!
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ స్కైవాక్ లిఫ్ట్‌లో ఓ యువకుడు చిక్కుకుపోయిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్‌ కు చెందిన రాహుల్(20) ఉప్పల్‌‌లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌‌లో ఉంటూ ఉప్పల్‌లోని ఎన్‌ఆర్‌పీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని హాస్టల్‌‌కు వెళ్తున్న సమయంలో ఉప్పల్ స్కైవాక్ 6-బీ లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. రాత్రి సుమారు 11:30 గంటల నుంచి రాహుల్ లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయి ఉన్నాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు, ఉప్పల్ పోలీసులు, హెచ్‌ఎండీఏ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని యువకుడిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు.

అయితే లిఫ్ట్ తెరుచుకోకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కన్‌స్ట్రక్షన్ సిబ్బంది స్పందించడం లేదు. వారి స్పందన పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లిఫ్ట్‌ లో చిక్కుకున్న యువకుడి పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లిఫ్ట్‌ ను తెరిచి యువకుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు చర్యలు కొనసాగించారు. చివరకు 1 గంట సమయంలో టెక్నీషియన్ రావడంతో రాత్రి 1:15 గంటల సమయంలో రాహుల్‌ ను సురక్షితంగా బయటకు తీశారు. దాదాపు రెండు గంటల 15 నిమిషాల పాటు యువకుడు లిఫ్ట్‌ లోనే ఉండాల్సి వచ్చింది. లిఫ్ట్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కృష్ణా కన్‌స్ట్రక్షన్ సిబ్బంది, హెచ్ఎండిఏ అధికారులు సకాలంలో స్పందించకపోవడం వలన లిఫ్టులు రెండు గంటల 15 నిమిషాల సమయం పట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మెయింటెనెన్స్ లోపాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు గంటల తర్వాత రాహుల్ ను లిఫ్ట్ మెయింటేన్ సిబ్బంది వచ్చి బయటకు తీశారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం రాహుల్ మాట్లాడుతూ.. లిఫ్ట్ నిర్వహణ సంస్థ నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను హార్ట్ పేషెంట్ ని చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది అంటూ దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేశాడు. స్కైవాక్‌లలోని లిఫ్ట్‌ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story