దావోస్‌లో తెలంగాణ వైభవం

by Disha edit |
దావోస్‌లో తెలంగాణ వైభవం
X

ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జనవరి 16-20 వరకు స్వట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగింది. ఇందులో మన రాష్ట్రం తన సత్తాను చాటింది. మన రాష్ట్రంలో మల్టీ నేషనల్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి అనుకూల పరిస్థితులు, మౌలిక సదుపాయాలు ఉండటంతో ప్రపంచంలోని పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభించింది. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వివిధ దేశాల ప్రతినిధులు, వివిధ కంపెనీల సీఈఓలు, మన దేశం తరఫున కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, మనసుఖ్ మాండవీయ పాల్గొన్నారు. మన రాష్ట్రం తరపున ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్ రంజన్ పాల్గొన్నారు. ఈ సదస్సు వినియోగించుకొని రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో సఫలీకృతుడయ్యారు కేటీఆర్.

పెట్టుబడులు..

ఈ సదస్సులో పలు దిగ్గజ సంస్థలు తెలంగాణలో మొత్తం 21 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అందులో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడి పెట్టి హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తోంది, అలాగే రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో భారతీ ఎయిర్‌టెల్ భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్‌ను స్థాపించనుంది. అలాగే ఫార్మా రంగానికి చెందిన యూరోపియన్స్ సంస్థ జీనోమ్ వ్యాలిలో రూ. వెయ్యి కోట్లతో అత్యాధునిక లేబొరేటరీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది, అలాగే పెప్సికో.. పీ అండ్ జీ.. అల్లాక్స్.. అపోలో టైర్స్.. వెబ్ పీటీ.. ఇన్ స్పైర్ బ్రాండ్ వంటి సంస్థలు 2 వేల కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే ఈ సదస్సులో జీవశాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై దృష్టి పెడుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక, తమ అధ్యయన కేంద్రం సిఫోర్ఐఆర్ ను హైదరాబాదులో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. ఇది దేశంలో మొట్టమొదటి అధ్యయన కేంద్రం. ఈ అధ్యయన కేంద్రంకి దాదాపు 2000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆర్థిక వేదిక పెట్టుబడి పెట్టనున్నది. ప్రస్తుతం అమెరికా యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల్లోనే ఈ కేంద్రాలు ఉన్నాయి. జీవ శాస్త్ర రంగంలో తెలంగాణలో అనుకూలతలు ఉండడంతో ఈ అధ్యయన కేంద్రం ఇక్కడే ఏర్పాటు చేయనున్నారు. ఈ అధ్యయన కేంద్ర సాంకేతికతను ఉపయోగించుకొని ఈ రంగంలో భారతదేశం శక్తివంతం కావడానికి ఇది దోహదపడుతుంది.

అలాగే ఈ సదస్సులో ప్రపంచంలోని దేశాలపై ఒక నివేదికను ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దేశంలోని 40 శాతం సంపద కుబేరుల వద్ద ఉన్నట్లు తెలిపింది. ఈ సదస్సులో ప్రపంచ దేశాల నుండి 40 కి పైగా సీఈఓలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఆహార ఔషధ పర్యావరణ సౌందర్య సాధనాల ప్రఖ్యాత ఉత్పత్తి సంస్థ యూరోపియన్ కార్యకలాపాలకు తెలంగాణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే తెలంగాణలో మైక్రోసాఫ్ట్ పదహారు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి తమ డేటా కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ పెట్టుబడితో ఇదివరకే హైదరాబాదులో ఉన్న తమ డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్ సంస్థ మరింత విస్తరిస్తుంది. అలాగే అమెజాన్ సంస్థ హైదరాబాదులో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా పెట్టుబడులు పెట్టి వేల కోట్లతో వారి కార్యకలాపాలను విస్తరిస్తారు. ప్రస్తుతం ఉన్న అమెజాన్ పెట్టుబడులు రూ. 16 వేల కోట్ల నుంచి 36 వేల కోట్లకు పెరుగుతాయి. ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొని 21 వేల పెట్టుబడులను సాధించింది. దీని ద్వారా దాదాపు 30 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది. ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయం అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన మాట నిజమేనని భావించవచ్చు. దావోస్ సదస్సు ద్వారా తెలంగాణ ప్రతిష్ట మరింత పెరిగే అవకాశం ఏర్పడింది.

శ్రీనర్సన్

జర్నలిస్ట్

83280 96188

Also Read...

దావోస్‌లో తెలంగాణ వైభవం



Next Story

Most Viewed