దేశానికే స్ఫూర్తి తెలంగాణ

by Disha edit |
దేశానికే స్ఫూర్తి తెలంగాణ
X

తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఢిల్లీలో పదే పదే జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో నిరంతరం సమీక్షలు, సంప్రదింపులు జరిపేవారు. అదే ధైర్యంతో దేశం బాగు కోసం జాతీయ రాజకీయాలలో ముందుకు సాగాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంక్షోభం సృష్టించే 'బుల్డోజర్, ట్రబుల్ ఇంజన్' అవసరం లేదని, తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన‌ కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకత్వం వలననే అద్భుత అవిష్కరణలు జరిగి 'మేరా భారత్ మహాన్' ను సుసాధ్యం చేయగలరనే నమ్మకం, ఆశలు జాతిలో చిగురించాయి. సంచలనం కోసం భారత జాతి ఎదురు చూస్తున్నది.

నూతన రాష్ట్రంలో సాధించిన విజయాలను దేశానికి చాటేలా చేసింది తెలంగాణ స్ఫూర్తి. ఎనిమిది సంవత్సరాల పసికూన తెలంగాణ గురువారం ఆవిర్భావ‌ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నది. తెలంగాణ పోరాటంలో అసువులు బాసిన వీరుల త్యాగాలను నెమరు వేసుకుంటూ, విజయాలు రాష్ట్రం నలుచెరుగులా ప్రతి గడపకు చేరే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రజలను భాగస్వామ్యం చేయడం చాలా కీలకమని టీఆర్‌ఎస్ భావించింది. 1969 ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ప్రాణాలర్పించినవారి త్యాగాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.

'ఆరు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రధాత కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు వేద్దాం. ఇదే స్ఫూర్తితో ప్రజల ఎజెండాగా టార్చ్ బేరర్ కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావాలి. దేశ్ కీ నేతా- జై భారత్' అంటూ యావత్ జాతి నినదిస్తున్నది. అనేక విమర్శలు, అనుమానాల మధ్య గుప్పెడు మందితో 2001 ఏప్రిల్ 27న తెలంగాణ నినాదం ఎత్తుకుని, జూన్ 2న తెలంగాణ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ జెండాను ఎగిరేసి, స్వయం పాలన జెండా ఎత్తిన రోజు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది.

సజీవ సాక్ష్యాలుగా మిగిలి

కేసీఆర్ పరిపాలనలో వేసిన ప్రతి అడుగు, ప్రతి క్షణం, ఎనిమిది సంవత్సరాల కాలంలో జరిగిన విజయాలు భవిష్యత్ తరాలకు సజీవ సాక్ష్యాలుగా మిగిలి ఉంటాయి. భారత జాతి అభివృద్ధికి కొత్త శక్తితో తెలంగాణ నాయకత్వం ముందుకు సాగుతోంది. జాతికి గొడ్డలి పెట్టుగా మారిన కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల మీద ఉద్యమ నేత తిరుగుబాటు ఒక వైబ్రేషన్ అయ్యింది. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడచిన బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశానికి కొత్త ఎజెండా అవసరం అంటూ కేసీఆర్ 'మేరా భారత్ మహాన్' విజన్-2024 దిశగా అడుగులు వేయడం ఒక ఇన్స్పిరేషన్. మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలకు తెర లేపిన బీజేపీ పాలనతో విసుగెత్తిపోయి కాపలాదారు కోసం భారతావని ఎదురుచూస్తున్నది.

ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రోజులకు చరమగీతం పాడనుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ అంటూనే ప్రభుత్వ రంగ సంస్థలను వేలం పెట్టడం భారత స్వాతంత్ర్య పోరాటానికే తీరని అవమానం. తెలంగాణకు దక్కాల్సిన అంశాల గురించి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నవజాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాల్సిందిపోయి ఆర్థిక ఆంక్షలు విధించి వివక్షకు గురిచేస్తున్నది. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైంది. విభజన చట్టంలోని అన్ని హామీలను తుంగలో తొక్కింది. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్ దేశంలో జరుగుతున్న దారుణాలపై యుద్ధం ప్రకటించడం శుభ సూచకమని భారతమాత‌ స్వాగతిస్తున్నది.

ఆ ప్రభుత్వాలు చేసింది శూన్యం

75 సంవత్సరాల పాలనలో దేశానికి ప్రభుత్వాలు మౌలిక వసతులు అందించలేకపోయాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సాగునీరు, తాగునీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతుబీమా, ఆసరా, దళిత బంధు లాంటి పథకాలతో అమృతం దక్కిందనే భావించాలి. సముద్రంలో వృథాగా కలిసిపోయే నీటిని ఒడిసి పట్టుకుని బృహత్తరన ప్రాజెక్టులు నిర్మించడానికి అపర‌ భగీరథుడులా కేసీఆర్ చేసిన ప్రయత్నంతో 1.40 కోట్ల ఎకరాలు సాగులోకి వచ్చాయి. తెలంగాణ జీఎస్‌డీపీ దేశ జీడీపీ కంటే ఎన్నోరెట్లు ఎక్కువ.

2014లో రూ. 5,05,849 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు 11.54 లక్షల కోట్లకు చేరింది. దేశంలో ఆర్థికంగా నాల్గవ స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. 1,33,942 పోస్టులు భర్తీ చేసింది. తాజాగా 91,142 ఉద్యోగాల ప్రకటనతో దేశం ఉలిక్కి పడింది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో కేటీఆర్ వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ ఎనిమిది ఏండ్లలో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులిచ్చి రూ. 2.21 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టారు. ఫలితంగా 16.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయంటే అతిశయోక్తి కాదు.

దేశం అభ్యున్నతిని కోరి

తెలంగాణ సాధన కోసం కేసీఆర్ ఢిల్లీలో పదే పదే జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో నిరంతరం సమీక్షలు, సంప్రదింపులు జరిపేవారు. అదే ధైర్యంతో దేశం బాగు కోసం జాతీయ రాజకీయాలలో ముందుకు సాగాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ కీలక భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంక్షోభం సృష్టించే 'బుల్డోజర్, ట్రబుల్ ఇంజన్' అవసరం లేదని, తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన‌ కేసీఆర్‌లాంటి విజన్ ఉన్న నాయకత్వం వలననే అద్భుత అవిష్కరణలు జరిగి 'మేరా భారత్ మహాన్' ను సుసాధ్యం చేయగలరనే నమ్మకం, ఆశలు జాతిలో చిగురించాయి. సంచలనం కోసం భారత జాతి ఎదురు చూస్తున్నది.

(నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం)

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355.


Next Story

Most Viewed