ప్రజల భావోద్వేగాలే.. తెలంగాణ సినిమాలుగా

by Ravi |   (  Updated:2025-04-12 01:15:12  IST  )

సినిమా, సాహిత్యం రెండూ భిన్నమైన మాధ్యమాలుగా కనిపించినప్పటికీ. సాహిత్యం వ్యక్తిగత సృష్టి అయితే.. సినిమా

ప్రజల భావోద్వేగాలే.. తెలంగాణ సినిమాలుగా
X

సినిమా, సాహిత్యం రెండూ భిన్నమైన మాధ్యమాలుగా కనిపించినప్పటికీ. సాహిత్యం వ్యక్తిగత సృష్టి అయితే.. సినిమా దర్శకుడి మేధో మధనం నుండి ఉత్పన్నమైనది. అయినప్పటికి సామూహికంగా పలువురు కళాకారులు సాంకేతిక నిపుణులు కలిసి రూపొందించాల్సి ఉంటుంది. రెంటి మధ్య భిన్నత్వం వున్నప్పటికీ సామాజిక దర్పణాలుగా ఏకత్వాన్ని కలిగి వున్నాయి. అంటే రెంటి మధ్య సాధారణంగా కనిపించే భిన్నత్వం, అసాధారణంగా కనిపించే ఏకత్వం వున్నాయి. సాహిత్య పఠనం వ్యక్తిగత అనుభవమైతే సినిమా వీక్షణం సామూహిక అనుభవం.

పాఠకుడికి, ప్రేక్షకుడికి ఆయా సందర్భాల్లో మిగిలే అనుభూతి భిన్నమైంది. రచనల్లో జీవిత దృశ్యాలు పదాలుగా నిర్మితమయితే సినిమాల్లో దృశ్యాలుగా రూపొందుతాయి. సాహిత్య రచన మొదట పాఠకుడి ఆలోచనా సహజాతం పై ముద్ర వేసి క్రమంగా అక్కడి నుండి భావోద్వేగాన్ని కలిగింప చేస్తుంది. కానీ సినిమా మొదటే భావోద్వేగాల్ని ప్రభావితం చేసి ఆ తర్వాత సినిమా స్థాయిని బట్టి ప్రేక్షకుడి ఆలోచనలపై ప్రభావాన్ని కలిగిస్తుంది

గొప్ప రచనలు సినిమాలుగా..

ప్రధాన స్రవంతి తెలుగు సినిమాల్లో అనేక వాణిజ్య నవలలు సినిమాలుగా వచ్చాయి. గొప్ప రచనలు సమాంతర సినిమాలుగా వచ్చాయి. తెలుగు సాహిత్యానికి తెలంగాణ పుట్టిల్లు. ఉత్తమ రచనలకు గొప్ప సాహిత్య విలువలకు నిలయం. అంతే కాదు ఉత్తమ నవలలను, కథలను కొన్నింటిని రూపాంతరీకరించిన సినిమాలుగా మలచిన చరిత్ర తెలంగాణది. సినిమా రంగంలో అరకొర ప్రాతినిధ్యం వున్నప్పటికీ తెలంగాణ నేపథ్యంలో గొప్ప రచనలను సినిమాలుగా మలిచి జాతీయ అంతర్జాతీయ గుర్తింపునూ గౌరవాన్ని సాధించింది.

రూప భేదమే తప్ప.. భావ భేదం లేదు

తెలంగాణ సినిమా సాహిత్య రూపాంతీకరణలో ముందుండి ఉత్తమ సాహిత్య విలువలు సామాజిక నేపథ్యం ఉన్న నవలల్ని, కథల్ని దృశ్య రూపంలోకి తర్జుమా చేసి విజయవంతమైన సినిమాలు తీశారు. ఉత్తమ సాహిత్యమూ సినిమాల మధ్య రూప భేదమే తప్ప భావ భేదం లేదని నిరూపించారు. సాహిత్యంలో భావ లయ, అర్ధవంతమైన సినిమాల్లో దృశ్య లయ రెండూ సమాంతరమేనని నిరూపించారు.

చివరకు మిగిలేది, ఒక ఊరి కథ

ఆ క్రమంలో 1960లోనే వచ్చిన 'చివరకు మిగిలేది' బెంగాలీ రచయిత అశుతోష్ ముఖర్జీ రచించిన ‘నర్స్ మిత్రా' కథ ఆధారంగా నిర్మించబడింది. దర్శకుడు జి. రామినీడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప్పునూతల పురుషోత్తమ్ రెడ్డి నిర్మాత కాగా ఆయన మిత్రులు ఏం. సత్యనారాయణ రావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, జి.విద్యాసాగర్ రెడ్డి, మండల్రెడ్డి కొండల్ రెడ్డి సహ నిర్మాతలుగా సహకరించారు. తర్వాత 1977 లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ భారతీయ మహా రచయిత ప్రేంచంద్ రచన 'కఫన్' ఆధారంగా ' ఒక వూరి కథ' తీశారు. 1978లో శ్యామ్ బెనెగల్ మరాఠీ రచయిత చింతామణి ఖానోల్కర్ నవల ఆధారంగా 'అనుగ్రహం' నిర్మించారు.

