తెలంగాణ వస్తే చీకటవుతుందన్నారు.. కానీ

by Ravi |   (  Updated:2026-06-02 04:25:57  IST  )

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, అమరవీరుల త్యాగాలు, సాంస్కృతిక వైభవం, అభివృద్ధి విజయాలు, నవతెలంగాణ నిర్మాణ ప్రస్థానంపై సమగ్ర విశ్లేషణ.

తెలంగాణ వస్తే చీకటవుతుందన్నారు.. కానీ
X

'తెలంగాణ వస్తే చీకటవుతుంది' అన్న వారి మాటలను పటాపంచలు చేస్తూ, నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది తెలంగాణ. తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి మాటలు అక్షర సత్యాలు అవుతున్న కాలమిది. వందలాది అమరుల ఆత్మబలిదానాల చెలిమిలోంచి పుట్టిన తెలంగాణ దశాబ్దాల తన కలను సాకారం చేసుకుంటోంది. నేడు స్వయంపాలనలో సగర్వంగా ముందడుగు వేస్తోంది. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవ డమే ఈ ఆవిర్భావ దినోత్సవం అసలు ప్రాముఖ్యత.

2014 జూన్ 2వ తేదీన భారత దేశపటంలో 29వ రాష్ట్రంగా అవతరించింది తెలంగాణ. నేటి ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ఆత్మగౌరవ ప్రతీక, వీరుల బలిదానాల స్మరణ. తెలంగాణ ఏర్పాటు వెనుక ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, వేలాది మంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీన‌మైన నాటి నుంచే వివక్షకు వ్యతిరేకంగా స్వరాష్ట్ర ఆకాంక్ష మొదలైంది. 1969 తొలిదశ ఉద్యమంలో విద్యార్థులు, యువత ప్రాణాలర్పించి ప్రత్యేక రాష్ట్ర కాంక్షను బలంగా చాటారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో సాకారం అయిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, సకల జనుల సమ్మె, విద్యార్థుల త్యాగాలు, అమరుల ఆత్మబలిదానాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అనివార్యం చేశాయి.

నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంతో..

మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నిరాహార దీక్ష, 'తెలంగాణ సిద్ధాంతకర్త' జయశంకర్ సార్ దిశా నిర్దేశం ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాయి. సకల జనుల సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, కవులు, కళాకారులు, విద్యార్థులు, రైతులు... ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి 'సకల జనుల సమ్మె', 'మిలియన్ మార్చ్', 'సాగర హారం' వంటి అపూర్వ ఘట్టాలతో ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. సంస్కృతి, సాంప్రదాయాల నిలయంగా తెలంగాణ సంస్కృతి ఎంతో ప్రత్యేకమైనది. తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉండి, కాలక్రమేణా ఉవ్వెత్తున ఎగసిపడింది. 'నీళ్లు, నిధులు, నియామకాలు' అనే మూడంచెల నినాదంతో సాగిన ఉద్యమం ప్రతి గుండెను తట్టి లేపింది.

అన్ని రంగాలలోనూ అద్భుతమైన ప్రగతి..

ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన నాటి నుండి నేటి వరకు, తెలంగాణ అన్ని రంగాలలోనూ అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. గంగ-జమున తహజీబ్ (మతసామరస్యం) ఇక్కడి జీవన విధానం. పండుగలలో చూసుకుంటే రాష్ట్ర పండుగలుగా ప్రకృతిని పూజించే 'బతుకమ్మ', వీరత్వాన్ని చాటే 'బోనాలు', తెలంగాణ కీర్తిని, వైభవాన్ని, ప్రత్యేకతను చాటుతాయి. తెలంగాణ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఇక్కడి చారిత్రక కట్టడాలు. కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనమైన వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి తలమానికాలు. అలాగే, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారలమ్మ జాతర వంటి పండుగలు ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతాయి. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ జీవనది. కళలు, సాహిత్యంలో పోతన భాగవతం, సింగిడి కవిత్వం, ఒగ్గు కథలు, చిందు యక్షగానాలు, పెరిణి శివతాండవం వంటి కళలు తెలంగాణ సృజనాత్మకతకు నిదర్శ‌నాలు. చారిత్రక కట్టడాల్లో వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం (యునెస్కో గుర్తింపు పొందినది), గోల్కొండ కోట, చార్మినార్ వంటి కట్టడాలు శిల్పకళా వైభవానికి సాక్ష్యాలు. ప్రగతి పథంలో ప్రస్థానంలో స్వరాష్ట్రంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది.

చీకటి తొలిగి వెలుగులు విరజిమ్ముతూ...

'తెలంగాణ వస్తే చీకటవుతుంది' అన్న వారి మాటలను పటాపంచలు చేస్తూ, ప్రతి రంగంలోనూ ప్రగతి వెలుగులు విరజిమ్ముతూ దేశానికే దిక్సూచిగా నిలిచింది తెలంగాణ. వ్యవసాయ రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎడారి లాంటి భూములు సైతం నేడు పచ్చని పంట పొలాలుగా మారాయి. 'మిషన్ కాకతీయ'తో చెరువులు పునరుద్ధరించ బడ్డాయి. ఐటీ పరిశ్రమలో హైదరాబాద్ నగరం ప్రపంచ ఐటీ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. టీ-హబ్ ద్వారా స్టార్టప్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సంక్షేమంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మన స్వయం పాలనను, మన హక్కులను గుర్తుచేసుకునే ఒక గొప్ప సందర్భం. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడమే ఈ దినోత్సవం అసలు ప్రాముఖ్యత.

దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం!

వ్యవసాయం, సాగునీరు, ఐటీ, పారిశ్రామికాభివృద్ధి వంటి రంగాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అనేది అమరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేసే శుభదినం. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేరిన ఈ చారిత్రక రోజున, తెలంగాణ ప్రజలం‌దరూ ఐక్యమత్యంతో ముందుకు సాగుతూ, నవ తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. త్యాగాల పునాదులపై నిర్మించబడిన తెలంగాణ నేడు ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోంది. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణను సాధించుకోవడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి. ఆవిర్భావ దినోత్సవ వేళ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ, రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తామని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్! జై తెలంగాణ!!

-జాటావత్ రాజు

తెలంగాణ విశ్వవిద్యాలయం

93471 96264

ఆత్మగౌరవ పోరాటాలకు చిరునామా

Next Story