- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మగౌరవ పోరాటాలకు చిరునామా
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, అమరవీరుల త్యాగాలు, తెలంగాణ అస్తిత్వం, స్వయంపాలన ప్రాధాన్యం, అభివృద్ధి ప్రస్థానం మరియు భవిష్యత్ సవాళ్లపై సమగ్ర విశ్లేషణ. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న ఆరు దశాబ్దాల పోరాట గాథను తెలుసుకోండి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది కోట్లాది మంది ప్రజల ఆరు దశాబ్దాల ఆకాంక్ష. వేలాది మంది అమరుల త్యాగ ఫలం. తెలంగాణకు ఇక్కడి ప్రజలు గర్వపడేలా వేల ఏళ్ల చరిత్ర, శతాబ్దాల సాంస్కృతిక అస్తిత్వం, దశాబ్దాల ఉద్యమాల చరిత్ర ఉన్నది. జూన్ 2 అంటే కేవలం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మాత్రమే కాదు. తమ ఆత్మగౌరవాన్ని, స్వీయ అస్తిత్వాన్ని, స్వయంపాలన హక్కును సాధించుకున్న చారిత్రక ఘట్టం.
తెలంగాణకు ఎంతో ఘనమైన చారిత్రిక మూలాలు ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లో ఈ ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’గా పేర్కొన్నారు. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం అనే మూడు ప్రసిద్ధ శైవ క్షేత్రాల ఆధారంగా ఈ పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. గ్రీకు రచయితల గ్రంథాల్లో “తెలివహ” లేదా “తెలింగ” అనే ప్రస్తావనలు కనిపిస్తాయి. క్రీస్తు శకం 11వ, 12వ శతాబ్దాలకు చెందిన కొన్ని శాసనాల్లో ‘తెలంగాణపురం’, ‘తెలుంగాణ’ వంటి పదాలు దర్శనమిస్తాయి. ఈ చారిత్రక ఆధారాలు తెలంగాణకు ప్రత్యేకమైన భౌగోళిక, సాంస్కృతిక అస్తిత్వం ఉందని స్పష్టం చేస్తున్నాయి.
అన్యాయం జరుగుతుందని ఆవేదనతో..
శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయుల పాలనలో తెలంగాణ గొప్ప నాగరిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. కాకతీయుల కాలంలో సాగునీటి వ్యవస్థ, ప్రజా సంక్షేమం, సాంస్కృతిక వికాసం విశేషంగా పెరిగాయి. అనంతరం నిజాం పాలనలో, ముఖ్యంగా రజాకార్ల అరాచకాల నేపథ్యంలో, తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా సాగిన రైతాంగ సాయుధ పోరాటం భూస్వామ్య దోపిడీ, నిరంకుశ పాలనకు సవాల్ విసురుతూ తెలంగాణలో ప్రజాస్వామ్య చైతన్యానికి పునాదులు వేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు కాలేదనే భావన తెలంగాణ ప్రజల్లో పెరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతోందనే ఆవేదనతో 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. విద్యార్థులు, యువత ముందుండి నడిపిన ఈ ఉద్యమం ప్రాంతీయ స్వాభిమానానికి ప్రతీకగా నిలిచింది.
తొలి దశ ఉద్యమం అణిచివేయబడినా..
తొలి దశ ఉద్యమం అణచివేయబడినా తెలంగాణ ఆకాంక్షను ఎవరూ అణచలేకపోయారు. అదే ఆవేదన, అదే ఆత్మగౌరవ భావన 21వ శతాబ్దంలో మలిదశ ఉద్యమానికి రూపం ఇచ్చింది. పల్లె నుండి పట్నం వరకు, విద్యార్థుల నుండి ఉద్యోగుల వరకు, కార్మికుల నుండి కర్షకుల వరకు, అన్ని వర్గాల ప్రజలు తమ పార్టీ జెండా, ఎజెండాలను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఒక్కటైన ఘట్టం చారిత్రాత్మకం. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, రైల్ రోకో, వంటావార్పు వంటి వినూత్న నిరసనలు తెలంగాణ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో చర్చించేలా చేశాయి. అమరుల త్యాగాలు, ప్రజల పోరాటాలు, ఉద్యమకారుల అంకితభావం, పార్టీలకు అతీతంగా ఐక్య కార్యాచరణ కోసం జేఏసీ ప్రజల్లో అవిశ్రాంతంగా చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. అనేక రంగాల్లో తెలంగాణ తన ప్రత్యేక ముద్ర వేస్తోంది. స్వయం పాలన ద్వారా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని రాష్ట్రం సద్వినియోగం చేసుకుంటోంది.
రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే..
అయితే తెలంగాణ ఆవిర్భావం వెనుక ఉన్న చరిత్రను, త్యాగాలను కొంతమంది నాయకులు మరచి పోవడం శోచనీయం. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అస్తిత్వాన్ని, ఉద్యమ స్ఫూర్తిని బలహీనపరిచే కుటిల ప్రయత్నాలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన పోరాటాల చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తెలంగాణ సమాజం అప్రమత్తంగా గమనిస్తోంది. ఈ రాష్ట్రం ఎవరో ఇస్తేనో, మరెవరో తెస్తేనో ఏర్పడలేదు. ఇది ప్రజల రక్తంతో, కన్నీటితో, త్యాగాలతో సాధించుకున్న హక్కు. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యంగాబద్ధంగా పార్లమెంట్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆమోదించింది. రైతాంగ పోరాట స్ఫూర్తిని, తొలిదశ ఉద్యమ త్యాగాలను, మలిదశ ఉద్యమ సంకల్పాన్ని తన గుండెల్లో దాచుకున్నది తెలంగాణ సమాజం. అందుకే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ రాజకీయ కుట్రనైనా, ఏ స్వార్థపూరిత ప్రయత్నాన్నైనా ప్రజాస్వామ్య బద్ధంగా తిప్పికొట్టే శక్తి తెలంగాణ ప్రజలకు ఉంది.
పుష్కర కాలం గడిచినా..
అయితే, స్వరాష్ట్రం సాకారమై పుష్కరకాలం గడిచినా విభజన సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. ప్రభుత్వంలో పార్టీలు మారుతున్నాయి. ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం కాకుండా సంక్షేమం, అభివృద్ధి, నాణ్యమైన విద్య, వైద్యం, సకాలంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తూ, వారి ఆశయాలకు అనుగుణంగా సమానత్వం, స్వాభిమానం, అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా తెలంగాణను మరింత ముందుకు తీసుకెళ్లడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. అదే అమరుల త్యాగాలకు నిజమైన నివాళి.
-అప్పాసి సురేందర్
86886 87968