తెలంగాణ సినిమాకు లాండ్‌మార్క్

ఇక తెలంగాణ సినిమాల్లో విశిష్టమయిన విజయవంతమైన సినిమాగా నిలిచిన 'మా భూమి' కిషన్ చందర్ రాసిన 'జాబ్ ఖేత్ జాగే' నవలను రూపాంతరీకరించింది. రజాకార్లకు (నిజాంకు) వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని వాస్తవిక దృక్పథంతో తీసిన సినిమా మా భూమి. గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో రూపొందింది. మాభూమి తెలంగాణ సినిమా చరిత్రలో ఓ లాండ్ మార్క్. ఇక హైదరాబాద్ చుట్టూ పక్కల వుండిన వేశ్యావాటికల సామాజిక ఆర్థిక నేపథ్యంతో గులాం అబ్బాస్ రాసిన చిన్న నవల ఆధారంగా శ్యామ్ బెనెగల్ ‘మండిట సినిమా రూపొందింది.

చిల్లర దేవుళ్లు..

1977లోనే తెలుగు సినిమా రంగంలో ఆదుర్తి సుబ్బారావు లాంటి వాళ్ల దగ్గర పనిచేసి ‘తాళిబొట్టు’ లాంటి విజయవంతమైన సినిమాలు తీయడంతో పాటు పలు హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించిన మాధవరావు 'చిల్లరదేవుళ్లు' సినిమాను వరంగల్‌కు చెందిన కొంతమంది మిత్రులతో కలిసి తీశాడు. 'ఏటి కేతం బట్టి ఎయ్యి పుట్లు పండించి ఎన్నడూ మెతుకేరుగరన్నా’ 'కలువకు చెంద్రుడు ఎంతో దూరం’, ‘పాడాలనీ వున్నది’ లాంటి మంచి పాటలతో ఆత్రేయ, కె.వి మహదేవన్ లాంటి వాళ్ళతో కలిసి నిర్మించిన ఆ సినిమా తెలంగాణ అంశం మీద వచ్చిన తొలి సినిమాగా చెప్పుకోవచ్చు.

ఊరుమ్మడి బతుకులు..

‘చిల్లర దేవుళ్లు’ కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. సాయుధ పోరాటానికి ముందున్న తెలంగాణ జీవితాన్ని చిత్రించే పనిని నవలలో తెలంగాణ విశిష్ట నవలా రచయిత దాశరథి రంగాచార్య ఎంతగా విజయవంతంగా చేశారో, ఈ సినిమాలో కూడా టి.మాధవరావు అంతే విజయవంతంగా చేశారు. దాదాపుగా అదే కాలంలో బి.ఎస్.నారాయణ తన 'ఊరుమ్మడి బతుకులు' సినిమాని సి.ఎస్. రావు రచన ఆధారంగా తీశారు. ఆ సినిమా జాతీయ అవార్డును అందుకోవడంతో పాటు పలు దేశాల్లో చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. 1983లో మాజీ ఎం.ఎల్.సి. నారాదాసు లక్ష్మణ్ రావు తన మిత్రులతో కలిసి ఉదయ కుమార్ దర్శకత్వంలో నిర్మించిన 'విముక్తి కోసం' భూషణం రాసిన కథ ఆధారంగా నిర్మించబడింది.

ప్రజల సంస్కృతికి ప్రతిబింబం

వాటన్నింటిలో ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల జీవన రీతులు మానవ సంబంధాలూ అన్నీ దృశ్య రూపంలోకి అనువదించబడి అర్థవంతమైన ప్రయత్నాలుగా నిలిచాయి. ఇట్లా మంచి సాహిత్యానికీ, మంచి సినిమాకు తెలంగాణలో పెద్ద పీట వేశారు. సాహిత్యం ఎంతగా ప్రజల్నీ సంస్కృతినీ పట్టించుకున్నదో వున్న కొద్దిపాటి తెలంగాణ సినిమా కూడా ప్రజలనీ సంస్కృతినీ పట్టించుకుంది. తెలంగాణాలో సాహిత్యమూ, సినిమా కళాత్మకతతో కూడి ప్రశంసలు అందుకున్నాయి.

- వారాల ఆనంద్

94405 01281

Next Story