విద్యా సంస్కరణలా.. ఉపాధ్యాయులపై నిందలా?

by Ravi |   (  Updated:2026-03-11 01:01:09  IST  )

తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బోధనేతర పనులు, ఖాళీ పోస్టులు, మౌలిక వసతుల సమస్యలను పక్కన పెట్టి ఉపాధ్యాయులపైనే బాధ్యత మోపడం సరైందా అనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.

విద్యా సంస్కరణలా.. ఉపాధ్యాయులపై నిందలా?
X

తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామంటూ ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ ఇటీవల సమర్పించిన నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నివేదికలోని కొన్ని అంశాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఉపాధ్యా యులను ఈ వ్యవస్థలో ‘అపరాధులు’గా నిలబెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యం బాగున్నా, ఆ లక్ష్య సాధన కోసం కమిషన్ ఎంచుకున్న మార్గాలు, చేసిన సిఫారసులు మాత్రం ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర విస్మయానికి గురి చేస్తున్నాయి.. కేవలం ఉపాధ్యాయులను మాత్రమే బాధ్యులుగా చిత్రీకరిస్తూ, వారిపై నిఘా పెంచడం, శిక్షలు విధించడం వంటి ప్రతిపాదనలు ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధంగా ఉన్నాయి.

బోధనేతర పనులపై.. కమిషన్ మౌనం!

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడం లేదు.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, బియ్యం నిల్వల లెక్కలు, కోడిగుడ్ల పంపిణీ పర్యవేక్షణ వంటి పనులకే వారి సమయంలోని సగ భాగం సరిపోతోంది. దీనికి తోడు జనాభా గణన, కుల గణన, ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నారు. బోధన నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణమైన ఈ ‘బోధనేతర పనుల’ భారాన్ని తగ్గించాలని ఉపాధ్యాయులు దశాబ్దాలుగా మొత్తుకుంటున్నారు.. అయితే కమిషన్ వీటిని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం ఉపాధ్యా యుడి పనితీరునే ఎండగట్టడం పక్షపాత వైఖరి కాదా?

ఉపాధ్యాయుడిని బలిపశువును చేసి..

కమిషన్ నివేదికలో ప్రధానంగా ఉపాధ్యాయుల పని తీరును అంచనా వేసే విధానం అత్యంత వివాదాస్పదం. ప్రతి ఐదేళ్లకోసారి ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించి, రెండు సంవత్సరాల తర్వాత ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే వారిని సర్వీసు నుంచి తొలగించవచ్చనే ప్రతిపాదన ఉపా ధ్యాయులను తీవ్ర అభద్రతా భావంలోకి నెట్టి వేస్తోంది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగ బద్ధంగా ఉండే ఉద్యోగ భద్రతను కాలరాయడం అంటే, వారిని రాజకీయ నాయకుల లేదా ఉన్నతాధికారుల కక్ష సాధింపులకు బలి చేయడమే! విద్యార్థుల ఫలితాలు కేవలం ఉపాధ్యాయుడి బోధనపైనే ఆధార‌పడి ఉండవు.. పాఠశాల మౌలిక సదుపాయాలు, విద్యార్థి సామాజిక నేపథ్యం, పోషకాహారం వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటన్నింటినీ విస్మరించి కేవ లం ఉపాధ్యాయుడిని ‘బలిపశువు’ను చేయడం అన్యాయం.

వ్యక్తిగత స్వేచ్ఛపై ఆంక్షలు..

దశాబ్దాలుగా ఉపాధ్యాయులు తమ సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు పొందుతున్నారు. వృత్తిపరమైన ఎదుగు‌దలకు ఒక భరోసా. అయితే, ఆటోమేటిక్ ప్రమోషన్లను రద్దు చేసి, కేవలం ‘మెరిట్’ లేదా ‘పనితీరు’ ఆధారంగానే పదోన్న‌తులు ఇవ్వాలనడం ఉపాధ్యాయుల మధ్య అనారోగ్యకరమైన పోటీని సృష్టిస్తుంది. ఇది పాఠశాలల్లో ఉండాల్సిన సహకార వాతావరణాన్ని దెబ్బతీసి, గ్రూపు రాజకీయాలకు దారి తీస్తుంది. అలాగే ఉపాధ్యాయులు తాము పనిచేసే గ్రామంలోనే నివసించాలనే నిబంధన అశాస్త్రీయమైనది. ఏ ఇతర ప్రభుత్వ శాఖలోనూ ఇలాంటి కఠిన నిబంధన లేదు. కనీస సౌకర్యాలు లేని గ్రామాల్లో నివసించాలని బలవంతం చేయడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత జీవితం, వారి పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల ఆరోగ్యం వంటి అంశాలను కమిషన్ పూర్తిగా విస్మరించింది.

వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే..

రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సింగిల్ టీచర్ స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. ఈ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి, ఉపాధ్యాయులే పని చేయడం లేదనే ముద్ర వేయడం కమిషన్ పక్షపాత వైఖరిని సూచిస్తోంది. ఉపాధ్యాయులకు కనీస వసతులు కల్పించకుండా కార్పొరేట్ స్థాయి ఫలితాలను ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రైవేట్ పాఠశాలలతో పోలుస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులను తక్కువ చేసి చూడటం సమాజంలో వారికున్న గౌరవాన్ని తగ్గిస్తుంది. అలాగే D.El.Ed వంటి కోర్సులను రద్దు చేయాలనే ప్రతిపాదన ప్రాథమిక విద్యా వ్యవస్థ పునాదులను దెబ్బతీసే అవకాశం ఉంది. ఒకప్పుడు గురువును దైవ సమానంగా చూసిన సమాజంలో, నేడు వారిని నిరంతరం నిఘా నీడలో ఉంచాలని చూడటం విచారకరం.

సిఫార్సులను పునఃసమీక్షించుకోవాలి..!

ఏ సంస్కరణలైనా ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తూ సాగాలి తప్ప, వారిని భయపెడుతూ సాగకూడదు.. భయం ఉన్న చోట సృజనాత్మకత సాధ్యం కాదు. తెలంగాణ విద్యా కమిషన్ తన సిఫార్సులను పునఃసమీక్షించుకోవాలి. ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇవ్వడం వంటి సానుకూల చర్యల ద్వారానే విద్యా వ్యవస్థలో మార్పు సాధ్యం. ప్రభుత్వం కేవలం కమిషన్ నివేదికను మాత్రమే కాకుండా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సంఘాల ఆవేదనను కూడా పరిగణనలోకి తీసుకో‌వాలి. అప్పుడే తెలంగాణలో విద్యా వ్యవస్థ పున ర్నిర్మాణం జరుగుతుంది.

-జుర్రు నారాయణ యాదవ్

తెలంగాణ టీచర్స్ యూనియన్

9494019270

Next Story